తెలంగాణలో కొత్త సర్కారుకు తొలి బడ్జెట్..కత్తి మీద సామే

తెలంగాణలో కొత్త సర్కారుకు తొలి బడ్జెట్..కత్తి మీద సామే

వెంట్రుకలున్నమ్మ  కొప్పు ఎలా వేసినా కుదురుతుందని పెద్దలు చెప్పినట్లుగా, బీఆర్​ఎస్ ప్రభుత్వం మొదటి నాలుగైదు సంవత్సరాలు బడ్జెట్ తయారు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఎంత దుబారా చేసి బంధువులకు మిత్రులకు వందిమాగధులకు సకల సౌకర్యాలతో అందలా లెక్కించినా ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ భరించింది. ఖర్చు కంటే ఆదాయం ఎక్కువగా ఉండడం రకరకాల కారణాలతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చుకోవడం ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టడం జరిగిందని గణాంకాలు ఇతర రికార్డులు తెలియచేస్తున్నాయి.

ప్రాధాన్యాలు తప్పాయి, దుబారా పెరిగింది

ప్రభుత్వ ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్న రోజులవి. చిన్న రాష్ట్రానికి పెద్ద రాజధాని ఉండడం వల్ల హైదరాబాదు నగరం ద్వారా వచ్చే రాబడులు ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను  మిగులు రాష్ట్రంగా చూపించింది. కేసీఆర్​ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా పెట్టుకొని మద్యం వ్యాపారాన్ని మారుమూల గ్రామాలకు విస్తరించి, మద్యం ధరలు పెంచి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం జరిగింది. ఇంకా డీజిల్, పెట్రోల్​పై అదనపు వాల్యూ ఆడెడ్ టాక్స్, రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్, భూముల విలువలు అనేక రెట్లు పెంచి నిరర్థకమైన ఖర్చులు పెట్టడం జరిగింది. అనుత్పాదకమైన, నిరర్థకమైన  ప్రాజెక్టులను ప్రజల నెత్తిన రుద్ది తెలంగాణను అప్పుల రాష్ట్రంగా దిగజార్చడం జరిగిందని మేధావులు చైతన్యవంతమైన ప్రజలు ఆవేదన పడుతున్న రోజులు ఇవి. గత రెండు మూడు ఏండ్లుగా ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతభత్యాలు చెల్లించడంలో విపరీతమైన జాప్యం జరిగింది. సంక్షేమ హాస్టళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా సరైన సమయంలో చెల్లింపులు చేయలేదు. ప్రాధాన్య రంగాలైన ప్రభుత్వ విద్య, వైద్య వ్యవస్థలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయక, కేటాయింపులు చేసినా నిధులు విడుదల చేయకపోవడం వల్లే పేద విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమైనారు. వృథా ఖర్చులు, స్వీయ మీడియా ద్వారా పబ్లిసిటీ ప్రచారాలు చేసుకుని, నజరానాలు, దానధర్మాలు చేయడం, ప్రభుత్వ యంత్రాంగంలో విచ్చలవిడి ఖర్చులు చేసి తిలాపాపం తలా పిడికెడు కైంకర్యం చేసినట్లు అనేక ఉదంతాలు తెలియచేస్తున్నాయి.

మిగిల్చింది అప్పులు, బకాయిల చెల్లింపులే 

బడ్జెట్ తయారీలో వాస్తవాలు ప్రతిబింబించకుండా ప్రజలను మభ్యపెడుతూ సంపన్న రాష్ట్రమని, అపారమైన సంపద సమకూర్చినామని ప్రచార పటాటోపాలు ప్రదర్శించడం జరిగింది. గత పాలకులు గద్దె దిగే నాటికి రాష్ట్రానికి స్థూలంగా ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులు మిగిల్చారు. ప్రతి సంవత్సరం 40 వేల కోట్ల రూపాయల వడ్డీ, అసలు,- కిస్తీలు కట్టేస్థాయికి చేర్చారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ప్రస్తుత సంవత్సరంలో 40 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకోవడానికి అవకాశం ఉండగా బీఆర్​ఎస్​ ప్రభుత్వం అనుమతించిన మేరకు మొత్తం అప్పు తేవడం ఖర్చు పెట్టడం కూడా జరిగిపోయింది. నూతన ప్రభుత్వానికి మిగిలింది అప్పులు, చెల్లించవలసిన వేలకోట్ల రూపాయల బకాయిలు, ఇక చిప్ప మాత్రమే మిగిల్చారని శ్వేత పత్రం తెలియజేస్తున్నది. 

అంచనాల ఆర్భాటం

గత సంవత్సరం ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ రూ. 2,90,396  కోట్లు. ఇందులో వివిధ రకాల మూలధన రెవెన్యూ రాబడులు, ఆదాయాలు  మొత్తం కలిపి రూ.2,59,861 కోట్లకు అంచనా వేయడం జరిగింది. అందులో మొదటి తొమ్మిది నెలల కాలంలో కేవలం 1,49,316 కోట్ల (57%) వనరులు మాత్రమే సమకూరాయి. ఇక మిగిలిన మూడు నెలల కాలంలో వివిధ రకాల ఆదాయ వనరులు ప్రభుత్వానికి మరో రూ. 50 వేల కోట్లకు మించకపోవచ్చు.  గత ప్రభుత్వ అంచనాలకు దాదాపు రూ.50,0-60 వేల కోట్ల లోటు ఏర్పడే పరిస్థితి ఉంది. అంచనాలు ఎక్కువ చూపించడం, ఖర్చులు గోప్యంగా ఉంచడం గత ప్రభుత్వానికి ఒక దుర్మార్గపు అలవాటుగా మారింది.

పెరగనున్న బడ్జెట్​ అంచనా

గత ఏడాది సంక్షేమ పథకాలకు రూ. 56,037 కోట్లు, వడ్డీలకు రూ.14,637 కోట్లు, వేతనాలకు పెన్షన్లకు దాదాపు రూ. 40 వేల కోట్లు, సబ్సిడీలకు రూ. 6000 కోట్లు చూపించడం జరిగింది. 2024-–25 ఆర్థిక సంవత్సరం కూడా కొత్త ప్రభుత్వం జీతాలు, పెన్షన్లకు కనీసం రూ.45 వేల కోట్లు  కేటాయించవలసిన అవసరముంది. ప్రస్తుత సంవత్సరం నుంచి 60 సంవత్సరాలు పూర్తి అయిన ఉద్యోగులు పదవీ విరమణ చేయడం వల్ల కూడా కొత్త ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది. ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఎంత హేతుబద్ధంగా అమలు చేసినప్పటికీ కనీసం రూ. 50వేల కోట్లు అవసరం కావచ్చు. వడ్డీలు, అసలు వాయిదాలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగి 40 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. గత పది సంవత్సరాల నుంచి నిర్లక్ష్యానికి గురి అయిన విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్​లో కనీసం రూ. 20 వేల కోట్లు కేటాయించవలసిన అవసరం ఉంది. కొత్త ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలు నింపడం విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతలు పెంచుతామని చెప్పడం ప్రజలు హర్షించారు. ఈ కారణాల మూలంగా కొత్త ప్రభుత్వం  వార్షిక బడ్జెట్ 
రూ. 3 లక్షల కోట్లకు తగ్గకుండా ఉండవచ్చు.

సంపన్న రాష్ట్రం అంటూ కేంద్ర నిధులకు దూరం చేశారు

అదనపు ఆదాయ వనరుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందు కనిపించే ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఇరుకైపోయినాయి. చంద్రశేఖర రావు ప్రభుత్వం దేశంలో అనేక రాష్ట్రాల కంటే ఎక్కువ పన్ను రేట్లు విధించి, కఠినంగా వసూలు చేసింది. టాక్స్ రెవెన్యూ అధికారులు వసూళ్లలో ఈ రాష్ట్రాన్ని రెండవ స్థానంలో నిలబెట్టి, ఒక సంపన్నమైన రాష్ట్రంగా చిత్రీకరించి కేంద్రం నుంచి రావలసిన అదనపు నిధులకు అర్హత లేకుండా చేసింది. ఈ కారణంగా తెలంగాణ అనేక వెనుకబడిన జిల్లాల, ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి రావలసిన నిధులు రాకుండా పరోక్షంగా అడ్డుకుంది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఓటమిపాలైందని చెప్పక తప్పదు.

అవినీతిని కట్టడి చేసి ఆదాయం పెంచుకోవాలి

ప్రస్తుత ప్రభుత్వం విలువైన ఆస్తులను అమ్మడానికి సాహసించకపోవచ్చు.  ప్రభుత్వ ప్రాజెక్టుల ఎస్టిమేట్లు, ఖర్చులు పెట్టడంలో హేతుబద్ధత పాటించాలి. గ్రానైటు, ఇసుక వనరులపై మధ్యవర్తులు, అవినీతి పరులైన అధికారులు, వేల కోట్లు గడిస్తున్నారు. కొందరు అవినీతిపరులైన ప్రభుత్వ అధికారుల చేతివాటంతో ప్రభుత్వ ఆదాయాలకు గండిపడుతున్న విషయాన్ని నియంత్రించాలి. అలాంటి అధికారులను కఠినంగా శిక్షించాలి. ప్రైవేట్ రంగంలో ఇసుకను సిమెంట్ కంటే ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. అవినీతిపరులైన అధికారులు, నాయకులు ప్రతి ఏటా రూ. వేలకోట్లు  ప్రభుత్వ ఆదాయానికి గండి కొడు తున్నారు. ఇసుకను ప్రభుత్వ ఆధ్వర్యంలో అమ్మడం వల్ల ధర తగ్గవచ్చు, ప్రభుత్వానికి ఆదాయమూ పెరగవచ్చు. గ్రానైట్​పై రాబడులను పెంచుకోవచ్చు. 

పేదలపై భారం పడకుండా..

పేదల ఇండ్ల స్థలాలకు మినహాయింపులు ఇచ్చి, విమర్శలకు తావివ్వకుండా 500 చదరపు గజముల నుంచి ఆపైన ఉన్న ఖాళీ నివాస స్థలాలను  ల్యాండ్ రెగ్యులరైజేషన్ అమలుపరచాలి. తక్కువ చార్జీలతో ఎక్కువ  ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. రాష్ట్ర స్థాయిలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి పేద వర్గాలపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వ ఆదాయాలను పెంచడానికి గల అవకాశాల గురించి అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఇక నుంచి ఉత్పత్తి ఉపాధి రంగాలను బలోపేతం చేసి ప్రభుత్వ వార్షిక ఆదాయాలకు తోడ్పాటు పొందేవిధంగా ప్రభుత్వ పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి గుర్తించాలని నిపుణులు కోరుకుంటున్నారు.

ఆదాయానికి మించిన అప్పులు

ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి ఈ బడ్జెట్ తయారీ కత్తిమీద సాము చేసినట్లే ఉంటుందని చెప్పకతప్పదు. కొత్త పన్నులు వేయడం కానీ ఉన్న పన్నులు పెంచడంకానీ  ఒక కఠినమైన నిర్ణయమే అవుతుంది. ఎఫ్ఆర్ బీఎం నిబంధన ప్రకారం మన రాష్ట్ర ఆదాయానికి 25 శాతం కంటే అధికంగా అప్పులు చేయడానికి వీలు లేదు. కానీ ఇప్పటికే రాష్ట్ర ఆదాయంలో మితిమీరిన (28%) అప్పులు తెచ్చుకోవడం జరిగింది. అదనపు అప్పులు తేవడానికి కూడా కొత్త ప్రభుత్వానికి ఉన్న అవకాశం పరిమితమే. రాజకీయాలకతీతంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది. ఇక రాష్ట్ర విలువైన ఆస్తులను అమ్మడమే మిగిలి ఉంది. గత ప్రభుత్వం ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను  కారుచౌకగా అమ్మడం, అనేక సంవత్సరాల తరబడి లీజుకు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే.

- కూరపాటి వెంకట్ నారాయణ, రిటైర్డ్​ ప్రొఫెసర్,  కె.యూ