టాటా ఐపీఎల్ 2024 ఇటీవలే మొదలైన నేపథ్యంలో దేశమంతా క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతున్నారు. తమ ఫెవరెట్ టీమ్ ని ఎంకరేజ్ చేయటం కోసం, తమ ఫేవరెట్ ప్లేయర్ ఆటను స్టేడియంలో చూసేందుకు చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ టికెట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ వాడుకొని టికెట్ల స్కామ్ కి తెరలేపారు కొందరు కేటుగాళ్లు. ఐపీఎల్ టికెట్ల పేరిట ఒక మహిళ నుండి రూ.86వేలు దోచుకున్న సంఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది.
మార్చి 29న శుక్రవారం నాడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ టికెట్ల కోసం ఒక 48ఏళ్ళ మహిళ ఇంటర్నెట్లో సర్చ్ చేస్తుండగా ఫేస్ బుక్ లో ఐపీఎల్ టికెట్స్ పేరుతో ఒక పేజ్ కనిపించింది. ఆ పేజ్ లో ఉన్న కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించింది. కాల్ ద్వారా కనెక్ట్ అయిన కేటుగాడు టికెట్స్ కావాలంటే ముందుగా అడ్వాన్స్ అమౌంట్ పంపమని అడిగాడు.
20టికెట్లు సొంతం చేసుకోవాలన్న ఆశతో ఏమీ ఆలోచించకుండా రూ.8000 ఆన్లైన్ ద్వారా పంపింది, ఆ తర్వాత మరో మూడు దఫాలుగా 11000, 8170, 14,999 రూపాయలు వేరువేరు అకౌంట్లకు పంపమని అడుగగా సదరు మహిళకు అనుమానం మొదలైంది. ముందు టికెట్స్ పంపమని మహిళ అడుగగా సాంకేతిక లోపం వల్ల టికెట్స్ పంపలేకపోతున్నామని, మరొక 16000 పంపాలని డిమాండ్ చేయటంతో ఆమెకు సీన్ అర్థమైంది. ఆ విధంగా మొత్తం 86వేల రూపాయలు కోల్పోయిన మమహిళ పోలీసులను ఆశ్రయించింది.