
న్యూఢిల్లీ/పాట్నా: వచ్చే ఏడాది జరగనున్న జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీకి ఓటమి తప్పదని బీహార్ సీఎం నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. బీహార్ లో ఆ పార్టీ కనుమరుగు అవుతుందని తేల్చి చెప్పారు. ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో బీజేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందన్నారు. శుక్రవారం నితీశ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యతతో బీజేపీ ఇబ్బంది పడుతోందన్నారు. దేశాభివృద్ధి కోసమే ప్రతిపక్షాలు చేతులు కలిపాయని అన్నారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన నితీశ్ కుమార్.. ఈ అంశాన్ని హైలైట్ చేయడం ద్వారా ప్రతిపక్షం తన పనిని సమర్థంగా నిర్వర్తించిందన్నారు.