
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ పరిభాష కూడా అభ్యంతరకరంగా ఉందనేది పరిశీలకుల భావన! అవి రాజకీయ ఆరోపణలైనా, వ్యక్తిగత విమర్శలైనా, సంస్థాగత వివరణలైనా... ముఖ్యమంత్రి స్థాయికి తగిన రీతిలో సాగితేనే హుందాగా ఉంటుందనేది రాజకీయ పరిభాష (పొలిటికల్ లాంగ్వేజ్) తెలిసిన వారి అభిప్రాయం.
తెలంగాణ ఉద్యోగుల నిరసనోద్యమ హెచ్చరికని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాష్ట్ర ఖజానా ఆర్థిక పరిస్థితిపై ఆయన వెల్లడించిన సమాచారం చర్చనీయాంశాలయ్యాయి. అలా మాట్లాడటం తప్పని విపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాల వారు విమర్శిస్తే, దాన్ని ముఖ్యమంత్రి ఆవేదనగా అర్థం చేసుకోవాలని ఆయన మంత్రివర్గ సహచరులు వివరణ ఇచ్చారు. ‘నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది’అనేది జగమెరిగిన సామెత. అందుకు విరుద్ధమైన పరిస్థితి ఏదీ రాజకీయాల్లో ఆహ్వానకరం కాదు.
‘ఖజానా ఖాళీ అయింది. అప్పులే కాదు ఎడాపెడా పెండింగ్ బకాయిలున్నాయి. రాబడికి, వ్యయానికి మధ్య స్పష్టమైన అంతరాలున్నాయి. మనకు ఎక్కడా అప్పు పుట్టడం లేదు, ఎక్కడికి వెళ్లినా చెప్పులు ఎత్తుకెళ్లే దొంగల్ని చూసినట్టు మనను చూస్తున్నారు... నన్ను నరికినా ఒక రూపాయి అదనంగా రాదు..’ అని సాక్షాత్తు ఒక రాష్ట్ర అధినేత ప్రకటిస్తే పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న!
ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా... అటువంటి మాటలు బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? రాష్ట్రాధినేత అయిన ముఖ్యమంత్రి తరచూ ఆ మాటలు అంటే విపక్ష పార్టీలకు చెందిన నేతలు విమర్శించినట్టు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలగడం, కొత్తగా ఎక్కడా అప్పుపుట్టకపోవడం వంటివి జరుగుతాయా? ఇప్పుడివన్నీ ప్రశ్నలే!
పాలన చేతగాకే ఇటువంటి మాటలు చెబుతున్నారని, వెంటనే తప్పుకోవాలనీ కొందరు డిమాండ్ చేశారు. ‘లక్ష కోట్ల వార్షిక బడ్జెట్ నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలకు ఎదగడాన్ని ‘దివాలా’గా ఎట్లా పరిగణిస్తారు’అని ఓ విపక్ష నాయకుడు విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్వీయ పన్నుల రూపంలో పదేళ్ల కింద 30 వేల కోట్ల రూపాయలు వచ్చేది, ఇప్పుడది 1.30 లక్షల కోట్లకు చేరితే రాబడి లేదన్నట్టు మాట్లాడటం ప్రజల్ని కించపరచడమేనని మరో నాయకుడన్నారు.
ఆర్థికాంశాల్లో వ్యవహారం ఒకింత గుట్టుగా- మరొకింత ఆర్బాటంగా ఉండాలంటారు. ఏసీలు, చక్కటి సోఫాలు, బల్లలు, కుర్చీలు, జిగేల్మనే లైట్లు అమర్చిన మంచి ఆఫీసులతో కళకళలాడుతూ ఫైనాన్స్, చిట్‌ఫండ్ కంపెనీలు, తాకట్టు సంస్థలు తమ నిర్వహణ గొప్పగా ఉన్నట్టు భావన కల్పించే హంగులు, ఆర్బాటాలు చేస్తుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో ప్రజలకు నమ్మకం కల్పించే ఎత్తుగడలవి.
ఇబ్బంది నిజమే!
ఆందోళనకరమైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇప్పటికిప్పుడు వచ్చిన పరిస్థితి కాదు. రాష్ట్రావతరణం నాటికి సర్ప్లస్ స్టేట్‌గా ఉన్న తెలంగాణ ఖజానాను, ఆర్థిక క్రమశిక్షణ లోపించిన గత పాలకులు ఖాళీ చేశారనేది ప్రస్తుత పాలకపక్ష అభియోగం. అంతేకాక లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి, మరిన్ని లక్షల కోట్ల రూపాయల మేరకు వివిధ సంస్థలకు, కాంట్రాక్టర్లకు, ఉద్యోగులకు బాకీపడి ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలోనే శ్వేతపత్రాల విడుదల ద్వారా వెల్లడి చేశారు.
రాష్ట్ర రాబడిలో మూడో వంతు పాత అప్పుల కిస్తీలు వడ్డీలకు, మరో మూడో వంతు ఉద్యోగుల జీతభత్యాలకు వ్యయమౌతోంది. మిగిలిన మూడో వంతు సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలకు ఖర్చవుతోంది. రాబడి పరిమితుల దృష్ట్యా ఇతరత్రా అనుకోని వ్యయాలు వచ్చిపడ్డపుడు ఈ మూడంశాల నిర్వహణ కష్టమౌతోంది.
సత్వర పరిష్కారాలు వెతకాలి
అప్పుల కిస్తీలు వడ్డీలు చెల్లించే క్రమంలో కొత్త అప్పులూ తప్పట్లేదు. రాష్ట్ర ఆర్థిక దుస్థితి వల్లనేమో బయట కొత్తగా అప్పు పుట్టడం దుర్భరంగా మారింది. రాష్ట్ర రాబడి వ్యయం మధ్య తీవ్ర వ్యత్యాసం నెలకొని ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన నిర్దిష్ట హామీల వల్లనో, రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని దృష్టిలో ఉంచుకొనో కొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వం భుజస్కంధాలపైనుంది. ఆర్థిక సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కే మార్గాల గురించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితి! జాప్యం చేయకుండా సత్వర పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిందే!
ఆయన మాటలు దీపదారి
తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు ప్రజలు చరమగీతం పాడి, 2023 ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టంగట్టిన కొత్తలో ప్రఖ్యాత ఆర్థికవేత్త, భారత రిజర్వుబ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ ఏదో కార్యక్రమంలో పాల్గనేందుకు తెలంగాణను సందర్శించారు. అప్పుడు ఆయనొక మాట అన్నారు. ‘ ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం మారింది, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామమే! కొత్త ప్రభుత్వం కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే మంచిది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చు’అని ఆయనన్నారు. నిర్దిష్టంగా కొత్త ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని చర్యల్ని ఆయన సూచించారు.
- 1) ప్రభుత్వ అన్ని విభాగాల్లో, ప్రాజెక్టుల్లో, కార్యక్రమాల్లో ఆర్థిక దుబారాను నియంత్రించాలి.
- 2) సంక్షేమ కార్యక్రమాలు, వాటి పరిధి, అమలు, లబ్ధిదారుల ఎంపిక స్క్రీనింగ్ వంటివి సమగ్రంగా జరిపించి, అవసరమైన మేర సంస్కరణలు తీసుకురావాలి.
- 3) రాష్ట్ర ప్రభుత్వం తన పన్నేతర రాబడిని పెంచుకోవాలి, అందుకు మార్గాల్ని అన్వేషించాలి.. వంటి సూచనలు రఘురామరాజన్ చేశారు. ఆయన సూచించిన మార్గంలో ఏ ప్రయత్నమూ జరగటం లేదు.
దుబారాలు ఆగుతున్నాయా?
దుబారాలు ఎక్కడా ఆగట్లేదు. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు కూడా కొందరు మంత్రులు హెలికాప్టర్లలో వెళుతున్నారు. ఒకప్పుడు మంత్రి, పీఏ, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఒకే కారులో వెళ్లేవారు. ఇప్పుడు ఒక్కో మంత్రి, ఇతర ముఖ్య ప్రొటోకాల్ నాయకులు ఎంత పెద్ద కాన్వాయ్‌లతో వెళుతుంటారో మనం చూస్తూనే ఉన్నాం. వేములవాడలో ముఖ్యమంత్రి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ‘విందు భోజనాని’కి రూ.32 లక్షల బిల్లు మీడియాలో సంచలనం రేపింది. ‘కాంగ్రెస్ అంటేనే ఖర్చు, దుబారా...’ అనే జనవాక్యాన్ని నిజం చేసేలా పాలనా వ్యవహారాలున్నాయి. కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో దుబారా మీద నియంత్రణ లేదు. దానికోసం ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆర్థిక నిపుణులంటున్నారు.
ఆర్థిక మేధోమథనం జరగాలి
ఇప్పుడు తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక విపత్కర పరిస్థితే 90వ దశకం ఆరంభంలో భారతదేశానికి తలెత్తింది. అపుడు, తెలుగువాడైన నాటి ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఆ సమస్య నుంచి గట్టెక్కడం ఎలా అని తీవ్రంగా యోచించారు. ప్రపంచ పరిణామాల దృష్ట్యా అనివార్యమవుతున్న సరళీకృత ఆర్థిక విధానాలకు ద్వారాలు తెరుస్తూనే ఆర్థిక ప్రగతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
అధ్వానంగా తయారైన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుకుగాను, అంతకు ముందు ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిని చేశారు. వాణిజ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్న మరో ఆర్థిక నిపుణుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియాను ఆర్థికశాఖ కార్యదర్శిని చేశారు. సదరు నిర్ణయాలు మంచి ఫలితాలనిచ్చాయి. వారి దూరదృష్టి, ఆలోచనల ఫలితంగా నాటి ఆర్థిక సంక్షోభం నుంచి దేశం క్రమంగా కోలుకుంది.
నిపుణుడైన ఆర్థిక సలహాదారు అవసరం
కారణాలేవైనా, కారకులెవరైనా.. తెలంగాణ ఇప్పుడు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం కూడా సామాన్యమైంది కాదు. ఆర్థికరంగంపై అవగాహన, నైపుణ్యంతో కూడిన నిపుణుల ప్రత్యేక ఆలోచనలు, మేధోమథనం ఏదైనా పరిష్కారం కనుగొనవచ్చు. అది కూడా ఆచరణాత్మకమైన తక్షణ, దీర్ఘకాలిక ప్రయోజనాలను వారు సూచించగలగాలి. సదరు సూచనల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపించాల్సి ఉంటుంది. దూరదృష్టి, వాస్తవిక దృక్పథం కలిగిన నిపుణుడెవరినైనా రాష్ట్ర ఆర్థిక సలహాదారుగా నియమించుకోవచ్చు. అదేవిధంగా, రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, సమస్యలు, మూలకారణాలు, పరిష్కారాల గురించి లోతుగా అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు ఒక ‘ఆర్థిక నిపుణుల కమిటీ’ని నియమించుకుంటే ఏదైనా దారి దొరకొచ్చు!
- ఆర్. దిలీప్ రెడ్డి,సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్-