2022లో ప్రపంచవ్యాప్తంగా కీలక ఘట్టాలివే..

2022లో ప్రపంచవ్యాప్తంగా కీలక ఘట్టాలివే..

కొవిడ్ మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు ప్రపంచమంతా ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆ తర్వాత ఎన్నో ఆశలతో, ఆశయాలతో ప్రారంభమైన 2022లో క్రీడలు, పబ్లిక్ ఈవెంట్‌లు స్పెషల్ అండ్ సెంటర్‌స్టేజ్‌గా నిలిచాయి. దాంతో పాటు కరోనాతో తీవ్ర నష్టాల పాలైన పర్యాటకరంగం మళ్లీ ఊపందుకుంది. కానీ ఈ ఏడాది కూడా కొన్ని కష్టాలు మాత్రం తప్పలేదు. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ శాంతిని దెబ్బతీయగా.. ప్రపంచ ద్రవ్యోల్బణం కుటుంబ బడ్జెట్‌ పై తీవ్ర ప్రభావం చూపింది. దాంతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా ఓ సవాలుగా మారాయి. ఫైనల్ గా 2022 ముగిసే సమయానికి చైనాలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగి.. మునుపటి జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది. 

ఉక్రెయిన్ యుద్ధం: ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్  తమ దేశం రష్యాకు వ్యతిరేకమని ఆరోపించడంతో .. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేసింది. ఈ ఘటనలో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లోని సైనిక, నావీ, ఎయిర్ ఫోర్స్ స్థావరాలపై రష్యా మెరుపు దాడులు కూడా చేస్తూ తన పంథాను నెగ్గుకొస్తోంది.ఈ యుద్ధం ప్రారంభమై300 రోజులు అవుతున్నా.. ఇంకా కొనసాగుతూనే ఉండడం గమనార్హం.

ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతి: ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని పదవి నుండి తొలగించబడ్డాడు. అవిశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన మొదటి ప్రధానమంత్రిగా ఇమ్రాన్ మిగిలాడు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయడానికి ఖాన్ చేసిన ప్రయత్నంతో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుంది. దీంతో ఈ ఓటు చాలా నాటకీయంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ తర్వాత పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టారు.

శ్రీలంక ఆర్థిక సంక్షోభం : ద్వీప దేశం చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఆ దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. నిరసనలు చేపట్టారు. అవి మార్చి చివరిలో తీవ్రమయ్యాయి. ఆ తర్వాత మేలో మహీంద రాజపక్స ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించిన గొటబాయ రాజపక్సేపై వ్యతిరేకత పెరగడంతో దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. చివరికి అతను పదవి నుంచి నిష్క్రమించవలసి వచ్చింది. దీంతో పదవిలో ఉండగానే మధ్యంతర కాలంలోనే  ఇలా చేసిన మొదటి లంక అధ్యక్షుడయ్యాడు. రాజపక్సే మిగిలిన పదవీకాలానికి రణిల్ విక్రమ సింఘేను ఆ దేశ అధ్యక్షుడిగా లంక పార్లమెంటు ఎన్నుకుంది.

షింజో అబే హత్య : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే జూలై 8న ఓ రాజకీయ సభలో ప్రసంగిస్తుండగా హత్యకు గురయ్యారు. అనంతరం అబేను లక్ష్యంగా చేసుకొనే ఆయన్ను హత్య చేయాలనుకున్నానని నిందితుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

ప్రెసిడెంట్ గా ద్రౌపది ముర్ము : ద్రౌపది ముర్ము భారతదేశ 15వ రాష్ట్రపతిగా జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు, అత్యున్నత రాజ్యాంగ పదవిని కలిగి ఉన్న దేశంలోని మొదటి గిరిజన మహిళా ఆమె పేరు తెచ్చుకున్నారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండో మహిళ కూడా కావడం విశేషం. మాజీ ఉపాధ్యాయురాలు, అధ్యక్షురాలు ముర్ము గతంలో జార్ఖండ్ గవర్నర్‌గా, ఆమె సొంత రాష్ట్రమైన ఒడిశాలో మంత్రిగా పనిచేశారు.

యూరోపియన్ హీట్‌వేవ్ : మునుపెన్నడూ లేని విధంగా ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, యూకేలలో 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. యూరప్ అంతటా వేడిగాలులు వీచాయి. ఇది ప్రజలకు ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన కరువుకు దారితీసింది. వాతావరణంలో మార్పు లేకుండా ఇటువంటి ఉష్ణోగ్రతలు నమోదు కావడం వాస్తవంగా అసాధ్యమని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. 

సల్మాన్ రష్దీపై దాడి :  రచయిత సల్మాన్ రష్దీ ఆగస్టు 12న న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దాడికి గురయ్యాడు. దాడి చేసిన వ్యక్తి అతని మెడ, పొత్తికడుపుపై కత్తితో పొడిచాడు. రష్దీపై దాడి చేసిన వ్యక్తిని న్యూజెర్సీకి చెందిన 24ఏళ్ల హదీ మటర్ గా పోలీసులు గుర్తించారు.

క్వీన్ ఎలిజబెత్ మరణం : క్వీన్ ఎలిజబెత్ II సెప్టెంబర్ 8న మరణించారు. సుదీర్ఘ పాలన చేసిన బ్రిటీష్ రాణిగా పేరు తెచ్చుకున్న ఆమె వయసు చనిపోయేనాటికి క్వీన్ వయస్సు 96 ఏళ్లు. క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఆమె 74 ఏళ్ల కుమారుడు చార్లెస్ రాజుగా బాధ్యతలు చేపట్టారు.

మూడోసారి అధ్యక్షుడుగా జిన్ పింగ్ : చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ అక్టోబర్‌లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మూడవసారి బాధ్యతలు స్వీకరించారు, పీపుల్స్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత జిన్ పింగ్ ఈ రికార్డు సృష్టించిన రెండవ నాయకుడిగా నిలిచాడు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్ పింగ్ కు అధికారంపై ఉన్న తన పట్టును సుస్థిరం చేసింది. అనంతరం కొత్త పాలకమండలిని ప్రవేశపెట్టాడు.

యూకే ప్రధానమంత్రిగా రిషి సునక్ : అక్టోబర్ 25న రిషి సునక్ అత్యున్నత పదవి రేసులో లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయిన ఆరు వారాల తర్వాత, భారత్ కు చెందిన రిషి సునక్.. బ్రిటన్ మొదటి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బోరిస్ జాన్సన్ రాజీనామాతో ప్రధానమంత్రి పదవి చేపట్టిన లిజ్ ట్రస్ 45 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఎలోన్ మస్క్ ట్విట్టర్ టేకోవర్ : టెస్లా CEO, బిలియనీర్ ఎలోన్ మస్క్ కొన్ని నెలల నాటకీయ పరిణామాల తర్వాత అక్టోబర్‌లో మైక్రోబ్లాగింగ్ సైట్‌ను కొనుగోలు చేశారు. ట్విట్టర్​ను సొంతం చేసుకున్న కొద్ది గంటల్లోనే.. సీఈఓ పరాగ్​ అగర్వాల్​ను మస్క్​ తొలగించారు. అనంతరం పలు మార్పులు చేస్తూ ఇప్పటికీ మస్క్.. యూజర్లను సర్ ప్రైజ్ తో పాటు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు.

గుజరాత్ వంతెన విషాదం : అక్టోబర్ 30న మచ్చు నదిపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి కూలిపోవడంతో 50 మంది చిన్నారులతో సహా దాదాపు135 మంది చనిపోయారు. 143 ఏళ్ల నాటి ఈ వంతెన మరమ్మతుల కోసం చాలా కాలం మూసివేశారు. ఓపెన్ చేసిన 4,5 రోజుల్లోనే ఈ ప్రమాదం జరగడంపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ వంతెన నిర్వహణలో భారీ లోపాలన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా ఈ ఘటనకు కారకులైన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇరాన్ లో నిరసనలు :  హిజాబ్ దుస్తుల కోడ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో విస్తృతంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆర్థిక సంక్షోభం, వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకంగా సెప్టెంబరులో ప్రారంభమైన ఈ నిరసనల్లో22 ఏళ్ల మహ్సా అమిని హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదనే ఆరోపణలతో అరెస్టు చేశారు. ఆ తర్వాత అమిని కస్టడీలోనే మరణించడంతో పరిస్థితి మరింత  తీవ్రమైంది. ఆమె గుండెపోటుతో మరణించిందని ప్రభుత్వ అధికారులు పేర్కొంటుండగా..  హింసించడంతోనే ఆమె చనిపోయినట్టు అమ్ని కుటుంబం ఆరోపించింది. దీంతో ఆ దేశంలో మహిళలు భారీ నిరసనలు చేశారు. కొందరు మహిళలు హిజాబ్‌లను కాల్చడంతో పాటు తమ జుట్టును కూడా కత్తిరించుకున్నారు.

అర్జెంటీనా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది : నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. ఫ్రాన్స్‌పై 4-2 తేడాతో గెలుపొంది విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ సహా ఈ వరల్డ్ కప్‌లో అర్జెంటీనా విజయాల్లో కీలక పాత్ర పోషించిన మెస్సీ పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. ఈ విజయంతో అర్జెంటీనా 1986 తర్వాత తొలిసారిగా తన మూడవ ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. 26ఏళ్ల తర్వాత మళ్లీ ఆ దేశం ఈ ఘనత సాధించడం విశేషం.

చైనాలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు : సంవత్సరం ముగుస్తున్న ఆనందంలో అందరూ ఉండగా..  చైనాలో కొవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నట్లు నివేదిక వెలువడుతున్నాయి. భారతదేశంలో ఈ మహమ్మారి కలిగించిన విధ్వంసం మిగిల్చిన భయంకరమైన జ్ఞాపకాలు మర్చిపోకముందే మళ్లీ ఇలాంటి వార్తలు వస్తుండడంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది. మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.