భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వాసుల దీనగాథ

భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి వాసుల దీనగాథ
  • ఇసుక మేటలతో పనికిరాకుండా పోయిన వ్యవసాయ భూములు
  •  వరదకు బర్రెలు కొట్టుకుపోవడంతో బంద్ అయిన పాడి
  •  కుటుంబం ఎలా గడవాలో.. అప్పులు ఎలా తీర్చాలో తెలియక గ్రామస్తులు ఆగం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: ‘‘పచ్చటి పంట పొలాలు.. పాడి గేదెలు.. విశాలమైన ఖాళీ స్థలాల్లో కట్టుకున్న ఇళ్లు.. పది మందికి పని కల్పించిన మోతుబరి కుటుంబాలు... వ్యవసాయ పనులతో రోజంతా బిజీగా గడిపిన జీవితాలు.. గొడవలంటే తెల్వని ఊరు.. కలిసి మెలిసి జీవించిన గ్రామస్తులు..” ఇదీ మొన్నటి వరకు జయశంకర్​భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామంలోని పరిస్థితి. కానీ ఒక్క రాత్రితో అంతా తలకిందులైంది. భారీ వర్షాలకు పోటెత్తిన వదర ఊరిని ముంచింది. మనుషుల ప్రాణాలు తప్ప గ్రామంలో ఏమీ మిగలేదు. భూములున్న రైతులు, పాడిని నమ్ముకుని బతుకుతున్న వ్యాపారులు, రోజూవారీ కూలీలు అంతా రోడ్డున పడ్డారు. ఒక్కవానకు సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరవుతున్నారు. జరిగిన నష్టాన్ని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. చేయడానికి పనుల్లేక.. భవిష్యత్​ఏమిటో తెలియక తల్లడిల్లుతున్నారు. సర్కారు ఇచ్చే అరకొర సాయం తమకు ఏ మూలకు సరిపోదని వాపోతున్నారు. పిల్లలను, కుటుంబాన్ని పోషించుకోవడానికి పట్నం పోయి ఏదైనా పని చేసుకుంటామని పలువురు వరద బాధితులు చెబుతున్నారు.

కోట్లల్లో ఆస్తి నష్టం

మోరంచ వాగు ఉధృతికి మోరంచపల్లి గ్రామం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత గ్రామం. 90 శాతం రైతు కుటుంబాలే ఉన్నాయి. వ్యవసాయం చేస్తున్న రైతులే పాల వ్యాపారం కూడా చేస్తున్నారు. గ్రామానికి ఆనుకొని జెన్‌‌‌‌ కో సంస్థకు చెందిన 1,100 మెగావాట్ల విద్యుత్​ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ ఉండే ఇంజినీర్లు, ఉద్యోగులకు పాలు పోసి నెల నెల డబ్బులు తీసుకొని కుటుంబాలను పోషించుకుంటారు. సర్కారు లెక్కల ప్రకారం ఊరిలో 295 ఇండ్లు ఉండగా వీటిలో 306 కుటుంబాలు ఉన్నాయి. 983 మంది జనాభా నివసిస్తున్నారు. గత నెల 27న అర్ధరాత్రి సమయంలో వాగు పొంగి గ్రామాన్ని జలదిగ్భంధం చేసింది. వరదల్లో నలుగురు కొట్టుకుపోగా ముగ్గురి డెడ్​బాడీలు లభ్యం అయ్యాయి. 26 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 74 ఇండ్లు సగం దెబ్బతిన్నాయి. 147 పాడి గేదెలు, 4 ఎద్దులు, 15 ఆవులు, 9 లేగ దూడలు, 739 కోళ్లు  కొట్టుకుపోయాయి. ఒక ఫిష్‌‌‌‌ ఫ్యాక్టరీ కొట్టుకుపోయింది. అలాగే 8 బైకులు, 2 కార్లు, ట్రాలీ ఆటో, ట్రాక్టర్‌‌‌‌, 2 బొలెరో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. రోడ్డు పక్కన ఉన్న కిరాణా దుకాణాలు, ఇతర షాపులకు నష్టం కలిగింది. 

అక్కరకురాని 950 ఎకరాలు 

మోరంచవాగు ఉధృతికి గ్రామంలోని 950 ఎకరాల పంట భూములు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇసుక మేటలు వేయడంతో వ్యవసాయానికి అక్కరకు రాకుండా పోయాయి. ఇక్కడి రైతులు ముఖ్యంగా మిర్చి, వరి సాగు చేస్తారు. మిర్చి సాగుకు, వరినాట్ల కోసం నార్లు పోశారు. అన్నీ వరదలకు కొట్టుకుపోయాయి. ఒక్కో రైతు కుటుంబానికి ఎకరానికి రూ.లక్ష వరకు నష్టం వాటిల్లింది. పాడిగేదెలు కొట్టుకుపోవడంతో పాల వ్యాపారం బంద్​అయింది. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నష్టం కలిగింది. 

పట్టించుకోని సర్కారు

వరదలకు పెద్ద మొత్తంలో దెబ్బతిన్న మోరంచపల్లి గ్రామస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవట్లేదు. ఇండ్లు కూలిపోయిన వాళ్లకు డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌ రూం ఇండ్లు కట్టిస్తామని, వరదల్లో కొట్టుకుపోయిన పాడిగేదెల స్థానంలో కొత్తవి కొనిస్తామని సర్కారు నుంచి ఎలాంటి హామీ రాలేదు. దెబ్బతిన్న పంట పొలాలను తిరిగి సాగులోకి తీసుకురావడానికి చేసే సాయంపై ఇప్పటివరకు స్పందన లేదు. కేవలం ఒక్కో కుటుంబానికి రూ.3,200 విలువ చేసే 15 రకాల నిత్యావసర సరుకులను మాత్రమే అధికారులు అందజేశారు. 25 కేజీల బియ్యం, 5 కిలోల కంది పప్పు, 3 కిలోల మంచి నూనె, కిలో చింతపండు, 3 ఉల్లిగడ్డలు, పసుపు పౌడర్‌‌‌‌, టీ పౌడర్‌‌‌‌, 3 కేజీల షుగర్‌‌‌‌, 2 సబ్బులు, కిలో ఉప్పు, కిలో కారం, దనియాల, జిలకర పౌడర్‌‌‌‌, 10 బిస్కెట్‌‌‌‌ ప్యాకెట్లు, కిలో ఉప్మా రవ్వ, క్యాండిల్స్‌‌‌‌, అగ్గిపెట్టె ఇచ్చి సరిపెట్టారు. 

ఏమి ఉందని ఇక్కడ ఉండాలి

రామంజపూర్ గ్రామం నుంచి వలస వచ్చి ఇక్కడి ఇనుకుర్తి వెంకటరెడ్డి, శేషమ్మ ఇంట్లో కిరాయికి ఉంటున్నాం. రెండేళ్లుగా ఇక్కడే బర్లు కాసుకుంటున్నాం. ఇటీవల వరదల్లో చచ్చి బతికాం. వరద ముంచెత్తడంతో ఇంట్లోని సరుకులన్నీ పాడైపోయాయి. బియ్యం, ఉప్పులు, పప్పులు కొట్టుకుపోయాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. కనీసం నిత్యవసరాలు కూడా ఇవ్వలేదు. ఇంకా ఏ సాయం చేస్తారని ఇక్కడ బతకాలి.
‒ సామర్ల జంపయ్య, పోశయ్య, 
   పెండల కొమురయ్య కుటుంబాలు

ఏం చేసుకుని బతకాలి

10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాం. 15 బర్రెలు ఉన్నాయి. వ్యవసాయంతోపాటు పాలు అమ్ముకొని జీవించేటోళ్లం. బ్యాంకులో లోన్​తీసుకుని ట్రాక్టర్​ కొన్నాం. మొన్నటి వరదలకు 12 బర్రెలు, ట్రాక్టర్‌‌‌‌ కొట్టుకుపోయాయి.10 ఎకరాల భూమి అక్కరకు రాకుండా పాడైంది. దాదాపు రూ.12 లక్షలు నష్టం వచ్చింది.  పాడి లేక, వ్యవసాయం చేయలేక ఎలా బతకాలో తెలియడం లేదు. ట్రాక్టర్‌‌‌‌లోన్‌‌ ఎలా కట్టాలో అర్థం అయితలేదు?
‒ వర్ణం హైమావతి, మోరంచపల్లి

30 పాడి గేదేలు కొట్టుకుపోయినయ్‌‌‌‌

నా భర్త చనిపోయి 12 ఏళ్లు అవుతోంది. ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. భర్త పోయాక ఒట్టి చేతులతో మోరంచపల్లిలోని పుట్టింటికి వచ్చాను. మొదట ఒక గేదెను కొని పాలు అమ్ముకొని పిల్లలను పోషించుకుంటూ వచ్చాను. ప్రస్తుతం 36 గేదెలతో పాడి చేస్తున్నాను. ఇటీవల వరదలో 30 బర్రెలు కొట్టుకుపోయాయి. రెండు ఎకరాల భూమి కోతకు గురైంది. కేవలం 6 బర్రెలు మిగిలినయ్‌‌‌‌. దాదాపు రూ.15 లక్షలు నష్టపోయాను. పిల్లలు బీటెక్, డిగ్రీ చదువుతున్నారు. వాళ్ల ఫీజులు ఎట్లా కట్టేది?
‒ కాసం కళ్యాణి, మోరంచపల్లి

అప్పు చేసి కట్టిన ఇల్లు కొట్టుకుపోయింది

మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయంతోపాటు 35 బర్రెలతో పాడి చేసుకుని జీవిస్తున్నాం. బిడ్డకు పెండ్లి చేశాం. కొడుకు చదువుకుంటున్నాడు. రూ.20 లక్షలు అప్పు తెచ్చి కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. పాల వ్యాపారంతో బాకీలు తీరుద్దాం అనుకున్నాం. ఇంతలో వరదలొచ్చి ఇంటితోపాటు, 15 గేదేలు కొట్టుకుపోయాయి. పాల వ్యాపారం బంద్‌‌‌‌ అయింది. పొలంలో ఇసుక మేటలు వేశాయి‌‌. మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు.
‒ కొత్త కోమల, మోరంచపల్లి