
భూభారతి 2025 చట్టంపై ఆదివాసులు అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. భూ భారతి చట్టం సెక్షన్ 5, రూల్ 5 ప్రకారం కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, పంపకాల ద్వారా వ్యవసాయ భూములు సంక్రమిస్తే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయడం, సెక్షన్ 6, రూల్ 6 ప్రకారం సాదాబైనామా, భూముల క్రమబద్ధీకరణ, వారసత్వంగా వచ్చిన భూములు సెక్షన్ 7, రూల్ 7 ప్రకారం మ్యుటేషన్, సివిల్ లేదా రెవెన్యూ కోర్టు తీర్పులు ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి సెక్షన్ 8, రూల్ 8 ప్రకారం మ్యుటేషన్, సెక్షన్ 4 సబ్ సెక్షన్ 3 ప్రకారం భూముల రికార్డుల తయారీ నిర్వహణ ఎలక్ట్రానిక్ పద్ధతిలో భూ భారతి పోర్టల్లో అందుబాటులో ఉంటాయని తెలపడం జరిగింది.
ఏజెన్సీ ప్రాంత భూములను భూ బదలాయింపు నిబంధనలు (ఎల్ టిఆర్) 1959, 1/70 చట్టానికి లోబడి కేఎల్ ఫారం ఏజెంట్
టు ది గవర్నమెంట్ (జిల్లా కలెక్టర్) డిక్లరేషన్ ఇచ్చాక... గిరిజనుల నుంచి గిరిజనులకు, గిరిజనేతరుల నుంచి గిరిజనులకు హక్కుల బదలాయింపు జరిగేలా పోర్టల్ నిర్వహణ జరగాలి. ఇలా ఎల్ టిఆర్ ఉల్లంఘన జరగకుండా ప్రభుత్వం పార్ట్-సీ కాలమ్ ఏర్పాటు చేయాలి.
భూ యాజమాన్య హక్కు వివాదం తలెత్తినప్పుడు పరిష్కారం కోసం సెక్షన్ 18 ప్రకారం సివిల్ కోర్టులకు జ్యురిస్డిక్షన్ ఉంటుందని భూభారతి చట్టంలో పేర్కొన్నారు. వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతంలో భూ వివాదాల పరిష్కారం కోసం షెడ్యూల్ జిల్లాల చట్టం - 1874 సెక్షన్ 6 ప్రకారం ఏజెన్సీ రూల్స్ 1924 ని రూపొందించారు.
ఈ నియమాల ప్రకారం సివిల్ వివాదాల పరిష్కారం ఏజెంట్ టు ది గవర్నమెంట్ (జిల్లా కలెక్టర్), ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్, ఏజెన్సీ మున్సిఫ్ ఆధ్వర్యంలో భూ బదలాయింపు నిబంధనలు 1959 సెక్షన్ 4 ప్రకారం ఎల్ టి ఆర్ / ఏజెన్సీ కోర్టులు పనిచేస్తున్నాయి. ఈ కోర్టులలో కేసుల మూలంగా 31,555 ఎకరాల భూమి ధరణి పార్ట్–బీలో చేరిందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఏజెన్సీ రూల్స్ 1924 - రూల్ 11 (2) ప్రకారం అడిషనల్ ఏజెంట్ టు ది గవర్నమెంట్ (ఐటిడిఎ పిఒ)కు అధికారాలు లేవంటూ జస్టిస్ కాజా శరత్ సిఆర్ పి నెంబర్ 1959/ 2024 చౌహాన్ ప్రకాష్ వర్సెస్ అల్లంపల్లి సురేందర్ రెడ్డి, ఇతరుల కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఏజెన్సీ రూల్స్ సవరణ చేస్తూ ఐటిడిఎ పిఓకి అధికారాలు కల్పించాలి. రెవెన్యూ, సివిల్ కోర్టులు నడిచినట్లుగానే ఏజెన్సీ కోర్టులు నడుస్తాయా? అనే ప్రశ్న ఆదివాసులను వెంటాడుతోంది.
అటవీ భూభాగంలో ఏజెన్సీ ప్రాంతం
ఏజెన్సీ ప్రాంతంలో గత ప్రభుత్వాలు రెవెన్యూ, అసైన్మెంట్ పట్టాలు ఇవ్వటం జరిగింది. రెవెన్యూ అటవీ వివాదం వలన 21, 673 ఎకరాలు భూమి ధరణి లో పార్ట్– బీలో నమోదు కావడంతో ఈ సమస్య ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంలో ఉండటం వలన ఈ రైతులు ప్రభుత్వ లబ్ధికి దూరంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం రెవెన్యూ, అటవీ శాఖలతో జాయింట్ సర్వే నిర్వహించి ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుందా? పోడు భూములు సాగు చేసుకుంటున్న పోడు సాగుదారులకి అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం హక్కు పత్రాలు జారీ చేయడం జరిగింది. ఈ భూములు అమ్మకాలు, కొనుగోలు లేని వారసత్వంగా అనుభవించే భూములు. కానీ, ఈ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. అటవీ హక్కు పత్రాలు వచ్చిన పోడు భూముల వివరాలు, భూ యాజమాన్యుల వివరాలు భూభారతి పోర్టల్ ప్రత్యేక కాలమ్లో నమోదు చేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలి.
వాస్తవ హక్కుదారులను గుర్తించాలి
గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో -1971 చట్టాన్ని రద్దుచేసి ఆర్ ఓఆర్ 20-20 చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో వలస గిరిజనేతరులు సెటిల్మెంట్ పట్టాల పేరుతో తప్పుడు రికార్డులతో ప్రభుత్వ భూములను, గిరిజన భూములను తమ పేరు మీద నమోదు చేసుకొని ధరణి రికార్డులోకి ఎక్కటంతో వాస్తవ హక్కుదారులుగా చలామణి అవుతున్నారు. గిరిజనులకు భూములు, భూ చట్టాలు, భూ రికార్డులపై క్షేత్రస్థాయిలో అవగాహన లేకపోవడంతో తాతల తండ్రుల పేర్ల మీద, వలస గిరిజనేతరుల పేర్ల మీద భూ రికార్డులు ఉండటంతో ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాల లబ్ధికి దూరమై తాత్కాలిక సాగుదారులుగా కొనసాగుతున్నారు.
ఈ ధరణి రికార్డునే భూ భారతిలో సెక్షన్ - 4 (4) కొనసాగించడం జరుగుతుంది. ఏజెన్సీలో క్షేత్రస్థాయి పరిశీలన, అవగాహన కల్పించి వాస్తవ హక్కుదారులు గుర్తించాలి. తెల్ల కాగితాలు, స్టాంప్ పేపర్ల ద్వారా అమ్మకాలు కొనుగోలు జరిగిన భూముల క్రమబద్ధీకరణ కోసం సెక్షన్ - 5 (ఏ) ని 1989లో చేర్చి అప్పటినుంచి భూభారతి చట్టంలో పేర్కొనట్లుగా 10 నవంబర్ 2020 వరకు అనేక దఫాలుగా సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణ జరుగుతూ వస్తుంది. దీనివలన అసలు గిరిజనుల స్థానంలో వలస గిరిజనేతరులు రికార్డులలోకి చేరి ఏజెన్సీ భూ బదలాయింపు నిబంధనలు 1959, 1/70 చట్టాన్ని తుంగలోకి తొక్కుతున్నారు. ఈ పక్రియ ఎల్టిఆర్ 1959 1/70 చట్టానికి లోబడి అమలుచేయాలి.
- వాసం ఆనంద్ కుమార్,ఆదివాసీ అడ్వకేట్స్ అసోసియేషన్–