పద్మ భూషణ్ అందుకున్న భారత్ బయోటెక్ ఎండీ

పద్మ భూషణ్ అందుకున్న భారత్ బయోటెక్ ఎండీ

పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్ లో జరిగింది. తెలంగాణకు చెందిన ఆదివాసీ కళాకారుడు సకిని రామచంద్రయ్య..  సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రంలోని భద్రాద్రి కొత్త గూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం గ్రామం ఆయన స్వస్థలం. కొయదొరల వంశానికి చెందిన రామచంద్రయ్య ఆదివాసీల సాంప్రదాయ కళ అయిన డోలు వాయిద్యాన్ని వాయించడంలో దిట్ట. తమ పూర్వీకుల నుంచి వస్తున్న కళను కాపాడుకుంటూ వస్తున్న రామచంద్రయ్య.. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరలో డోలు వాయిద్య మోగిస్తూ.. తన కంచు కఠంతో పాట పాడి భక్తులను అలరిస్తుంటారు. కాగా, రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వ పద్మ శ్రీ ప్రకటించాక సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 2న తన క్యాంప్ ఆఫీసులో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో ఇంటి స్థలం, రూ.కోటి ఆర్థిక సాయం ప్రకటించారు.

భారత్ బయోటెక్ ఎండీకి పద్మ భూషణ్

ఇవాళ జరిగిన పద్మ అవార్డులు - 2022 ప్రదానోత్సవం కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్ల, జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లకు రాష్ట్రపతి కోవింద్ పద్మ భూషణ్ పురస్కారాన్ని అందించారు. కూచిపూడి కళాకారిణి పద్మజా రెడ్డి, కళా రంగంలో షావుకారు జానకి  పద్మశ్రీ అవార్డులు తీసుకున్నారు.

ఒలింపిక్ మెడలిస్టులు, సింగర్ సోనూ నిగమ్..

టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రా, పారాలింపిక్స్ లో షటిల్ లో గోల్డ్ మెడల్ సాధించిన ప్రమోద్ భగత్, జావెలిన్ త్రో గోల్డ్  మెడల్ కొట్టిన సుమిత్ అంతిల్.. రాష్ట్రపతి రామ్ నాథ్ చేతుల మీదుగా పద్మ శ్రీ అందుకున్నారు.

అలాగే ప్రముఖ గాయకులు సోనూ నిగమ్,  సులోచనా చవాన్ లకు పద్మ శ్రీ పురస్కారం అందించారు. అలాగే హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు ప్రభ అత్రే పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.

యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్, విదేశంలో సంస్కృతం టీచింగ్..

యూపీ మాజీ సీఎం, దివంగత నేత కల్యాణ్ సింగ్ (బీజేపీ) తరుఫున ఆయన కుమారుడు రాజ్ వీర్ సింగ్.. రాష్ట్రపతి రామ్ నాథ్ చేతుల మీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. అలాగే ఐర్లాండ్ లోని స్కూల్స్ లో సంస్కృత భాషకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు టీచింగ్ చేస్తున్న ఐర్లాండ్ ప్రొఫెసర్ రూత్గెర్ కొర్టెన్ హోరస్ట్ కు పద్మ శ్రీ అందించారు.