
ఈ రోజుల్లో రోజుకో నయా రకం స్కాం బయటపడుతుంది. ప్రజలని రకరకాల స్కీములు, పెట్టుబడులు అంటూ చెబుతు దోచుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో కిట్టీ పార్టీల పేరుతో కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడిన ఒక మహిళను పోలీసులు అరెస్టు చేశారు. సవిత అనే 49 ఏళ్ల మహిళ ధనవంతులైన మహిళలతో స్నేహం చేసి, వారికి పైసా డబుల్ ఆఫర్ పేరుతో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇలాంటి కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన సవిత ఇప్పుడు మరోసారి పోలీసులకు పట్టుబడింది.
పోలీసుల కథనం ప్రకారం సవిత ఎక్కువగా కిట్టీ పార్టీల పేరుతో ధనవంతులైన మహిళలను పరిచయం చేసుకునేది. అలాగే తనకు చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు తెలుసు అని నమ్మించి తర్వాత దుబాయ్‌లో తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తాననని, తాను చెప్పినట్లు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మకం కల్పించేది. ఇలా దాదాపు 20 మందికి పైగా మహిళలను కోట్లలో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే కుసుమ అనే మహిళా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సవితను, ఆమెతో పాటు మరో ఆరుగురుని పోలీసులు అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ (FIR) ప్రకారం, కుసుమకు సవిత 30 ఏళ్లుగా తెలుసు. 2020 నుంచి వీరిద్దరి మధ్య డబ్బు లావాదేవీలు జరిగాయి. 2023లో సవిత కుసుమకు ఫోన్ చేసి దుబాయ్‌లో తక్కువ ధరకే బంగారం వస్తుందని, రెండేళ్లలో పెట్టుబడికి నాలుగింతలు అవుతుందని చెప్పి నమ్మించింది. దీంతో కుసుమ రూ. 24 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. ఈ డబ్బును కుసుమ తన సోదరుడికి, సవిత తల్లికి అలాగే కూతురికి ట్రాన్స్ఫర్ చేసింది.
తర్వాత, సవిత జనవరి 2024లో మళ్లీ కుసుమను సంప్రదించి తాను 'ఉదయ్ టీవీ ప్రాజెక్టు'లో పెట్టుబడి పెట్టి రెట్టింపు లాభం పొందానని చెప్పింది. మరో రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టమని కోరింది, దానికి కూడా రెట్టింపు లాభం వస్తుందని నమ్మించింది. గతనెల జూన్ 2025లో కుసుమ తన రూ. 95 లక్షలు తిరిగి ఇవ్వాలని సవిత ఇంటికి వెళ్ళగా, ఆమె తిరిగి ఇచ్చేందుకు నిరాకరించింది.
ALSO READ : హైదరాబాద్ కుషాయిగూడలో ఘోరం
విషయం ఏంటంటే సవిత ఈ మోసాలకు రాజకీయ పలుకుబడి పేరును ఉపయోగించుకుంది. వీరిలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక మంత్రి ఎం.బి. పాటిల్ వంటి ప్రముఖుల పేర్లను చెప్పి బాధితులని నమ్మించింది. ఈ విధంగా వారిని పెట్టుబడి పేరుతో మోసం చేసి డబ్బులు వసూల్ చేసింది. మరోవైపు సవిత గతంలో గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఇలాంటి కేసులో అరెస్టై బెయిల్‌పై బయటకు వచ్చింది.