హైదరాబాద్లో ఏఐ గ్లోబల్ సమిట్

హైదరాబాద్లో ఏఐ గ్లోబల్ సమిట్
  • ఈ నెల 22, 23న జూబ్లీ కన్వెన్షన్ సెంటర్​లో నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లో మరో గ్లోబల్ సమిట్ జరగనుంది. ఈ నెల 22, 23 తేదీల్లో కామన్ వెల్త్ ఏఐ గ్లోబల్ సమిట్-2025ను నిర్వహించనున్నారు. ఈ సమిట్ నిర్వహణకు సంబంధించిన అంశాలను ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ప్రభు కుమార్ తో కలిసి ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తన కార్యాలయంలో శుక్రవారం మీడియాకు వివరించారు.

 ‘‘ప్రోత్సహించండి- విద్యను.. అందించండి -సాధికారతను’’ అనే థీమ్ తో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా 2,500 మంది ప్రతినిధులు, నిపుణులు హాజరవుతారని వెల్లడించారు. కామన్ వెల్త్ దేశాలు, ఇతర ప్రపంచ భాగస్వాములకు ప్రాతినిధ్యం వహిస్తున్న 50 కంటే ఎక్కువ దేశాల నుంచి ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. 

కామన్ వెల్త్ మెడికల్ అసోసియేషన్(సీఎంఏ), రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో, యూకే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఆర్గనైజింగ్ చైర్మన్, కన్వీనర్ డాక్టర్ ప్రభు కుమార్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో తొలిసారిగా రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో ద్వారా కామన్ వెల్త్ ఏఐ, డిజిటల్ హెల్త్ కార్ట్ లో ఫెలోషిప్ సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. 

అనంతరం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వీసీ నంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు హాజరవుతారని తెలిపారు. ఇతర వివరాలకు 9989220003, 9849137420 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.