స్వదేశీ స్ఫూర్తిని ప్రోత్సహించాలి

స్వదేశీ స్ఫూర్తిని ప్రోత్సహించాలి
  • మండప నిర్వాహకులకు భాగ్యనగర్ ఉత్సవ సమితి పిలుపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ ఏడాది గణేశ్ ఉత్సవాల్లో స్వదేశీ స్ఫూర్తిని ప్రోత్సహించాలని భాగ్యనగర్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. మండపాల నిర్వాహకులు, ప్రజలు తమ పండుగల సందర్భంగా స్థానిక, స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలని కోరింది. భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రావినూతన శశిధర్ మీడియాతో మాట్లాడారు. 

ఈసారి18 ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేస్తూ.. 303 కిలోమీటర్ల పరిధిలో 160 గణేశ్ యాక్షన్ టీమ్​లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యంత ముఖ్యమైన గణేశ్ నిమజ్జనం కార్యక్రమం సెప్టెంబర్ 6న (శనివారం అనంత చతుర్దశి) జరగనుందన్నారు. ఉత్సవాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వెబ్​సైట్​ను bhagyanagarganesh.com ను లాంచ్ చేశారు. ప్రభుత్వం ప్రతి గణేశ్ మండపానికి ఉచిత విద్యుత్ అందిస్తోందని, మండపాల ఏర్పాటు, నిర్వహణలో భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రతి నిర్వాహకుడు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. 

ఉత్సవాల సందర్భంగా నగరాన్ని కాషాయ రంగులో అలంకరించి, ఆధ్యాత్మిక వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, సాహిత్యాన్ని ప్రతి మండపానికి అందించనున్నట్లు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్ ఎం వైకుంఠం, గోవింద్ రాటి, కోశాధికారి శ్రీరామ్ వ్యాస్, కార్యదర్శి మహేందర్ ఉన్నారు.