
- ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో మార్పులు చేసినం: వీపీ గౌతమ్
- అవగాహన కల్పించాలని అధికారులకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. తమ ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లుల రిలీజ్ కోసం లబ్ధిదారులే స్వయంగా ఫొటోలు అప్లోడ్ చేసే అవకాశం కల్పించినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ పీడీలతో హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని కార్పొరేషన్ ఆఫీస్ నుంచి వీపీ గౌతమ్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘‘ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఎలా ఉపయోగించాలో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి. పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఎక్కడి నుంచైనా తెలుసుకునేందుకు వీలుగా యూనివర్సల్ సెర్చ్ అందుబాటులోకి వచ్చింది. బిల్లు ఏ స్టేజ్‌లో ఉంది? ఎన్ని రోజులుగా పెండింగ్ ఉంది? ఏ తేదీన.. ఎన్ని డబ్బులు పడ్డాయి? వంటి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అవినీతి అరికట్టడంతో పాటు జాప్యాన్ని నివారించొచ్చు’’అని వీపీ గౌతమ్ తెలిపారు.
ఫొటోలు అప్లోడ్ చేసే విధానం
- ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దాన్ని ఫిల్ చేసి బెనిఫిషియరీ లాగిన్ అవ్వాలి.
- డాష్ బోర్డులో లబ్ధిదారు పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి. క్యాప్చర్ ఫొటోగ్రాఫ్ కింద గ్రౌండింగ్, బేస్ మెంట్, వాలింగ్, శ్లాబ్, నిర్మాణం అనే ఆప్షన్లు ఉంటాయి.
- కెమెరాలో జియో ట్యాగింగ్ కోసం మ్యాప్ సింబల్‌ను క్లిక్ చేసి వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ చేయాలి. తర్వాత బ్యాక్ వెళ్లి గ్రౌండింగ్ బటన్ నొక్కితే వివరాలన్నీ కనిపిస్తాయి.
- నిర్మాణ పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్ధిదారుతో పాటు ముందు, పక్కకు, పై నుంచి (టాప్ యాంగిల్)లో ఫొటోలు తీయాలి. ఈ పిక్స్ గ్రౌండింగ్ టైమ్‌లో ఫొటోలు తీసిన ప్రాంతం దగ్గరి నుంచే తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యాప్‌లో అడిగిన వివరాలు ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. ఇదే తరహాలో ఇంటి నిర్మాణంలో ఉన్న స్టేజీ ఆధారంగా ఫొటోలు అప్లోడ్ చేస్తే బిల్లులు సాంక్షన్ అవుతాయి.
- నమోదైన వివరాలు కరెక్ట్ ఉన్నాయో.. లేదో విలేజ్ సెక్రటరీలు, ఎంపీడీవోలు, డీఈఈలు, పీడీలు తెలుసుకుంటారు. అన్ని కరెక్ట్ ఉంటే బిల్లులు రిలీజ్ అవుతాయి.