మాటల యుద్ధంతో వేడెక్కిన భద్రాచలం రాజకీయం

 మాటల యుద్ధంతో వేడెక్కిన భద్రాచలం రాజకీయం

భద్రాచలం, వెలుగు: ఎన్నికలకు ఏడాది ముందే భద్రాచలం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. సీపీఎం, కాంగ్రెస్​ల మధ్య మాటల యుద్ధం స్టార్ట్​ అయ్యింది. ప్రెస్​మీట్లు, సోషల్​మీడియా వేదికగా సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ముందుగా కామ్రేడ్లు లోకల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై విమర్శలు చేయగా, కాంగ్రెస్​ లీడర్లు సైతం అదే స్థాయిలో బదులిస్తున్నారు.  

ఎమ్మెల్యేపై సీపీఎం ఘాటు వ్యాఖ్యలు..

సీపీఎం లీడర్లు మాజీ ఎంపీ డా.మిడియం బాబూరావు, డీసీసీబీ మాజీ చైర్మన్​ యలమంచి రవికుమార్​, సీపీఎం నియోజకవర్గ కన్వీనర్​ మచ్చా వెంకటేశ్వర్లు భద్రాచలంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియోజకవర్గానికి అన్యాయం చేస్తుంటే నోరు మెదపడం లేదని, అసమర్ధ ఎమ్మెల్యే పొదెం వీరయ్య అంటూ వ్యాఖ్యలు చేశారు. సీపీఎం ప్రజాప్రతినిధులు నిధుల కోసం చట్ట సభల్లో పోరాటాలు చేసి, ప్రజాఉద్యమాలు నిర్వహించారని, నాలుగేళ్లలో మీరేం చేశారు? ఎన్ని నిధులు తెచ్చారు? ఏ కార్యక్రమాలకు ఖర్చు చేశారు? ప్రజలకు వివరించాలని ప్రశ్నల వర్షం కురిపించారు. కార్యకర్తలతో మంచిగా ఉంటారని ప్రచారం చేసుకుంటూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. దళితబంధు, డబుల్​బెడ్రూం ఇండ్ల కేటాయింపుల్లో ఎమ్మెల్యే అధికారాన్ని రద్దు చేయాలని, అధికారులే నిరుపేదలకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరు కాంగ్రెస్​ లీడర్లు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు భద్రాచలం ఎమ్మెల్యేలకు అవినీతి మచ్చ లేదని, ఆ మచ్చ తెచ్చుకోవద్దని  హితవు పలికారు. కామ్రేడ్లు ఇలాంటి ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ లీడర్లు కూడా అదే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. 

బహిరంగ చర్చకు కాంగ్రెస్​ సవాల్..​

సీపీఎం లీడర్లు ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్​ లీడర్లు ఖండించారు. ముర్ల ఎర్రయ్యరెడ్డి నుంచి సున్నం రాజయ్య వరకు సీపీఎం ఎమ్మెల్యేల హయాంలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్​ ఎమ్మెల్యేల హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్​ విసిరారు. బీఆర్ఎస్​తో పొత్తు కోసమే కాంగ్రెస్​పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 35 ఏండ్లు సీపీఎం ఎమ్మెల్యేలు ఉండి పాలెం, మోడికుంట, వద్దిపేట ప్రాజెక్టులతో పాటు ప్రగళ్లపల్లి లిఫ్ట్​ ఎందుకు సాధించలేక పోయారని ప్రశ్నించారు. ఏటా వసూలు చేసే చందాలకు లెక్కా పత్రాలు ఉన్నాయా? రూ.100 కోట్లు భద్రాచలం రాముడికి ఇస్తానని కేసీఆర్​ హామీ ఇచ్చి విస్మరించారని, అయితే మునుగోడులో కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్న సీపీఎంకు తమను విమర్శించే అర్హత లేదని విమర్శించారు. దివంగత ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజాబొజ్జి స్మారక స్తూపాల నిర్మాణాలను పంచాయతీ ఆఫీసర్లు, పోలీసులు అడ్డుకుంటే బాసటగా నిలిచిన మచ్చలేని నాయకుడు ఎమ్మెల్యే పొదెం వీరయ్య అని స్పష్టం చేశారు. సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన లేఖల ద్వారా భద్రాచలంలో డబుల్ బెడ్రూమ్​ ఇండ్లు తీసుకున్న మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. పోలవరం వ్యతిరేక ఉద్యమం పేరుతో అమాయకులను బలి చేసి సీపీఎం లీడర్లు పరిహారం తీసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనైతిక పొత్తులు, చీకటి ఒప్పందాలు చేసుకోవడం సీపీఎంకు అలవాటేనని కాంగ్రెస్​ నేతలు రమేశ్​గౌడ్, బుడగం శ్రీనివాసరావు, నల్లపు దుర్గాప్రసాద్, సరెళ్ల నరేశ్, బోగల శ్రీనివాసరెడ్డి విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మాట్లాడిన ఆడియోలను సోషల్​ మీడియాలో పెట్టారు. నియోజకవర్గంలో సీపీఎం, కాంగ్రెస్​ నేతల మధ్య మాటల యుద్ధం స్థానికంగా హాట్​ టాపిక్​గా మారింది.