పోయొద్దాం.. పాండవుల గుట్ట

 పోయొద్దాం.. పాండవుల గుట్ట

ఆదిమ మానవులు కొండ గుహల్లో నివసించేవాళ్లు. రాళ్లనే ఆయుధాలుగా చేసుకుని జంతువుల్ని వేటాడేవాళ్లు. తీరిక వేళల్లో రకరకాల బొమ్మలు వేసేవాళ్లు.... అయితే, ఈ విషయాలన్నీ పుస్తకాల్లో చదవడం కంటే వాళ్ల ఆనవాళ్లు ఉన్న ప్లేస్​లకి వెళ్లి, నేరుగా కళ్లతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతాయి. మనిషి పరిణామక్రమానికి (ఎవల్యూషన్​) సాక్ష్యంగా నిలిచే రాతి గుహలు మనదేశంలో అక్కడక్కడా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటైన పాండవుల గుహలు మన రాష్ట్రంలో ఉన్నాయి. జయశంకర్ భూపాల పల్లి జిల్లా రేగొండ మండలంలోని తిరుమలగిరి ఊరికి వెళ్తే ఈ గుహల్ని చూడొచ్చు. చుట్టూరా పచ్చని చెట్లు, కొండలతో ఆహ్లాదకరంగా  ఉండే ఈ ప్లేస్​ వీకెండ్ టూర్​కి బాగుంటుంది.


పాండవులు తమ12 ఏండ్ల అరణ్యవాసంలో కొన్నాళ్లు ఇక్కడ ఉన్నారట. అందుకనే ఈ గుహలకు ‘పాండవుల గుహలు’, ‘పాండవుల గుట్ట’ అనే పేరొచ్చింది. వీటిని ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్ వాళ్లు 1990లో గుర్తించారు. ఈ గుహలు ఉత్తరం నుంచి దక్షిణం దిక్కు వైపు వరుసగా ఉంటాయి. ఈ గుట్టల ప్రత్యేకత ఏంటంటే... వీటిలో ప్రాచీన శిలా యుగం, మధ్య రాతియుగానికి చెందిన రాతి బొమ్మలు గోడల మీద, సీలింగ్ మీద  కనిపిస్తాయి. వాటిల్లో అడవి దున్న, జింకలు, జిరాఫీ, చిరుత, పులి, మేక, చేపల బొమ్మలు ఉంటాయి. ఇవే కాకుండా స్వస్తిక్ ముద్ర, గుండ్రంగా, చతురస్రం ఆకారంలో ఉన్న గీతల్ని చూడొచ్చు. వీటి గురించి వివరించేందుకు ఐదుగురు గైడ్స్​ ఉంటారు.
రంగులలో..
ఆదిమ మానవులు జంతువుల్ని వేటాడడం కోసం ఉపయోగించిన కత్తులు, ఈటెలు, విల్లులు, బాణం బొమ్మల్ని ఇక్కడ చూడొచ్చు. అంతేకాదు ఇక్కడి ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, పుసుపు రంగులద్దిన పెయింటింగ్స్ ఆకట్టుకుంటాయి. స్థానికులు ఈ రాతి గుహల్లోని ప్లేస్​లని మేకలబండ, ముంగిసబండ, వరాహ పర్వతం, శక్తిపర్వతం, జ్యోతి పర్వతం, పులి పర్వతం, యానాదుల గుహ, ఎదురు పాండవులు, కుంతీ దేవి, పంచ పాండవులు... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ మధ్య రాతి యుగం ఆనవాళ్లు కూడా చూడొచ్చు. అడ్వెంచర్​ స్పోర్ట్స్​ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ కొండలు ఎక్కడం, రాపెల్లింగ్ వంటివి చేస్తారు. ఎంట్రన్స్ నుంచి కొండ మీద ఉన్న ఈ గుహల దగ్గరికి వెళ్లేందుకు మెట్ల దారి ఉంటుంది. 
ఇలా వెళ్లాలి
పాండవులు గుహలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వరంగల్ నుంచి 50 కిలోమీటర్ల దూరం.. హైదరాబాద్ నుంచి 195 కిలోమీటర్ల జర్నీ.
టైమింగ్స్: అన్ని రోజులు తెరిచే ఉంటుంది. ఉదయం 8 గంటలకు తెరచి సాయంత్రం 6 గంటలకు మూసేస్తారు. అయితే ఎండాకాలంలో ఇక్కడ రాక్ క్లైంబింగ్ చేసేందుకు వచ్చేవాళ్లకు ఉదయం 6 గంటలకే అనుమతిస్తారు. 
ఎంట్రీ టికెట్: పిల్లలకు రూ.10, పెద్దలకు రూ.20