భారత్ పే సీఈవో సుహైల్ సమీర్ రాజీనామా

భారత్ పే సీఈవో సుహైల్ సమీర్ రాజీనామా

భారత్ పే సీఈవో పదవికి సుహైల్ సమీర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నలిన్ నేగీకి కంపెనీ తాత్కాలిక సీఈఓ బాధ్యతలు అప్పజెప్పారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి తప్పుకున్న సుహైల్ సమీర్‭ జనవరి 7 నుంచి వ్యూహాత్మక సలహాదారుగా కొనసాగుతారని భారత్ పే ప్రకటించింది. భారత్ పే కొత్త సీఈవో కోసం వెతుకుతున్న బోర్డు.. అప్పటి వరకు కంపెనీ కార్యకలాపాలు సజావుగా కొనసాగించేందుకు వీలుగా ప్రస్తుత సీఎఫ్‌ఓ నలిన్‌ నేగి తాత్కాలిక సీఈఓగా కొనసాగనున్నారు. 

ఫిన్‌టెక్‌ విభాగంలో భారత్‌పేను అత్యున్నత స్థానంలో నిలిబెట్టడంలో కృషి చేసిన సుహైల్, నలిన్‭కు బోర్డు ఛైర్మన్‌ రజనీష్ కుమార్ కృతజ్ఞతలు చెప్పారు. ఆగస్టు 2020లో సుహైల్ సమీర్ భారత్ పేలో చేరారు. ప్రస్తుత తాత్కాలిక సీఈఓ నలిన్ నేగీ గతంలో GE క్యాపిటల్, SBI కార్డ్‌లో పనిచేశారు. ఆయన పదేండ్ల పాటు ఎస్‌బీఐ కార్డుకు సీఎఫ్‌వోగా ఉన్నారు. ఫిన్‌టెక్ ఇండస్ట్రీలో నలిన్కు ఉన్న అనుభవం సీఈఓ బాధ్యతలు అప్పజెప్పేందుకు కారణమని భారత్ పే ప్రకటించింది. 

ఇదిలా ఉంటే ఆర్థిక అవకతవకల ఆరోపణలపై జనవరి 2022 ప్రారంభం నుండి భారత్‌పే తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఉంది. నైకా ఐపీఓ విషయంలో కోటక్‌ గ్రూప్‌ ఉద్యోగి పట్ల కంపెనీ వ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ అసభ్య పదజాలం ఉపయోగించడం అప్పట్లో వివాదాస్పదమైంది. తర్వాత నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గ్రోవర్‌తో పాటు ఆయన భార్య మాధురి జైన్‌ గ్రోవర్‌ కంపెనీని వీడారు. అక్కడికి కొద్ది రోజులకే మరో సహ వ్యవస్థాపకుడు భవీక్‌ కొలాడియా సైతం కంపెనీ నుంచి నిష్క్రమించారు. ఇక జూన్ 2020లో భారత్ పే వ్యవస్థాపక సభ్యుడు సత్యం నాథని, చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ నిషిత్ శర్మ కూడా రాజీనామా చేశారు. అనంతరం పలువురు ఉన్నతస్థాయి ఉద్యోగులు సైతం కంపెనీ నుంచి బయటకు వచ్చారు.