
భీమవరం టాకీస్ బ్యానర్‌పై ఇప్పటికే 114 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. ఒకేరోజు 15 చిత్రాలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో శుక్రవారం ఈ చిత్రాలకు సంబంధించి ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మురళీమోహన్, రేలంగి నరసింహారావు, సుమన్, శ్రీకాంత్, జేడీ చక్రవర్తి, తనికెళ్ళ భరణి, 30 ఇయర్స్ పృథ్వీ, అజయ్ ఘోష్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, తుమ్మల ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, రచయిత విజయేంద్రప్రసాద్ తదితరులు హాజరై రామసత్యనారాయణను అభినందించారు. పదిహేను చిత్రాల టైటిల్స్, దర్శకుల వివరాలను ప్రకటించారు.
జస్టిస్ ధర్మ చిత్రానికి యండమూరి వీరేంద్రనాధ్ దర్శకత్వం వహిస్తుండగా, నాగపంచమి సినిమాకు ఓం సాయిప్రకాష్, నా పేరు పవన్ కల్యాణ్ మూవీకి జె.కె.భారవి, టాపర్ చిత్రానికి ఉదయ్ భాస్కర్, కె.పి.హెచ్.బి. కాలనీ సినిమాకు తల్లాడ సాయికృష్ణ, పోలీస్ సింహం చిత్రానికి సంగకుమార్, అవంతిక- 2 మూవీకి శ్రీరాజ్ బళ్ళా, యండమూరి కథలు సినిమాకు రవి బసర, బి.సి. బ్లాక్ కమాండో చిత్రానికి మోహన్ కాంత్, హనీ కిడ్స్ సినిమాకు హర్ష, సావాసం సినిమాకు ఏకరి సత్యనారాయణ, డార్క్ స్టోరీస్ మూవీకి కృష్ణ కార్తీక్, మనల్ని ఎవడ్రా ఆపేది చిత్రానికి బి.శ్రీనివాసరావు, ది ఫైనల్ కాల్ సినిమాకు ప్రణయ్ రాజ్ వంగరి, అవతారం సినిమాకు డా.సతీష్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలియజేశారు.