రాష్ట్రంలో పెద్ద పులులకు రక్షణ కరువు

రాష్ట్రంలో పెద్ద పులులకు రక్షణ కరువు

కరెంట్ షాక్, ఉచ్చులు పెట్టి చంపుతున్న వేటగాళ్లు 
ఉమ్మడి ఆదిలాబాద్ లో అడవుల చుట్టూ ఏర్పాటు  
ఒక్క మంచిర్యాల జిల్లాలోనే మూడేండ్లలో మూడు పులులు బలి 
మహారాష్ట్ర నుంచి వచ్చినయ్ వచ్చినట్టే మాయం  
ఏండ్లు గడుస్తున్నా మిస్సింగ్ టైగర్స్ జాడ కనిపెట్టని అధికారులు

మంచిర్యాల, వెలుగు : రాష్ర్టంలో పెద్ద పులులకు రక్షణ కరువైంది. వేటగాళ్లు అడవుల్లో కరెంట్ షాక్, ఉచ్చులు పెట్టి పులులను చంపుతున్నారు. వాటి గోర్లు, చర్మం ఒలిచి గుట్టుచప్పుడు కాకుండా అమ్ముకుంటున్నారు. పంపకాల్లో తేడాలు రావడంతోనో, గ్యాంగ్​ల మధ్య విభేదాలతోనో విషయం బయటకు వస్తే తప్ప.. ఫారెస్ట్​ ఆఫీసర్లు వాళ్లను పట్టుకోలేకపోతున్నారు. అడవుల్లో సీసీ కెమెరాలు పెట్టి, టైగర్ ​ట్రాకింగ్ ​ఫోర్స్​ను నియమించి పులులను రక్షిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ.. అవన్నీ ఉత్తమాటలే అవుతున్నాయి. 

మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు.. వచ్చినవి వచ్చినట్టే మాయమవుతున్నాయి. ఏండ్లు గడుస్తున్నా మిస్సింగ్ ​టైగర్స్ జాడను అధికారులు గుర్తించలేకపోతున్నారు. పులులు వచ్చిన కొత్తలో హడావుడి చేయడం, ఆ తర్వాత అవి తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయాయని చెప్పడం ఫారెస్ట్​ ఆఫీసర్లకు అలవాటుగా మారింది. కానీ మిస్ అయిన పులులు నిజంగా మహారాష్ట్రకు వెళ్లాయా? అసలు వాటికేమైంది? అనేది తెలుసుకోవడం లేదు. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 2016 నుంచి 2019 వరకు మూడేండ్లలో మూడు పులులను వేటగాళ్లు బలిగొన్నారు. వీటిలో ఒక పులిని చంపి పాతిపెట్టి నాలుగేండ్లయినా అటవీ అధికారులు పసిగట్టలేకపోయారు. ఈ మూడు ఇప్పటి వరకు బయటపడినవి మాత్రమే. ఇంకా బయటపడనివి ఎన్ని ఉన్నాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అడవుల్లో టైగర్ హంటింగ్ గ్యాంగ్​లు.. 

పెద్ద పులులకు ప్రధానంగా వేటగాళ్లతోనే ముప్పు పొంచి ఉంది. ఫారెస్ట్ ​ఆఫీసర్లు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రాష్ర్టవ్యాప్తంగా వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. అడవి పందులు, జింకలు, దుప్పులు, కొండగొర్రెలు లాంటి జంతువులను వేటాడడం కోసం అడవుల్లో కరెంట్​షాక్, ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. అడవుల్లో టైగర్ హంటింగ్ గ్యాంగ్​లు సైతం పులులను వేటాడుతున్నాయనే అనుమానాలున్నాయి. పులి చర్మం, గోళ్లకు రూ.లక్షల్లో రేటు పలుకుతుండడంతో కొన్ని గ్యాంగ్​లు ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. మన రాష్ట్రంలో కవ్వాల్, ఆమ్రాబాద్ రెండు టైగర్ జోన్లు ఉన్నాయి. అమ్రాబాద్​లో 16, కవ్వాల్​లో 14 పులులు ఉన్నట్టు ఫారెస్ట్ ​ఆఫీసర్లు చెబుతున్నారు. కవ్వాల్​కు పక్కనున్న మహారాష్ర్టలోని తిప్పేశ్వర్, తాడోబా టైగర్ జోన్ల నుంచి ఆహారం, ఆవాసాలు వెతుక్కుంటూ పులులు వలస వస్తున్నాయి. ఇవి కోర్ ఏరియాలో కాకుండా బఫర్ జోన్ లోని చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్​నగర్ ఫారెస్ట్​ డివిజన్ల పరిధిలో స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒక్కో పులి వేట కోసం రోజుకు సుమారు 30 కిలోమీటర్లు సంచరిస్తుంది. రోజుకు రెండుసార్లు నీళ్లు తాగుతుంది. ఈ క్రమంలో రైతులు పంటల రక్షణ కోసం ఏర్పాటు చేసే కరెంట్ తీగలు తగిలి కూడా కొన్ని చనిపోతున్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్లకు తెలిస్తే కేసులపాలు కావాల్సి వస్తుందనే భయంతో గుట్టుగా పాతిపెడుతున్నారనే వాదనలు ఉన్నాయి.

మరో రెండు పులులు కూడా..

మంచిర్యాల జిల్లాలో ఇంతకుముందు రెండు పులులను వేటగాళ్లు చంపారు. 2019 జనవరిలో జైపూర్ మండలం శివ్వారం మొసళ్ల అభయారణ్యం ప్రాంతంలో ఒక మగ పులి కరెంట్ షాక్​తో చనిపోయింది. బెంగాల్ రాయల్ టైగర్ జాతికి చెందిన ఈ పులి.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుంచి ఆదిలాబాద్, కవ్వాల్ మీదుగా మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది. చంద్రాపూర్​కు చెందిన ‘‘ఆపరేషన్ టైగర్ హంటింగ్ ఎండ్’’​ అనే ఎన్​జీవో ముసుగులో కొంతమంది పులిచర్మం, గోళ్ల దందా చేశారు. వాటాల్లో తేడాలు రావడంతో శివ్వారం దగ్గర పులిని చంపిన విషయం బయటపెట్టారు. అంతకుముందు 2016లో కోటపల్లి మండలం పిన్నారం అడవుల్లో మరో పులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి ప్రాణాలు విడిచింది. ఇక 2021 అక్టోబర్​లో ములుగు జిల్లా అడవుల్లో ఇంకో పెద్దపులి వేటగాళ్ల ఉచ్చులో చిక్కి ప్రాణాలు కోల్పోయింది. గత 40 ఏండ్లలో రాష్ర్టవ్యాప్తంగా సుమారు పది పులులు ఉచ్చుల్లో చిక్కడంతో పాటు అనుమానాస్పదంగా చనిపోయినట్టు సమాచారం.

మహారాష్ట్ర నుంచి వస్తున్న పులులు.. వచ్చినవి వచ్చినట్టే మాయమవుతున్నాయి. ఏండ్లు గడుస్తున్నా మిస్సింగ్ ​టైగర్స్ జాడను అధికారులు గుర్తించలేకపోతున్నారు. పులులు వచ్చిన కొత్తలో హడావుడి చేయడం, ఆ తర్వాత అవి తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయాయని చెప్పడం ఫారెస్ట్​ ఆఫీసర్లకు అలవాటుగా మారింది. కానీ మిస్ అయిన పులులు నిజంగా మహారాష్ట్రకు వెళ్లాయా? అసలు వాటికేమైంది? అనేది తెలుసుకోవడం లేదు. ఒక్క మంచిర్యాల జిల్లాలోనే 2016 నుంచి 2019 వరకు మూడేండ్లలో మూడు పులులను వేటగాళ్లు బలిగొన్నారు. వీటిలో ఒక పులిని చంపి పాతిపెట్టి నాలుగేండ్లయినా అటవీ అధికారులు పసిగట్టలేకపోయారు. ఈ మూడు ఇప్పటి వరకు బయటపడినవి మాత్రమే. ఇంకా బయటపడనివి ఎన్ని ఉన్నాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఆ పులులు ఏమైనట్టు?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంతతి పెరగడానికి కారణమైన ఫాల్గుణ దాదాపు నాలుగేండ్ల నుంచి జాడ లేదు. ఈ పులి 2016లో తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి వలస వచ్చి కాగజ్​నగర్​ అడవుల్లో ఆవాసం ఏర్పర్చుకుంది. రెండు ఈతల్లో తొమ్మిది కూనలకు జన్మనిచ్చింది. ఫాల్గుణ సంతానమైన కే4 చెన్నూర్ ​డివిజన్​లో సంచరిస్తూ రెండేండ్ల కింద అదృశ్యమైంది. ఇది రెండేండ్ల వయసులో వేటగాళ్ల ఉచ్చులో చిక్కి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ ఉచ్చు పొట్ట భాగానికి బిగుసుకుపోయింది. దాదాపు రెండేండ్ల పాటు ఉచ్చుతోనే తిరిగింది. కే4ను పట్టుకొని ఉచ్చును తొలగించడానికి ఫారెస్ట్​ అధికారులు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. మిగతా పులుల్లో కొన్ని తాడోబాకు తిరిగి వెళ్లాయని ఆఫీసర్లు చెప్తున్నా.. అవి వెళ్లాయో? ఇక్కడే మాయమయ్యాయో? తెలియదు. ఫాల్గుణ, కే4 జీవించి ఉన్నాయా? వేటగాళ్ల ఉచ్చులో చిక్కి ప్రాణాలు విడిచాయా? అనే విషయాన్ని ఇప్పటికీ అటవీశాఖ చెప్పడం లేదు. 

చంపిన నాలుగేండ్లకు వెలుగులోకి.. 

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని రంగంపేట అడవుల్లో కొంతమంది కరెంట్ షాక్​తో పులిని చంపిన సంగతి నాలుగేండ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. రంగం పేటకు చెందిన బాలచందర్ అంజి, లక్ష్మయ్యతో కలిసి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో కరెంట్ షాక్ పెట్టి పులిని చంపి గోర్లు తీసుకొని కళేబరాన్ని అదే ప్రాంతంలో పూడ్చిపెట్టారు.