అశ్వాపురం వైస్ ఎంపీపీగా బేతం రామకృష్ణ

అశ్వాపురం వైస్ ఎంపీపీగా బేతం రామకృష్ణ

అశ్వాపురం, వెలుగు : అశ్వాపురం మండల వైస్ ఎంపీపీగా మల్లెలమడుగు ఎంపీటీసీ బేతం రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ కు  చెందిన వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రంపై ఇటీవల మండల పరిషత్ సమావేశంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నెగ్గడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది. ఈ మేరకు బేతం రామకృష్ణ వైస్ ఎంపీపీ పదవికి నామినేషన్ వేశారు.

శుక్రవారం మండల పరిషత్​కార్యాలయంలో ఎంపీటీసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బేతం రామకృష్ణను వైస్ ఎంపీపీ గా ఎన్నుకున్నారు. రామకృష్ణను ఎంపీపీ ముత్తినేని సుజాత, మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు నరేశ్, ఎంపీడీవో గంట వరప్రసాద్ అభినందించారు.

ఇల్లెందు వైస్ ఎంపీపీగా మండల రాం మహేశ్ 

ఇల్లెందు : ఇల్లెందు మండల వైస్ ఎంపీపీగా ఇందిరానగర్ ఎంపీటీసీ మండల రాం మహేశ్​ఎన్నికయ్యారు. శుక్రవారం జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి రామకృష్ణ వైస్ ఎంపీపీ ఎన్నికను నిర్వహించారు. మండలంలో 16 మంది ఎంపీటీసీలకు గాను 11మంది హాజరయ్యారు. బాలాజీనగర్, సుభాశ్​ నగర్, పోలారం, కొమరారం ఎంపీటీసీలు దాస్యం ప్రమోద్ కుమార్, శీలం ఉమా, వీసాల పాపమ్మ, అజ్మీర బిచ్చా లు గైర్హాజరయ్యారు. రేపల్లెవాడ ఎంపీటీసీ మోకాళ్ళ జయమ్మ కొన్ని నెలల కిందనే అనర్హతతో వేటుకు గురైంది.

దీంతో కోరం పూర్తి కావడంతో ఎన్నికను అధికారులు నిర్వహించారు. కేవలం ఒక్కరే వైస్ ఎంపీపీకి నామినేషన్ వేయడంతో పాటు 11 మంది ఎంపీటీసీలు మద్దతు తెలుపడంతో మండల రాం మహేశ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులు వైస్ ఎంపీపీగా ఎన్నికైన మండల రాం మహేశ్​తో ప్రమాణం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు మండల రాం మహేశ్​ ను  శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.