కరోనా తంటా.. టాప్ 10 సిటీల ర్యాంకులు తలకిందులు

కరోనా తంటా.. టాప్ 10 సిటీల ర్యాంకులు తలకిందులు


న్యూయార్క్​: కరోనాతో బతుకులే కాదు.. అన్నీ ఉల్టా పల్టా అయిపోతున్నాయి. సిటీల్లో బతికేందుకు సరైన సౌలతులూ కరువైపోతున్నాయి. ఆ ఎఫెక్ట్​తో మంచి బతుకులకు అనుకూలమైన సిటీల ర్యాంకులు తలకిందులైపోయాయి. టాప్​ 10లోని పట్నాలు కిందకు జారిపోతే.. మొన్నటిదాకా టాప్​10కు దరిదాపుల్లో కూడా లేని పట్నాలు దర్జాగా ఆ ప్లేస్​లోకి దూసుకొచ్చాయి. ‘ద ఎకనామిస్ట్​’కు చెందిన ఇంటెలిజెన్స్​ యూనిట్​ 140 సిటీలపై సర్వే చేసి ‘ద గ్లోబల్​ లివబిలిటీ ఇండెక్స్​ 2021’ లిస్టును రిలీజ్​ చేసింది. స్థిరత్వం, ఆరోగ్యం, పర్యావరణం, చదువు, మౌలికవసతులు అనే ఐదు కేటగిరీలుగా సర్వే చేసి ర్యాంకులను కేటాయించింది.

యూరప్​ సిటీలు కిందకు

ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన సిటీల జాబితాలో న్యూజిలాండ్​కు చెందిన ఆక్లాండ్​ టాప్​ ప్లేస్​ను సొంతం చేసుకుంది. అన్ని కేటగిరీల్లోనూ మెరుగైన మార్కులు సాధించిన ఆక్లాండ్​ సిటీ.. మొత్తంగా 96 పాయింట్లను తెచ్చుకుంది. జాబితాలో 94.2 పాయింట్లతో జపాన్​ సిటీ ఒసాకా రెండో స్థానాన్ని, ఆస్ట్రేలియా సిటీ అడిలైడ్​ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. టాప్​ టెన్​లో ఆస్ట్రేలియావి 4 సిటీలు, న్యూజిలాండ్​, జపాన్​, స్విట్జర్లాండ్​కు చెందిన రెండ్రెండు సిటీలు చోటు దక్కించుకున్నాయి. మొన్నటిదాకా టాప్​ 10లో ఉన్న యూరప్​ నగరాలు కిందకు పడిపోయాయి. కొన్నేళ్లుగా టాప్​ ప్లేస్​లో కొనసాగుతున్న ఆస్ట్రియా రాజధాని వియన్నా.. ఈ ఏడాది కరోనా లాక్​డౌన్​లు తెచ్చిన కష్టాలతో 12వ స్థానానికి పడిపోయింది. ఇక, గతంలో ఎక్కడో 60వ స్థానంలో ఉన్న హవాయి సిటీ హొనలులు 46 స్థానాలు పైకి దూసుకొచ్చి 14వ స్థానాన్ని దక్కించుకుంది. 

లాక్​డౌన్​లే కారణమా?

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ లాక్​డౌన్​ విధించాయి. కొన్ని దేశాలు మాత్రం మహమ్మారిని కట్టడి చేసి కోలుకున్నాయి. లాక్​డౌన్​ తీసేసి సాధారణ జీవితానికి వచ్చేశాయి. న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా, జపాన్​ వంటి దేశాల్లో ముందు నుంచీ కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయి. అయినా ముందుగానే ఆయా దేశాలు స్పందించి మహమ్మారిని కట్టడి చేయగలిగాయి. దీంతో వాటి ఆర్థిక వ్యవస్థలు, హెల్త్​ కేర్​ రంగం, ఇతర రంగాలపై కరోనా పెద్దగా ప్రభావం చూ పలేకపోయింది. జనాలు సాధారణ జీవితాన్నే గడిపారు. దీంతో ఆ దేశాల్లోని సిటీలు నివాసానికి అనుకూలంగా ఉన్నాయని ఎకనామిస్ట్​ సర్వేలో తేలింది. అదే సమయంలో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్​, బ్రిటన్​, ఆస్ట్రియా, స్పెయిన్​ వంటి దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రత ఎంతలా ఉందో అందరికీ తెలిసిందే. దీంతో ఆయా దేశాలు లాక్​డౌన్లు విధించాయి. కానీ, కరోనాను కట్టడి చేయలేకపోయాయి. ఫలితంగా వాటి ఆరోగ్య రంగంపై పెను ప్రభావమే పడింది. దాని ఫలితం ఇన్​డైరెక్ట్​గా వేరే రంగాలపైనా పడింది. చదువు, కల్చర్​, థియేటర్లు, ఆటలు, రెస్టారెంట్ల వంటి వాటికి నష్టం వాటిల్లింది. అక్కడోళ్ల బతుకులు కష్టమైపోయాయి. దీంతో నివాసయోగ్యమైన సిటీల ర్యాంకుల్లో యూరప్​ దేశాల సిటీలు దిగజారిపోయాయి. ఈ విషయంలో ఎక్కువగా నష్టపోయిందంటే జర్మనీలోని ఫ్రాంక్​ఫర్ట్​, హాంబర్గ్​, డసెల్డార్ఫ్​ సిటీలే.