తప్ప తాగి.. తన పెళ్లినే మర్చిపోయాడు..

తప్ప తాగి.. తన పెళ్లినే మర్చిపోయాడు..

మరికొన్ని గంటల్లో పెళ్లి.. ఈ ఆనందంలో ఫుల్ గా మందుకొట్టాడు.. కడుపులోకి వెళ్లిన మందు ఊరకే ఉంటుందా.. చక్కగా నిద్రపుచ్చింది. తీరా లేచిన తర్వాత తెల్లారిపోయింది.. అప్పుడు హడావిడిగా పెళ్లింటికి పరిగెత్తాడు.. ఇంకెక్కడి పెళ్లి.. అమ్మాయి తరపు వాళ్లందరూ కలిసి పెళ్లి చేసి పంపించారు. ఈ ఘటన నమ్మటానికి వింతగా అనిపించినా.. బీహార్ రాష్ట్రం భాగల్ పూర్ లోని సుల్తాన్ గంజ్ గ్రామంలో నిజంగా జరిగింది. వివరాల్లోకి వెళితే..

సుల్తాన్ గంజ్ గ్రామానికి చెందిన వ్యక్తికి.. నిరుపేద అయిన ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. మార్చి 16వ తేదీ పెళ్లి వేడుకను.. అమ్మాయి ఇంట్లో పెట్టుకున్నారు. పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకు మందుకొట్టి పడిపోయాడు. నిద్ర లేచి చూసే సరికి మార్చి 17వ తేదీ శుక్రవారం అయ్యింది. వెంటనే పెళ్లికి అని తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మాయి ఇంటికి వచ్చాడు. బాధ్యత లేని ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోను అంటూ అమ్మాయి ముఖానే చెప్పింది. పెళ్లి కొడుకు బంధువులు సర్థిచెప్పినా వినలేదు. పెళ్లికే రాలేని వ్యక్తితో ఎలా పెళ్లి చేసుకుంటానంటూ అమ్మాయి తిరస్కరించింది. పెళ్లి కోసం గంటల తరబడి వేచి చూశామని.. ఫోన్లు చేసినా ఎవరూ స్పందించలేదంటూ అమ్మాయి తరపు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 అంతేనా.. పెళ్లి ఏర్పాట్లకు అయిన ఖర్చును ఇవ్వాలని అమ్మాయి తరపు వారు.. పెళ్లి కొడుకుతో సహా వారి బంధువులను నిర్బంధించారు. రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. విషయం పోలీసుల వరకు వెళ్లటంతో.. వాళ్లు మధ్యవర్తిగా సమస్యకు పరిష్కారం చూపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ కథనం.. అయితే వధూవరుల పేర్లు మాత్రం వెల్లడించలేదు అధికారులు. గోప్యంగా ఉంచారు. 

మొన్నటికి మొన్న ఒడిశాలో ఓ పెళ్లికొడుకు పీటలపైనే తాగి పడిపోయాడు.. తాళి కూడా కట్టలేకపోయాడు. ఆ పెళ్లి కూడా పెటాకులు అయ్యింది.. ఇప్పుడు బీహార్ లో.. ఏంటో వరసగా పెళ్లి కొడుకులు ఇలా తాగి పెళ్లి అనే సంగతే మర్చిపోతున్నారు.. మందు మాత్రం మర్చిపోవటం లేదే..