
బిగ్‌బాస్ 9వ సీజన్‌లోకి ప్రవేశించే సామాన్యుల కోసం జరుగుతున్న 'బిగ్‌బాస్ అగ్నిపరీక్ష'లో ఉత్కంఠత పెరిగిపోతోంది. టాప్ 15 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసిన తర్వాత, వారి మధ్య మరింత తీవ్రమైన పోటీ మొదలైంది. వీరిలో కేవలం ఐదు మాత్రమే బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మరి ఈ ఎపిసోడ్‌లో జరిగిన ఆసక్తికరమైన సంఘటనలు, టాస్కుల గురించి తెలుసుకుందాం..
టాప్ 15 కంటెస్టెంట్లు వీరే..
'అగ్నిపరీక్ష'లో టాప్ 15కు చేరుకున్న కంటెస్టెంట్లు ప్రకటించారు. వారిలో మర్యాద మనీష్, ప్రియా శెట్టి, అనూష రత్నం,హరిత హరీశ్ (మాస్క్ మ్యాన్), ప్రసన్న కుమార్, దమ్ము శ్రీజ, సైనికుడు పవన్ పడాల, దాలియా, కల్కి. షాకిబ్, శ్వేతా శెట్టి, నాగ ప్రశాంత్, దివ్య వేలమురి, శ్రేయ , డిమాన్ పవన్ ఉన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున ఒక వీడియో సందేశం పంపడంతో కంటెస్టెంట్లు ఆనందంలో మునిగిపోయారు. టాప్ 15లో నిలిచిన వీరందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇక మాస్క్ మ్యాన్‌కు ఇంతకు ముందు పెట్టిన 'అరగుండు' కండిషన్‌ను కూడా తీసేశారు. జడ్జీ బిందుమాధవి స్వయంగా అతడికి గుండు గీసింది.
ర్యాంకుల కోసం కంటెస్టెంట్ల మధ్య గొడవలు
బిగ్‌బాస్ టాస్క్‌లలో భాగంగా కంటెస్టెంట్లకు 1 నుంచి 15 వరకు స్టాండ్స్ ఇచ్చి, వారి అర్హత ప్రకారం వాటిలో నిలబడమని కోరారు. దీంతో మొదటి మూడు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. 'నీకంటే నాకే అర్హత ఉంది', 'నువ్వు ఎమోషనల్‌గా వీక్' అంటూ కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాదించుకున్నారు. ఈ వాదనల మధ్య మనీష్ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తొలుత ఫోన్ చేసి డబ్బులు వేయించుకునే టాస్క్‌లో కల్కి తన మామని ముందుగానే సిద్ధం చేసుకోమని చెప్పిందని ఆరోపించాడు. దీంతో కల్కి దానిని పూర్తిగా ఖండించకపోవడంతో ఆమె ఆరోపణను అంగీకరించినట్లుగానే కనిపించింది.
టాస్క్‌లో ట్విస్టులు, సంచాలక్‌పై ఆరోపణలు
ఈ గేమ్‌లో మొదటి ఆరు స్థానాల్లో ఉన్న కంటెస్టెంట్లను రెడ్ టీమ్‌గా, తర్వాతి ఆరు స్థానాల్లో ఉన్నవారిని బ్లూ టీమ్‌గా విభజించారు. 15వ స్థానంలో ఉన్న దాలియాను సంచాలక్‌గా నియమించారు. టాస్క్ జరుగుతుండగా, సంచాలక్ దాలియా పక్షపాతంగా వ్యవహరించిందని, ప్రసన్న కుమార్‌ను అన్యాయంగా ఎలిమినేట్ చేసిందని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ అనూహ్య ఘటనతో గేమ్ మొత్తం మారిపోయింది. బ్లూ టీమ్ ఈ గేమ్‌లో విజయం సాధించి, ఒకరిని ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం పొందింది. టీమ్ లీడర్ ప్రియ చివరి వరకు పోరాడిన పవన్ పడాలను ఎంచుకుంది. దీంతో అతడు ప్రేక్షకులను ఓట్లు అడిగాడు.
వరస్ట్ ప్లేయర్ గా కల్కి ఎంపిక
జడ్జ్ బిందుమాధవి వరస్ట్ ప్లేయర్ గా కల్కిని ఎంపిక చేయగా, వాల్యుబుల్ ప్లేయర్ గా దమ్ము శ్రీజను ప్రకటించింది. శ్రీజ స్టేజిపైకి వచ్చి నా మాటల్లోనే కాదు, చేతల్లో కూడా దమ్ముంది. నా వాయిస్ చిరాకుగా ఉన్నా ఆట మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నాకు ఒక్క ఛాన్సిస్తే లేడీ విన్నర్ అయి చూపిస్తా" అని ప్రేక్షకులను అభ్యర్థించింది. ఆమె చురుకుదనం చూసిన అభిజిత్ నేను ఒకప్పుడు నిన్ను షోలో ఉండొద్దని రెడ్ కార్డ్ చూపించాను, కానీ ఇప్పుడు నా మనసు మారింది అని చెప్పాడు. చివరకు వీరిలో బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లబోయేది ఎవరు, ఈ టాస్క్‌లలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.