కట్నం తీసుకొని పరారైన వరుడు.. ఛేజ్ చేసి మరీ మనువాడింది

కట్నం తీసుకొని పరారైన వరుడు.. ఛేజ్ చేసి మరీ మనువాడింది

ప్రజెంట్ డేస్ లో పెళ్లి అనేది కొన్నిసార్లు ఓ డ్రామాగా మారిపోయింది. కాసేపట్లో తాళి కడతారన్న నిమిషంలోనూ ఆగిపోతున్న పెళ్లిళ్లు ఎన్నో చూస్తూనే ఉన్నాం. పెళ్లి జరుగుతుండగా ఆగిపోయిన పెళ్లిళ్లూ చూశాం. కొన్ని సార్లు పెళ్లి డేట్ దగ్గర పడేసరికి పెళ్లి కూతురో, పెళ్లి కొడుకో పారిపోవడం కూడా చూశాం. ఆ తర్వాతేముంది.. అంతా బాధపడడం.. అవన్నీ తెలిసిన విషయాలే. కానీ బిహార్ లో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు విరుద్ధం. కట్న, కానుకలు తీసుకున్న తర్వాత పెళ్లి వద్దని పరారైన ఓ వరుడిని వధువు వెంబడించి మరీ పట్టుకొని, పెళ్లి చేసుకుంది. ఈ ఘటన బిహార్ లోని భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో జరిగింది.

ఇక వివరాల్లోకి వెళితే.. వీరిద్దరికీ మూడు నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో వరుడికి కట్నం పేరుతో రూ.50 వేలు, ఓ బైక్ ను పెళ్లి కూతురు తరపు వాళ్లు సమర్పించుకున్నారు. అయితే పెళ్లి ముహూర్తానికి వచ్చేసరికి మాత్రం పెళ్లి కొడుకు ఏవో కారణాలు చెప్తూ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో విషయంపై ఆరా తీసేందుకు పెళ్లి కూతురి తరపు బంధువులు వరుడి ఇంటికి వెళ్లగా ఆ యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ వధువు అతన్ని వెంబడించింది. ఛేజింగ్ చేసి మరీ ఆ యువకున్ని పట్టుకుంది. తనను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని కోరింది. అయినా ఆ వరుడు ఒప్పుకోకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారివురికి కౌన్సిలింగ్ ఇప్పించారు. ఫైనల్ గా ఆ యువకుడు పెళ్లికి అంగీకరించడంతో సమీపంలోని ఓ గుడిలో కుటుంబసభ్యులు వివాహం జరిపించారు.