కమెడియన్ నుంచి పంజాబ్ బాద్షాగా.. 

కమెడియన్ నుంచి పంజాబ్ బాద్షాగా.. 

అమృత్సర్: పంజాబ్కు కాబోయే సీఎం భగవంత్ మాన్ ఒకప్పుడు కమెడియన్గా ప్రేక్షకులను అలరించారు. తనదైన హాస్యంతో బాగా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు పంజాబ్లో ఆయన నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించడంతో మాన్ చేసిన పాత కామెడీ వీడియోలు నెట్లో వైరల్ అవుతున్నాయి. అందులోని ఓ వీడియోలో స్టూడెంట్ పాత్రలో కనిపిస్తున్న మాన్.. తాను పెద్దయ్యాక ఎమ్మెల్యే లేదా మంత్రి అవుతానని చెప్పడం విశేషం. ఇప్పుడు మాన్ ఏకంగా పంజాబ్ కు ముఖ్యమంత్రి కానుండటంతో ఈ వీడియోను ఆయన అభిమానులు, ఆప్ కార్యకర్తలతోపాటు నెటిజన్లు సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారు. 

ఇంకా ఆ వీడియోలో ఏముందంటే.. విద్యార్థి పాత్రలో ఉన్న భగవంత్ మాన్ను ‘నువ్వు పెద్దయ్యాక ఏం అవ్వాలని అనుకుంటున్నావ్’ అని టీచర్ పాత్రధారి అడుగుతారు. దానికి సమాధానంగా.. ‘నేను బాగా చదివితే ఓ అధికారిని అవుతా. ఒకవేళ చదవకపోతే ఎమ్మెల్యేనో లేదా మినిస్టర్ అవుతా’ అంటూ మాన్ వ్యంగ్యంగా బదులిస్తారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో కలసి మాన్ కూర్చున్న విజువల్స్, పార్టీ గెలుపు కోసం ఆయన కష్టపడిన తీరును కూడా ఈ వీడియోలో చూడొచ్చు. మాన్కు సంబంధించిన మరో పాత వీడియో కూడా వైరల్ అవుతోంది. లాఫ్టర్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న మాన్.. రాజనీతి, గవర్నమెంట్ అనే పదాలకు చెప్పిన అర్థం అందర్నీ నవ్విస్తోంది. ‘ఎలా పాలించాలో చెప్పే నీతిని తరచూ మారుస్తూ ఉండటమే రాజనీతి’ అని మాన్ ఆ వీడియోలో అనడాన్ని చూడొచ్చు. అలాగే ప్రతి సమస్యపై దృష్టి సారించి.. ఓ నిమిషం తర్వాత దాన్ని మర్చిపోవడమే గవర్నమెంట్ అని ఆయన జోకులు పేల్చిన వీడియో కూడా వైరల్గా మారింది. ఈ కార్యక్రమానికి జడ్జిగా పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవ్జోత్ సింగ్ సిద్ధూ వ్యవహరించడం గమనార్హం. ఇకపోతే, గురువారం వెలువడిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ విజయఢంకా మోగించింది. మొత్తం 117 స్థానాల్లో ఆ పార్టీ 92 సీట్లు గెలుచుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. 

మరిన్ని వార్తల కోసం:

బీజేపీ పతనం కొనసాగుతుంది

కేసీఆర్ ఫ్రంటు డౌటే

బీఎస్పీ అంచనాలకు విరుద్ధంగా యూపీ ఫలితాలు