పత్తిపై మొంథా ఎఫెక్ట్.. తుపాన్ కారణంగా వర్షాలు

పత్తిపై  మొంథా ఎఫెక్ట్.. తుపాన్ కారణంగా వర్షాలు
  • ఆదిలాబాద్​లో నేడు పత్తి కొనుగోళ్లు బంద్ 
  • పత్తి ఏరడం ఆలస్యం.. రైతుల్లో ఆందోళన 
  • వాతావరణ పరిస్థితులతో 15 శాతం దాటుతున్న తేమ

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే పత్తి ఏరుతున్నారు. మరోవైపు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే మొంథా తుపాన్ కారణంగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇంకోవైపు మంచు కురుస్తుండటంతో పత్తి ఏరడం వాయిదా పడుతోంది.  ఈ ఏడాది జిల్లాలో అత్యధికంగా 4.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

ఇప్పటికే అధిక వర్షాలతో దిగుబడులు తగ్గిపోగా.. ఇప్పుడు తుపాన్ ప్రభావంతో పగిలిన పత్తికాయ తడుస్తోందని ఆవేదన వ్యక్తంచ చేస్తున్నారు. చేలల్లోకి నీరు చేరడంతో పత్తితీత కష్టమవుతోంది. ఇప్పటికే ఏరిన పత్తిని ఇండ్లలో నిల్వ చేశారు. వాతావరణ పరిస్థితులతో ఆరబెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవేళ పత్తిని అలాగే మార్కెట్ కు తీసుకెళ్తే తేమ శాతం అధికంగా వచ్చి మద్దతు ధర దక్కదని అంటున్నారు. ఈసారి నష్టపోతామేమోనని వాపోతున్నారు.  

మొదటి రోజు కంటే తగ్గిన ప్రైవేట్​ధర

మొంథా తుఫాన్ వల్ల జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడింది. సోమవారం ప్రారంభమైన పత్తి కొనుగోళ్లను కొనసాగించినప్పటికీ ప్రైవేట్ ధర మాత్రం మొదటి రోజు కంటే రూ.140 తగ్గి రూ.6,810 చెల్లించారు. వాతావరణ పరిస్థితులతో తేమ 15 శాతం దాటుతుండటంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. సీసీఐ క్వింటాల్​కు రూ.8,110 చెల్లిస్తున్నప్పటికీ అది 8 నుంచి 12 శాతం లోపు వచ్చిన పత్తికే ఇస్తున్నారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తిని ఎంత ఆరబెట్టినప్పటికీ వాతావరణం చల్లబడటం, మొదటి పంట కావడంతో తేమ వస్తుందని రైతులు అంటున్నారు. ఫలితంగా తక్కువ ధరకే ప్రైవేట్ లో అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. సీసీఐ మద్దతు ధర దక్కాలంటే పత్తిని ఆరబెట్టి తేవాలని అధికారులు సూచిస్తున్నారు. తుపాన్​కారణంగా బుధవారం కొనుగోళ్లు జరపడం లేదని, మార్కెట్ యార్డుకు పత్తిని తీసుకురావొద్దని వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్​చేసుకున్న రైతులు రద్దు చేసుకొని, మరుసటి రోజుకు బుక్ చేసుకోవాలని పేర్కొన్నారు.  

పత్తి ఏరుడు ఆలస్యమైతంది 

ఏటా ఈ సమయానికి పత్తి ఏరుడు జోరుగా నడిచేది. ఈసారి వర్షాలు పడుతుండటంతో ఆలస్యమైతంది. పత్తి ఏరినా ఆరబెట్టాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ఆశించిన దిగుబడి లేదు. మార్కెట్ తీసుకెళ్తే తేమశాతం అధికంగా వస్తోంది. వర్షాలతో ఈ ఏడాది పత్తి రైతులు నష్టపోయే పరిస్థితులే కనిపిస్తున్నయ్. – గంగన్న, రైతు, అంకోలి గ్రామం 

మార్కెట్​కు వెళ్లలేని పరిస్థితి

ఈ ఏడాది 11 ఎకరాల్లో పత్తి పంట వేసిన. ప్రస్తుతం ఎకరానికి 5 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వస్తోంది. ఇప్పటివరకు ఏరిన పత్తిని మార్కెట్ కు తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షాలు, వాతావరణ మార్పులతో తేమశాతం అధికంగా వస్తోంది. రోజుల తరబడి చేను వద్దే పత్తిని ఆరబెట్టుకుంటున్నం.– మల్లెపూల మహేందర్, రైతు, బోథ్