భద్రాచలం సీతమ్మసాగర్‌‌‌‌లో ఇసుక తోడేళ్లు .. ప్రారంభమే కాని ప్రాజెక్టులో పూడికతీస్తరట

భద్రాచలం సీతమ్మసాగర్‌‌‌‌లో ఇసుక తోడేళ్లు .. ప్రారంభమే కాని ప్రాజెక్టులో పూడికతీస్తరట
  • రూల్స్​కు విరుద్ధంగా 20 ఇసుక రీచ్‌‌‌‌లకు పర్మిషన్లు 
  • 2.23 కోట్ల క్యూబిక్‌‌‌‌ మీటర్ల సాండ్‌‌‌‌ నిల్వలు కేటాయింపు
  • మొదట అన్నారంలో తవ్వకాలకు ప్లాన్‌‌‌‌
  • ఇంజినీర్లు అడ్డుకోవడంతో  సీతమ్మసాగర్‌‌‌‌కు మారిన సీన్‌‌‌‌
  • గిరిజన సొసైటీల పేరుతో భారీ దోపిడీకి ఇసుక మాఫియా స్కెచ్

భద్రాచలం, వెలుగు :  సీతమ్మసాగర్​.. ఇంకా గేట్లే బిగించని ఈ ప్రాజెక్టులో పూడికతీత పేరుతో భారీ ఇసుక దోపిడీకి సాండ్​మాఫియా స్కెచ్​వేసింది. ఎన్జీటీ వివాదం ఉన్నప్పటికీ  గిరిజన సొసైటీల ముసుగులో  ఏకంగా 20 ఇసుక రీచ్‌‌‌‌లకు పర్మిషన్లు తెచ్చుకుంది. అన్నారం బ్యారేజీలో పూడికతీత పేరుతో ఇసుక తవ్వకాలకు అనుమతులు తెచ్చుకుందామని మొదట ప్లాన్​వేసినా అక్కడి ఇంజినీర్లు అడ్డుకోవడంతో ఆటలు సాగలేదు. దీంతో  సీతమ్మసాగర్‌‌‌‌ బ్యారేజీపై కన్నేశారు. ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ అదే గిరిజన సంఘాల ముసుగులో 2.23 కోట్ల క్యూబిక్​మీటర్ల ఇసుకను తవ్వి తరలించేందుకు రెడీ అవుతున్నారు. ఇసుక మేటలు లేనందున నదీగర్భంలోని ఇసుకను తోడితే ప్రాజెక్టుకు ముప్పు తప్పదని ఎక్స్‌‌‌‌పర్ట్స్​హెచ్చరిస్తున్నారు. 

 అన్నారం బ్యారేజీ దగ్గర ఆటలు సాగలే..

మొదట అన్నారం బ్యారేజీ కింద 2.47 కోట్ల క్యూబిక్‌‌‌‌ మీటర్ల ఇసుకను తోడుకునేందుకు ఇసుక మాఫియా ప్లాన్​వేసింది.  పైస్థాయిలో పైరవీలు చేసి, పర్మిషన్‌‌‌‌ తీసుకునేందుకు ప్రయత్నించగా ఇరిగేషన్‌‌‌‌ ఇంజినీర్లు అడ్డం తిరిగారు. రెండేండ్లుగా ఈ ప్రాజెక్ట్‌‌‌‌ గేట్లు ఎత్తేసి నీటిని దిగువకు వదిలేస్తుండండతో ఇసుక మేటలు ఉండే అవకాశమే లేదని, అలాంటప్పుడు డీ సిల్టేషన్‌‌‌‌ ఎందుకంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా డ్యామ్​పరిధిలో డీ సిల్టేషన్‌‌‌‌ ద్వారా ఇసుకను తోడేందుకు సుప్రీంకోర్టులో ఉన్న కేసులను ముందుకుతెచ్చారు. కాదు, కూడదు అంటే డ్యాం సేఫ్టీ అథారిటీ నుంచి తప్పనిసరిగా పర్మిషన్‌‌‌‌ తీసుకోవాలని తేల్చిచెప్పారు. దీంతో ఇసుకమాఫియా ప్రయత్నాలకు బ్రేక్‌‌‌‌ పడింది.

సీతమ్మ సాగర్‌‌‌‌కు మారిన సీన్‌‌‌‌

అన్నారం బ్యారేజీ వద్ద ఇసుక తవ్వకాలకు ఇంజినీర్లు అడ్డుపడడంతో ఇసుక మాఫియా చూపు సీతమ్మ సాగర్‌‌‌‌పైన పడింది. రూ.2,711 కోట్లతో ఈ బ్యారేజీ పనులు ప్రారంభించగా ఎన్జీటీ ఆదేశాలతో 2023లో పిల్లర్ల దశలోనే పనులు ఆగిపోయాయి. అసంపూర్తిగా ఉన్న ఈ ప్రాజెక్ట్‌‌‌‌లో పూడికతీత పేరిట ఇసుక తవ్వకాలకు తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. గోదావరికి ఇరువైపులా 20 రీచ్‌‌‌‌లలో  2.23 కోట్ల క్యూబిక్​మీటర్ల  ఇసుక తోడుకోవడానికి పర్మిషన్లు వచ్చాయి.

 దీంతో భారీ మెషీన్లను గోదావరిలోకి దింపి ఇసుకను తోడేసేందుకు ఇసుకమాఫియా రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయా చోట్ల ఒడ్డు నుంచి గోదావరిలోకి లారీలు వెళ్లేలా రోడ్ల నిర్మాణం సైతం  చేపట్టారు. ఇక్కడ ఇసుక తీయడం వల్ల ప్రభుత్వానికి రూ.1500 కోట్ల ఆదాయం రానుందని ఆఫీసర్లు అంటున్నారు. ఆదివాసీ సొసైటీలకు రూ.75 కోట్ల మేర బిల్లుల రూపంలో వస్తాయని, ఇసుక మాఫియా మాత్రం వేల కోట్లు వెనుకేసుకోబోతోందని గిరిజన సంఘాల నేతలు వాపోతున్నారు. 

రూల్స్‌‌‌‌కు విరుద్ధంగా పర్మిషన్లు..

సీతమ్మసాగర్‌‌‌‌ బ్యారేజీ వివాదం ప్రస్తుతం ఎన్జీటీలో ఉంది. ఇది  భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉన్నందున ఇసుక తవ్వకాల వల్ల బ్యారేజీకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇసుక తవ్వాలంటే ముందుగా అధ్యయనం చేసి, ఆ తర్వాత భూగర్భ శాఖ పర్మిషన్‌‌‌‌ తీసుకొని దానిని ఎన్జీటీకి సమర్పించాలి. అలాగే ఈ ప్రాంతంలో ఇసుక ఎంత మేర ఉంది ? ఎక్కడ ఉంది ? ఎన్ని సంవత్సరాల నుంచి పూడిక ఉంది ? సంవత్సరానికి ఎంత ఇసుకను తోడవచ్చు? అనే విషయాలపై రిపోర్ట్‌‌‌‌ రూపొందించాలి. 

దీంతోపాటు ఎన్విరాన్‌‌‌‌మెంట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ కూడా తప్పనిసరిగా ఉండాలి. కానీ ఇవేవీ లేకుండానే బ్యారేజీకి దిగువన ఇసుక తవ్వకాలకు ఉత్తర్వులు తెచ్చుకోవడం గమనార్హం. కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ఈ పూడికతీత పనులు చేపట్టారని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసలు ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి కాకుండా, నీరు నిల్వ ఉండకుండా ఇసుక మేటలు ఎక్కడ ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. మేటలు లేకుండా నదీగర్భంలోని ఇసుకను తవ్వి తరలిస్తే ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు.