హైదరాబాద్లో భూత్ బంగ్లాగా మారిన..సువాసనల ప్యాలెస్

హైదరాబాద్లో భూత్ బంగ్లాగా మారిన..సువాసనల ప్యాలెస్
  • ఇల్లీగల్​ యాక్టివిటీస్​కు అడ్డాగా ముష్క్ మహల్  
  •     50 ఏండ్ల కిందటి వరకు స్కూల్​గా వాడకం 
  •     శిథిలావస్థకు చేరిన ప్యాలెస్​లో తీవ్ర దుర్వాసన
  •     మహల్​ను పరిరక్షించాలంటున్న చరిత్రకారులు

హైదరాబాద్, వెలుగు : కుతుబ్ షాహీల పాలనలో హైదరాబాద్​లో నిర్మించిన అద్భుత కట్టడాల్లో ముష్క్ మహల్ ఒకటి. 350 ఏండ్ల చరిత్ర కలిగిన ప్యాలెస్​ను అద్భుతమైన ఆర్కిటెక్చర్​తో నిర్మించారు. ఆ కాలంలో నిజాం రాజులకు గెస్ట్ హౌస్​గా ఉండేది.  50 ఏండ్ల కిందటి వరకు అత్తాపూర్ వాసులకు స్కూల్​గానూ సేవలందించింది. కొన్నాళ్లుగా నిరాధారణకు గురైంది. 

ఇల్లీగల్​ యాక్టివిటీస్​కు అడ్డాగా మారింది. ఒకప్పుడు సువాసనల ప్యాలెస్​గా పేరుపొందగా.. నేడు తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ చారిత్రక కట్టడాన్ని గత ప్రభుత్వాలు, బల్దియా, పురావస్తు శాఖ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరి.. నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తోంది. కొంతకాలం కిందటి వరకు మహల్​ను పరిరక్షించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు కొన్ని ప్రోగ్రామ్స్​నిర్వహించాయి. ప్రస్తుతం ఎవరూ పట్టించుకోకపోవడంతో భూత్ బంగ్లాను తలపిస్తున్నది. 

 స్కూల్, కమ్యూనిటీ హాల్​గా.. 

అత్తాపూర్​లోని  ముష్క్ మహల్ ఒకప్పుడు స్కూల్ గా ఉండేదని స్థానికులు చెబుతుంటారు.  50 ఏండ్ల కిందటి దాకా స్కూల్ కోసం వాడగా..  ఆ తర్వాత ప్యాలెస్​ను పట్టించుకోవడం మానేశారు. అత్తాపూర్​కు కమ్యూనిటీ హాల్​ గాను, ఏవైనా పంచాయతీలు, తీర్మానాలు చేయాలంటే ఊరి పెద్ద మనుషులు ప్యాలెస్​ను వినియోగించేవారు. 

ఫొటో షూట్ కోసం లోపలికి వెళ్లగా..  

 ముష్క్ మహల్ వైపు నుంచి వెళ్లే మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. తాగుబోతులకు అడ్డాగా మారింది. మహల్​లో ఇప్పటికే రెండు హత్యలు జరిగాయని, ఒక మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ప్యాలెస్​లోని గ్రౌండ్ ఫ్లోర్​లో  కొందరు రెగ్యులర్​గా  టాయిలెట్స్ చేస్తుంటారు. దీంతో అటుగా వెళ్లే వాళ్లు దుర్వాసన భరించలేక ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.  

ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలో పెద్ద చెట్లు పెరిగాయి. గాజు పెంకులు, మట్టి, రాళ్లు, లోపల కూలిన గోడలతో శిథిలావస్థకు చేరింది.  ఇటీవలే కొందరు యువకులు ఫొటోషూట్ కోసం ప్యాలెస్ లోపలికి వెళ్లారు. అక్కడ ఏదో సొరంగమార్గం ఉందని ఇంకొంచెం లోపలికి వెళ్లగా వారికి పాము కనిపించింది. దీంతో భయంతో బయటకు పరుగులు తీసి స్థానికులకు విషయం చెప్పారు. అంతేకాకుండా  ఆ ప్యాలెస్​లో సొరంగ మార్గం, గుప్తనిధులు ఉన్నాయనే వదంతులు వినిపిస్తుంటాయి.  

స్వచ్ఛంద సంస్థల ప్రోగ్రామ్స్ 

మహల్​ను పరిరక్షించడానికి  పలు స్వచ్ఛంద సంస్థలు ప్రోగ్రామ్స్ నిర్వహించాయి. 2006లో ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ చైర్మన్ మణికొండ వేదకుమార్ ఆధ్వర్యంలో డెలాయిట్ సాఫ్ట్ వేర్ సంస్థ సహకారంతో రెండు రోజుల పాటు క్లీనింగ్ చేశారు. నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) సంస్థ తన హెరిటేజ్ లిస్ట్​లో ముష్క్ మహల్​ను చేర్చుకుంది. 

350 ఏండ్ల చరిత్ర.. 

 ముష్క్ మహల్​ 1676లో కుతుబ్​ షాహీల చివరి రాజు అబుల్ హసన్ తానీషా కమాండర్ మాలిక్ మియాన్ మిష్క్ నిర్మించారని చరిత్రకారులు పేర్కొంటారు. మరికొందరు అబుల్ హసన్ తానీషా అత్తరు సీసాలను తీసుకొచ్చి ప్యాలెస్ కింది భాగంలో దాచేవారని, అందుకే దీనికి సువాసనల ప్యాలెస్​గా పేరొచ్చిందని చెబుతుంటారు. రెండతస్తుల అద్భుతమైన కట్టడం వాతావరణానికి అనుకూలంగా ఉండటంతో పాటు ప్రైవసీ ఉండేలా నిర్మించారు. గాలి, వెలుతురుకు విశాలమైన కిటికీలను పెట్టారు. రెండు ప్రధాన ద్వారాలు ఉండగా..  ప్యాలెస్ వద్ద గార్డెన్, కొలన్ కూడా ఉండేది. కుతుబ్ షాహీ రాజుల కుటుంబ సభ్యులు మహల్​ను యూనిక్ గెస్ట్ హౌస్​గా వినియోగించేవారని చరిత్రకారులు గుర్తు చేస్తుంటారు.

ఆ మహల్​లో ఆడుకున్నాం.. 

 50 ఏండ్ల కిందట మా అమ్మ ముష్క్ మహల్​లోనే చదువుకుంది. మా చిన్నప్పుడు ఆ మహల్​లో  ఆడుకున్నాం. ప్రస్తుతం దాన్ని పట్టించుకునేవారు లేక చెత్తతో నిండిపోయింది. తాగుబోతులకు అడ్డాగా మారింది. ఇప్పటికైనా  ప్రభుత్వం చారిత్రక కట్టడాలను కాపాడడానికి చర్యలు తీసుకోవాలి.  – చిన్నా, అత్తాపూర్
 
 ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధం 

హైదరాబాద్​లో  ఎన్నో చారిత్రక కట్టడాలు ఉండగా.. గత ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం అయినా చారిత్రక కట్టడాలను కాపాడాలి. కావాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఇంటాక్ సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  – అనురాధ రెడ్డి,కన్వీనర్, 
ఇంటాక్, హైదరాబాద్

చారిత్రక సంపదకు పూర్వ వైభవం తేవాలి  

సిటీలో నిరాధారణకు గురైన చారిత్రక కట్టడాలు చాలా ఉన్నాయి. నిజాం అబ్జర్వేటరీ, ఎర్రమంజిల్ ,అలావే సర్దుఖ్, ఫక్కుల్ ముల్క్ సమాధి , మెహబూబ్ మాన్షన్, మౌలాలిలోని మహ్ లఖాబాయి సమాధి , క్లాక్ టవర్స్ లాంటి కట్టడాలను పరిరక్షించుకోవాలి.  ప్రభుత్వం దృష్టిపెట్టి తగు చర్యలు తీసుకుంటే వాటికి పూర్వవైభవం తేవచ్చు. చారిత్రక సంపద రక్షణకు మా సంస్థ తరఫున కొన్ని దశాబ్దాలుగా పరిక్షణకు చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం.
– మణికొండ వేదకుమార్, చైర్మన్, 
ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరాబాద్