ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌దే విజయం

ఎగ్జిట్ పోల్స్: ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌దే విజయం

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దుమ్మురేపనుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఢిల్లీ వీధులను చీపురు పార్టీ మరోసారి ఊడ్చేసిందని వెల్లడించాయి. కేజ్రీవాల్ పనితీరుకు ప్రజలు మళ్లీ ఆప్ వైపే మొగ్గుచూపినట్టు తెలిపాయి.  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు హోరాహోరీగా ప్రచారం చేసినా ప్రజలను ఆకట్టుకోలేకపోయినట్టు తెలుస్తోంది.  ఏ పార్టీ అయినా మ్యాజిక్ నెంబర్ 126 సీట్లు సాధిస్తే విజయం సాధించినట్టే. కేజ్రీవాల్ సర్కార్ MCDపై జెండా ఎగురవేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 

Aaj Tak-Axis My India

ఆజ్ తక్ యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆమ్ ఆద్మీ 149 నుంచి-171 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. బీజేపీకి 69 నుంచి 91 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. 

Times Now-ETG 

టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం ఆప్‌ 149 నుంచి 171 స్థానాల్లో విజయఢంకా మోగిస్తుంది. ఇక బీజేపీ సెకండ్ ప్లేస్ లో ఉంటుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేక చతికిలపడినట్టు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 

News X-Jan Ki Baat

న్యూస్ ఎక్స్ జాన్ కి బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ హవా కొనసాగనుందని తెలిపింది. కేజ్రీవాల్ పార్టీకి 159 నుంచి 175 సీట్లు గెల్చుకుంటుందని చెప్పింది. సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉంటుందని..అది 70 నుంచి 91 సీట్లలో గెలిచే అవకాశం ఉందని తెలిపింది. 

అయితే 15 ఏండ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ని పాలిస్తున్న బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. అందుకు బీజేపీ అగ్రనేతల్ని ప్రచారానికి దింపింది. తుది ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్ రిపోర్ట్‌ తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. గెలుపు ఎవరిని వరిస్తుందో ఈ నెల 7న వచ్చే ఫలితాల్లో తేలనుంది. 

ఈ నెల 4వ తేదీన జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 250 వార్డుల్లో 1,349 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో 709 మంది మహిళలున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు ఈసీ అధికారులు 13,638 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం ఓటర్లు 1.45 కోట్ల మంది. ఈస్ట్, సౌత్, నార్త్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒక్క మున్సిపల్ కార్పొరేషన్‌గా (ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్) మార్చాక జరిగిన తొలి ఎన్నికలివి. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 40 వేల మంది పోలీసులు, 20 వేల మంది హోం గార్డులు, 108 కంపెనీల పారామిలిటరీ, రాష్ట్రాల పోలీస్ బలగాలు రక్షణ బాధ్యతల్లో నిర్వహించారు.