బోగస్ డెత్ సర్టిఫికేట్లతో రూ.కోట్ల నిధులు క్లెయిమ్

బోగస్ డెత్ సర్టిఫికేట్లతో రూ.కోట్ల నిధులు క్లెయిమ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన కార్మికశాఖ, సంక్షేమ బోర్డు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. బోగస్ డెత్ సర్టిఫికేట్లు, బోగస్ బిల్లులతో రూ. కోట్లు కొల్లగొట్టారు. గత ఆరేండ్లలో నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా రూ.531 కోట్లు ఖర్చు చేయగా, 2022లో ఏకంగా రూ.1,419 కోట్లు ఖర్చు అయినట్టు అధికారులు లెక్కలేశారు. రాష్ట్ర బడ్జెట్ వివరాల్లో రూ.300 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొనడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. వెయ్యికోట్ల నిధులు గాయబ్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)తో బోర్డులోని అవినీతి దందాకు సంబంధించి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా రాష్ట్రంలో 20 లక్షలకు పైగా కార్మికులకు వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కార్మికులు సహజంగా చనిపోతే రూ.1.30 లక్షలు, యాక్సిడెంట్​లో చనిపోతే రూ.6.30 లక్షలు, మ్యారేజ్ గిఫ్ట్ కింద రూ.30 వేలు, డెలివరీ సాయం కింద రూ.30 వేలు, యాక్సిడెంట్​లో వైకల్యం పొందితే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సాయం, పిల్లల చదువులకు సాయం.. ఇలా పది రకాల సహాయాలు పొందుతుంటారు. భవన కార్మికుల్లో చాలా మంది పెద్దగా చదువుకోని వారే ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని బ్రోకర్లు, అవినీతి అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. సభ్యులు కాని వారిని అయినట్టు, బతికున్న వాళ్లను చనిపోయినట్టు బోగస్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి కోట్లు కొల్లగొడుతున్నారు. 

బడ్జెట్​లో రూ.300 కోట్లు.. ఖర్చు 1,417 కోట్లు

2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి దాకా 2.56 లక్షల మందికి రూ.1,417 కోట్లు సాయం చేసినట్టు బోర్డు లెక్కలు చెప్తున్నాయి. కానీ, స్టేట్ బడ్జెట్ లో గతేడాది రూ.300 కోట్లు ఖర్చు చేసినట్టు చూపించారు. తక్కువ ఎందుకు చూపించారనే దానిపై క్లారిటీ లేదు. ఆర్టీఐ ద్వారా ఇచ్చిన లెక్కలు కరెక్టా.. బడ్జెట్​లో ఇచ్చిన వివరాలు కరెక్టా అనేదానిపై స్పష్టత లేదు. 2014–15 నుంచి 2019–20 దాకా బోర్డు ద్వారా 531 కోట్లు ఖర్చు చేయగా, 2020–23లో రూ.1417 కోట్లు ఖర్చు చేసినట్టు చూపిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.సూర్యపేట జిల్లాలో 80 డెత్ క్లెయిమ్​లు చేశారు. దీనిపై అనుమానాలు వచ్చి అధికారులు 15 అప్లికేషన్లను విచారించగా, అవన్నీ బోగస్ డెత్ సర్టిఫికేట్లతో క్లెయిమ్ చేశారనీ తేలింది.వరంగల్ జిల్లాలో 63 మంది లబ్ధిదారులకు డెత్ క్లెయిమ్ రెండు సార్లు చెల్లించారు. ఇందులో రూ.64 లక్షలు నష్టం జరిగింది. డెత్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో రూ.25 కోట్ల దుర్వినియోగం జరిగినట్టు ఎంక్వైరీలో బయటపడింది.

ఎంక్వైరీ చేయించాలె

మూడేండ్ల కింద  లేబర్ సెస్ వసూళ్లలో అక్రమాలు బయటపడ్డాయి. ఏడాదిలో రూ.1417 కోట్లు పంపిణీ వెనుక భారీ స్కాం ఉంది. వీటన్నింటిపై ఏసీబీతో ఎంక్వైరీ చేయించాలె.
–ఎం.శ్రీనివాస్ రెడ్డి, సీపీఎం నేత

ఒకే ఏడాది 40,900 మంది చనిపోయారా?

ఏటా వెయ్యి, 2 వేల మంది చనిపోయినట్లు అధికారులు లెక్కలు చూపిస్తుంటారు. కానీ 2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి దాకా 14 నెలల్లో ఏకంగా 40,900 మంది భవన నిర్మాణ కార్మికులు సహజ మరణం పొందారని లెక్కలు రాసుకున్నారు. బాధిత కుటుంబాలకు రూ.525 కోట్లు ఇచ్చినట్టు తేల్చారు. 4,027 మంది ప్రమాదాల్లో చనిపోయారని, 313 వైకల్యం పొందారని లెక్కచూపారు. వీరికి రూ.260 కోట్లు చెల్లించినట్టు పేర్కొన్నారు. మహిళా కార్మికులకు ప్రసవం జరిగితే సాయం కింద 30 వేలు ఇస్తారు. 14 నెలల్లో 1,38,250 మందికి ఈ కేటగిరీలో రూ.415 కోట్లు ఇచ్చినట్టు లెక్క చూపారు. పెండ్లి కానుక కింద 71,661 మందికి రూ.215 కోట్లు ఇచ్చి నట్టు పేర్కొన్నా రు. ఈ బోగస్ డెత్ సర్టిఫికెట్ల దందాలో హనుమకొండ జిల్లాలో ఓ అధికారి బంధువును అరెస్ట్ చేశారు.