ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

జిల్లాలో రూ.3 కోట్లతో లైబ్రరీల్లో  మౌలిక వసతులు 

దేవరకద్ర, వెలుగు:  రాష్ట్రంలో గ్రంథాలయాలకు మహర్దశ నడుస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి  వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం దేవరకద్ర టౌన్​లో  రూ. 38 లక్షల వ్యయంతో నిర్మించిన లైబ్రరీ బిల్డింగ్​ను ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో  భారీగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్​అవుతున్న నిరుద్యోగులకు లైబ్రరీలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. జిల్లాలో కొత్తగా 6 లైబ్రరీ బిల్డింగ్స్​నిర్మించామని, రూ. 3 కోట్ల వ్యయంతో మౌలిక వసతులు కల్పించామని మంత్రి వివరించారు. దేవరకద్ర లైబ్రరీ అభివృద్ధికి తనవంతు సాయంగా రూ. 5 లక్షల ఫండ్స్​మంత్రి శాంక్షన్​చేశారు.  

కోయిల్​సాగర్​లో ..

అనంతరం మంత్రి శ్రీనివాస్​గౌడ్​ మండల పరిధిలోని కోయిల్​సాగర్ ప్రాజెక్టులో  చేపపిల్లలను వదిలారు.  అదేవిధంగా మండలం డోకూర్ గ్రామంలో రూ. 1.35 కోట్ల వ్యయంతో నిర్మించిన కేజీబీవీ అదనపు గదులను  ప్రారంభించారు.   

చిన్నచింతకుంటలో..

మండలంలోని  ముచ్చింతల గ్రామంలో ఊక చెట్టు వాగుపై రూ. 9.99 కోట్ల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యాంను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం అప్పంపల్లి గ్రామంలో రూ. 1.98 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్ ను,  కురువ సంఘం కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. జడ్పీ చైర్​పర్సన్​స్వర్ణ సుధాకర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పరిషత్​ మీటింగ్ లో​ పథకాలపై ప్రచారమేంది?

ఎమ్మెల్యేను నిలదీసిన ఎంపీటీసీ..

కల్వకుర్తి, వెలుగు: మండల పరిషత్​మీటింగ్​లో ప్రజా సమస్యలు చర్చించాల్సింది పోయి, ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుడేందని గుండూరు ఎంపీటీసీ నర్సిరెడ్డి మండిపడ్డారు. మండల పరిషత్​ఆఫీస్​లో శుక్రవారం ఎంపీపీ మనోహర అధ్యక్షతన జనరల్​బాడీ మీటింగ్​జరిగింది. ఎంపీ రాములు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్​హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ తనకు వేరే మీటింగ్​ఉందని ముందుగానే  మాట్లాడి వెళ్తానని  మాట్లాడుతుండగా ఎంపీటీసీ అడ్డుపడి.. ఎమ్మెల్యే ఇలా హడావిడి చేసి వెళ్లిపోతే సమస్యలు ఎవరికి వివరించాలని ప్రశ్నించారు. గుండూరు, పంజుగుల గ్రామాల మధ్య ఏడాది కింద ప్రారంభించిన రోడ్డు నిర్మాణ పనులు పదిశాతం కూడా పూర్తి చేయకపోవడం ఎవరి నిర్లక్ష్యమని నిలదీశారు. అన్నీ డీఈ చూసుకుంటాడని ఎమ్మెల్యే మీటింగ్​నుంచి వెళ్లిపోయారు.  దీంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతరం మండలంలోని సమస్యలను ఎంపీ, ఎమ్మెల్సీకి  వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సీరియస్​అయ్యారు.  వైస్ ఎంపీపీ  గోవర్ధన్, ఎంపీడీవో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

కేసీఆర్ నిజాం అయితే.. మంత్రులు, ఎమ్మెల్యేలు రజాకార్లు

వనపర్తి, వెలుగు : సీఎం కేసీఆర్ నిరంకుశ నిజాం వలె వ్యవహరిస్తుంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలు రజాకార్లను తలపిస్తున్నారని బీజేపీ సీనియర్​ నేత తల్లోజు ఆచారి విమర్శించారు. శుక్రవారం బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఏ.రాజవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో విడత ‘ప్రజా గోస– బీజేపీ భరోసా’ బైక్ యాత్రను వనపర్తి మండలం కంద్రీయ తండాలో ఆచారి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకటనలే తప్ప జాబ్​ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మునుగోడు ఎన్నిక కోసం సీఎం గిరిజన బంధు నాటకమాడుతున్నారని విమర్శించారు. వనపర్తి జిల్లాలో రోడ్లు విస్తరణ చేయాలని బీజేపీ లీడర్లు దీక్షలకు దిగితే పట్టించుకోని మంత్రి నిరంజన్​రెడ్డి, ఇప్పుడు పోలీసులను పెట్టి అడ్డగోలుగా ఇండ్లు కూల్చి వేయిస్తున్నారన్నారు. యాత్ర ప్రముఖ్ దేవకి వాసుదేవరావు, ఆర్టీసీ టీఎంయూ వ్యవస్థాపకుడు, బీజేపీ నేత అశ్వథ్థామరెడ్డి, జిల్లా ఇన్​చార్జి బోసుపల్లి ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.

బీసీలందరూ సంఘటితంగా ఉండాలి

కల్వకుర్తి, వెలుగు: బీసీలందరూ సంఘటితంగా ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని పద్మశాలి భవన్​లో జరిగిన ఆత్మీయ అభినందన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో 60 శాతం ఉన్న బీసీలు ప్రభుత్వాలు ఇచ్చే చిన్న చిన్న రాయితీలకు రాజీ పడకుండా రాజ్యాధికారం దక్కేవరకు పోరాటాలు చేయాలని చెప్పారు.  తెలంగాణ రాక ముందు పార్టీలన్నీ బీసీలను సీఎం చేస్తామని వాగ్ధానాలు చేసి, తీరా గెలిచినంక ఆ ఊసే మరిచిపోయాయన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించి, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని డిమాండ్ చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ , బీసీ సంఘం లీడర్లు నాగేశ్వర్ గౌడ్, రాజేందర్, శ్రీనివాస్, కాశన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరిస్తాం

శ్రీరంగాపూర్​, వెలుగు:  శ్రీరంగాపూర్​లోని సమస్యలన్నింటిని త్వరలోనే పరిష్కరిస్తామని జిల్లా పంచాయతీ రాజ్​ ఆఫీసర్ ​సురేశ్ ​కుమార్​అన్నారు. రంగ సముద్రం రిజర్వాయర్ ​ల్యాండ్స్​ను అక్రమార్కులు కబ్జాచేశారని, గ్రామంలో వాటర్​ లీకేజీతో పాటు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీల సమస్య తీవ్రంగా ఉందని బీఎస్పీ లీడర్లు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్​కు కంప్లైంట్​చేశారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు శుక్రవారం డీపీవో శ్రీరంగాపూర్​లో పర్యటించి విచారించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్​ వినీల రాణి, ఎంపీవో రాజు, బీఎస్పీ లీడర్లు శ్రీను, రమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

నడిగడ్డలో అదృశ్యమై..బంగ్లాదేశ్​లో ప్రత్యక్షం

అయిజ, వెలుగు: నాలుగేండ్ల కింద నడిగడ్డలో అదృశ్యమైన ఓ మహిళ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ప్రత్యక్షం కావడంతో శుక్రవారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది.    ​ఎస్సై శేఖర్​ వివరాల ప్రకారం.. గద్వాల జిల్లా మల్దకల్ మండలం  కుర్తిరావుల చెరువు గ్రామానికి చెందిన నాగేశ్వరమ్మ 2018 లో గ్రామం నుంచి పని కోసం  గద్వాల కు వెళ్లింది. గద్వాల రైల్వే స్టేషన్ లో   పరిచయమైన ఓ వ్యక్తి ఆమెని రైలు ఎక్కించి ఎక్కడికో  పంపించాడు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియలేదు. నాలుగేండ్లుగా కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే శుక్రవారం బంగ్లాదేశ్ ​బార్డర్​లో ఆమె ఉన్నట్టు   పోలీసుల నుంచి  సమాచారం రావడంతో  కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.  బార్డర్​లో విధులు నిర్వహిస్తున్న ఓ ఆర్మీ జవాన్​ ఈ విషయాన్ని ఓ టీవీ ఛానల్ కు  సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో   ఆమె కుమారుడు వెంకటన్న  మల్దకల్  ఎస్సైని ఆశ్రయించి,  అక్కడి నుంచి తన తల్లిని తీసుకొచ్చేందుకు   బంగ్లాదేశ్ కు   బయలు దేరి వెళ్లాడు. 

వీధి వ్యాపారులకు రెండో విడత లోన్లు ఇవ్వాలి

వనపర్తి, వెలుగు:  వీధి వ్యాపారులకు సకాలంలో రెండో విడత లోన్లు ఇవ్వాలని కలెక్టర్ షేక్​యాస్మిన్​బాషా బ్యాంక్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్​లో లీడ్ బ్యాంకు 2022-– 23 ఫైనాన్షియల్​ఇయర్​లో ఇచ్చిన బ్యాంక్ లోన్స్​పై  జడ్పీ చైర్మన్​లోక్​నాథ్​రెడ్డితో కలిసి కలెక్టర్​రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాంకర్లు ప్రభుత్వ పథకాల ద్వారా ఇచ్చే లోన్లపై విస్తృత ప్రచారం చేసి వెంటనే అందజేయాలన్నారు. ప్రతి3వ శుక్రవారం రైతులతో బ్యాంకర్లు మీటింగ్స్​పెట్టి లోన్స్​పై చర్చించాలని ఆదేశించారు. పరిశ్రమలు స్థాపించేందుకు వచ్చిన అప్లికేషన్లను పెండింగ్​లో పెట్టకుండా వెంటనే లోన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్​బ్యాంక్​మేనేజర్​అమూల్ పవార్, వివిధ బ్యాంకుల మేనేజర్లు పాల్గొన్నారు.