బిగ్ అలర్ట్: జూలై 15 నుంచి IRCTC కొత్త వెబ్‌సైట్.. ఇక తత్కాల్ టెన్షన్లకు గుడ్‌బై!

బిగ్ అలర్ట్: జూలై 15 నుంచి IRCTC కొత్త వెబ్‌సైట్.. ఇక తత్కాల్ టెన్షన్లకు గుడ్‌బై!

కోట్ల మంది భారతీయ రైల్వే ప్రయాణికులకు నిత్యం ఎదురయ్యే అతిపెద్ద తలనొప్పి.. IRCTC వెబ్‌సైట్ పనితీరు. కరెక్ట్‌గా ఉదయం 10 గంటలకు తత్కాల్ బుకింగ్ ఓపెన్ కాగానే స్క్రీన్‌పై లోడింగ్ వీల్ తిరగడం, అస్పష్టమైన క్యాప్చా కోడ్‌లు, పేమెంట్ ఫెయిల్యూర్స్, మధ్యలోనే సెషన్ టైమౌట్ కావడం సర్వసాధారణం. కళ్ల ముందే సీట్లు అయిపోతుంటే ప్రయాణికులు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలోనే జైపూర్‌లోని MNIT విద్యార్థులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను నేరుగా కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. విద్యార్థుల ఫిర్యాదుపై మంత్రి తక్షణమే స్పందించి.. అక్కడికక్కడే అధికారులతో ఫోన్లో మాట్లాడి జూలై 15 నాటికి సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని డెడ్‌లైన్ విధించారు.

ప్రయాణికుల ప్రధాన సమస్యలు..
ప్రస్తుతం ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా తత్కాల్ బుకింగ్ సమయంలో సైట్ విపరీతంగా స్లో అవ్వడం, క్రాష్ అవ్వడం జరుగుతోంది. లాగిన్ అయ్యేటప్పుడు వచ్చే క్యాప్చా ఇమేజ్‌లు అస్సలు అర్థం కాకపోవడం, బుకింగ్ మధ్యలో ఉండగానే అకౌంట్ లాగౌట్ అయిపోవడం పెద్ద మైనస్. వీటికి తోడు సమయానికి ఓటీపీలు రాకపోవడం, సీట్లు సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ ఫెయిల్ అవ్వడం వంటివి ప్రయాణికులను తీవ్రంగా వేధిస్తున్నాయి. సామాన్యుల కంటే ముందే ఏజెంట్లు, ఏఐ బాట్స్ టికెట్లను ఎగరేసుకుపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికే 2.5 కోట్ల అనుమానాస్పద యూజర్ ఐడీలను బ్లాక్ చేసినప్పటికీ.. సాంకేతిక లోపాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

జూలై 15 లోపు ప్రయాణికులు చేయాల్సిన పనులు..
కొత్త వెబ్‌సైట్ రాబోతున్న నేపథ్యంలో ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొత్త ప్లాట్‌ఫామ్‌లోకి మారేటప్పుడు మళ్లీ రీ-వెరిఫికేషన్ అడిగే అవకాశం ఉన్నందున, మీ ఐఆర్‌సీటీసీ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సురక్షితంగా సేవ్ చేసుకోండి. అకౌంట్ వాలెట్‌లో ఏదైనా బ్యాలెన్స్ ఉందా లేదా పెండింగ్ రీఫండ్‌లు ఉన్నాయా అనేది ముందే చెక్ చేసుకోండి. అలాగే జూలై 15 దగ్గరలో ప్రయాణాలు చేయాలనుకునే వారు.. ఆ రోజే కాకుండా అంతకంటే ముందే టికెట్లను బుక్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే కొత్త సైట్ లైవ్‌లోకి వచ్చిన మొదటి రోజు కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం సహజంగానే ఉంటుంది కాబట్టి.

క్యాప్చా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందా?
ఈ మొత్తం మార్పులకు ప్రధాన కారణం క్యాప్చా సమస్యే కాబట్టి.. కొత్త వెబ్‌సైట్‌లో సులభమైన, స్పష్టమైన లాగిన్ ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ అప్‌డేట్ కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్ పోర్టల్‌కు మాత్రమే పరిమితం. ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌లో మార్పుల గురించి మంత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏదేమైనా జూలై 15 నుంచి రాబోతున్న కొత్త వెబ్‌సైట్ ప్రయాణికుల తత్కాల్ కష్టాలను తీరుస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.