
నాలుగేళ్ల చిన్నారిని సీఈవో, తల్లి సుచనా సేథ్ హత్య చేసిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుపుతున్న పోలీసులు.. కీలక విషయాలు రాబడుతున్నారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో ఈ హత్య ముందస్తు ప్రణాళికతో జరిగినట్లు తేలింది. జనవరి 10న గోవా పోలీసులు.. ఘటన జరిగిన గదిలో దగ్గు మందు ఖాళీ సీసాలు దొరకడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారికి దగ్గు సిరప్‌ను అధిక మోతాదులో అందించారని, అది అతన్ని గాఢ నిద్రలోకి జారుకునేలా చేసిందని ఇది సూచించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నారిని గుడ్డతో లేదా దిండుతో నలిపి, ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది. బాలుడి మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన డాక్టర్ కుమార్ నాయక్.. మెడపై గొంతునులిమి చంపిన గుర్తులు లేవు కానీ.. నాసికా సిరల్లో వాపు ఉన్నట్టు గమనించామని, ఊపిరి ఆడకపోవడం వల్లే చిన్నారి చనిపోయినట్టు వెల్లడించారు.
పిల్లవాడిపై ఆమె ఒక దిండు, గుడ్డ లేదా మరేదైనా వస్తువులను ఉపయోగించి ఉండవచ్చని, అయితే శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని, బాడీని చూస్తుంటే ఈ ఘటన 36 గంటల క్రితం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అంతకుముందు విడాకుల విచారణ సమయంలో సుచనా సేథ్ తన భర్త వెంకట్ రామన్‌పై గృహహింస కేసును దాఖలు చేశారు.. కోర్టు పత్రాల ప్రకారం, అతను పిల్లవాడిని, తనను తాను శారీరకంగా హింసించాడని ఆమె ఆరోపించింది. అతని వార్షిక ఆదాయం రూ. 1 కోటికి పైగా ఉందని పేర్కొంటూ నెలకు రూ. 2.5 లక్షల భరణం ఇవ్వాలని కోరింది.