బెంగాల్ టైగర్​ అశుతోష్ ముఖర్జీ.. విద్యార్థి జాతికి నిజమైన స్నేహితుడు

బెంగాల్ టైగర్​ అశుతోష్ ముఖర్జీ.. విద్యార్థి జాతికి నిజమైన స్నేహితుడు

అశుతోష్ ముఖర్జీ1864లో కలకత్తాలో జన్మించారు. కలకత్తా యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ మెడిసిన్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ముక్కుసూటి మనిషి. స్వతంత్ర భావాలు కలిగినవారు. స్వభాష, సాహిత్యం అంటే ఎంతో అభిమానిస్తారు. అప్పట్లోనే మెడిసిన్, ఆరోగ్య సమస్యలు, స్త్రీ సంక్షేమం గురించి పుస్తకాలు రాశారు. ఎన్నో పుస్తకాలను సేకరించేవారు. ఆయన లైబ్రరీ ఇండియాలోనే ప్రముఖంగా చెప్పుకోదగినది. ఆయన విస్తృతంగా అధ్యయనం చేసి పలు భాషలు, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, గణితం, న్యాయ విద్యను అవపోసన పట్టారు. గణితంలో రీసెర్చ్ చేయాలనుకున్నారు. కానీ, ఆ అవకాశం రాకపోవడంతో ‘లా’ని ప్రొఫెషన్​గా ఎంచుకున్నారు. 24 ఏండ్ల వయసులో కలకత్తా యూనివర్సిటీ ఫెలో అయ్యారు. 

ఆయనకు చిన్నప్పటి నుంచి విద్యారంగంలో సేవలు చేయాలనే తపన ఉండేది. ముప్పై ఏండ్లు పూర్తికాక ముందే లీగల్ స్టడీస్​లో స్పెషలైజేషన్ చేశారు. యూనివర్సిటీ సిండికేట్​ సభ్యుడిగా ఉన్నప్పుడే ‘డాక్టర్ ఆఫ్ లా’ డిగ్రీ పొందారు. 40వ ఏట కలకత్తా హైకోర్టు బెంచికి ప్రమోట్ అయ్యారు. 20 ఏండ్లు ఆ పదవిలో ఉన్నారు. యూనివర్సిటీ విద్య విషయంలో ఆయన ఎంతో కృషి చేశారు. 1889 నుంచి ఆయన చనిపోయేంత(1924) వరకు ఆయన యూనివర్సిటీ ఫెలోగా ఉన్నారు. 1906 నుంచి 1914వరకు, 1921నుంచి 1923వరకు ఆయన యూనివర్సిటీ వైస్​ ఛాన్స్​లర్​గా ఉన్నారు. ఆయన పదవిలో ఉన్నా, లేకున్నా 30 ఏండ్లపాటు ఆయనే యూనివర్సిటీలో డామినెంట్ పర్సన్. ఆయన విధానాలు, పని సర్​ రాస్ బిహారీ ఘోష్, సర్ తారక్ నాథ్​ వంటి వాళ్లతోపాటు ఎంతోమంది భారతీయులను ఆకర్షించాయి. వాళ్లిచ్చిన విరాళాలతో ‘యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ స్థాపించారు. ఆయన యువ మేధావులు, పండితులను ఎంపిక చేసుకుని వివిధ విజ్ఞాన శాస్త్ర విభాగాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపారు. ఈ పద్ధతి మంచి ఫలితాన్నిచ్చింది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ప్రఖ్యాత పండితులను కలకత్తాకు ఆహ్వానించి, తన టీచర్లు, విద్యార్థులు వాళ్ల దృష్టిలో పడేలా చేశారు. 

►ALSO READ | Summer tour: గ్యాడ్జెట్స్​..పోర్టబుల్​ ఫ్యాన్​.. ప్రయాణంలో ఉక్కపోత నుంచి రిలీఫ్​

ఆయన సాధించిన మరొక గొప్ప విషయం యూనివర్సిటీ విద్యాభ్యాసంలో బెంగాలీ భాషకు తగినంత ప్రాముఖ్యత కల్పించడం.. బెంగాలీని స్టడీ కోసం, హయ్యెస్ట్​ యూనివర్సిటీ పరీక్షలలో రీసెర్చ్ సబ్జెక్ట్​గా చేర్చడం జరిగింది. ముఖ్యమైన కార్యాలను బెంగాలీతోపాటు ఇతర భాషల్లో ప్రచురించే స్కీంను చేపట్టారు. తన దేశం మేధాపరంగా స్వేచ్ఛగా ఉండాలనేది ఆయన కల. విద్య ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వ్యాపించాలని, విద్య తన దేశస్తులను జాతీయతా భావం నుంచి వేరు చేయొద్దనేది ఆయన ఉద్దేశం.  

అశుతోష్ ఏ మాత్రం సుఖభోగాలు లేని జీవితం గడిపాడు. తన నిత్య జీవితంలో వేషధారణ, ప్రవర్తలో ప్రజలతో సంబంధాలలో నిరాడంబరత కనపరిచేవారు. 20 ఏండ్లు అధికారిగా ఉన్నప్పటికీ అయన జాతీయ దృక్పథాన్ని, ధైర్యాన్ని ప్రదర్శించారు. ప్రజల మనోభావాలను గాయపరిచేవారు కాదు. కొన్నిసార్లు పైకి కఠినంగా కనిపించినప్పటికీ మృదుత్వం, సానుభూతి, అర్థం చేసుకునే మనస్తత్వం కలవారు. సనాతన హిందువు, ఎన్నడూ విదేశాలకు వెళ్లలేదు. అయినప్పటికీ సంకుచిత భావాలు లేవు. కుల, మత, వర్గ భేదాలు పట్టించుకునేవారు కాదు. సాయం కోసం ఎవరొచ్చినా నెరవేరని వాగ్దానాలు చేసేవారు కాదు. బద్ధశత్రువైనా సరైన విధంగా సాయం కోరితే తప్పక చేసేవారు. అంతేకాదు.. అశుతోష్​ హాస్యచతురత కలిగినవారు. ఆయన నవ్వు స్థిరాస్థి లాంటిది. రవీంద్రనాథ్​ ఉద్దేశంలో ఆయన కలలు కనే ధైర్యం కలవారు. ఎందుకంటే పోరాడే శక్తి, విజయం పట్ల విశ్వాసం ఉంది. ఆయనది మానవసేవే మాధవ సేవ అనే మతం. బహుముఖ ప్రజ్ఞాశాలి, పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగినవారు కనుకనే ఆయన్ను ‘బంగ్లర్ బాఘ్​’ అని పిలుస్తారు. అంటే బెంగాల్​ టైగర్​ అని అర్థం. 

- మేకల 
మదన్​మోహన్​ రావు
కవి, రచయిత