
న్యూఢిల్లీ: టెలికం ఆపరేటర్భారతి ఎయిర్‌టెల్కు2025 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో నికరలాభం 432 శాతం పెరిగి రూ.11,022 కోట్లకు చేరుకుంది. నికరలాభం నుంచి ఎక్సెప్షనల్ ఐటెమ్స్‌ను తొలగిస్తే ఇది 77 శాతానికి తగ్గుతుందని తెలిపింది. కంపెనీ ఆదాయం కూడా సంవత్సరానికి 27.3శాతం పెరిగి రూ.47,876 కోట్లకు చేరుకుంది.
భారతదేశంతోపాటు ఆఫ్రికా నుంచి మొబైల్ సేవలు, ఎంటర్‌ప్రైజ్, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వ్యాపారాల నుంచి వచ్చిన భారీ ఆదాయాల వల్ల ఆశించిన వృద్ధి సాధించామని ఎయిర్‌టెల్ తెలిపింది. ఒక్కో యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయం మార్చి క్వార్టర్లో ఏడాది లెక్కన రూ.245కు చేరింది. ఇది గత మార్చి క్వార్టర్లో రూ.209 ఉంది. ఈ సందర్భంగా కంపెనీ వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.16 చొప్పున ఫైనల్ డివిడెండ్‌ను ప్రకటించింది.