బాలుడ్ని చంపి తిన్న పులి.. స్పాట్ లోనే చంపిన ఊరి జనం

బాలుడ్ని చంపి తిన్న పులి.. స్పాట్ లోనే  చంపిన ఊరి జనం

బిజ్నోర్: నెల రోజుల వ్యవధిలో ఆరుగురు మనుషుల్ని పొట్టన పెట్టుకున్న ఓ చిరుతపులిని ఊరి జనం వెంటాడి కాల్చి చంపారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా భోగపూర్ గ్రామంలో జరిగింది. మనిషి రక్తం రుచి మరిగిన ఆ చిరుత గ్రామంలోని వ్యక్తులపై దాడి చేసి చంపి తింటోంది. నవంబర్ 27 నుండి నిన్న సోమవారం వరకూ ఆరుగురు వ్యక్తుల్ని చంపడంతో గ్రామస్తులు ఆగ్రహానికి గురై ఆ పులిని తుపాకీలతో కాల్చి మట్టు బెట్టారు.

వివరాల్లోకి వెళ్తే… బోగపూర్ కి చెందిన ప్రశాంత్ కుమార్ (14)  అనే బాలుడు అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. భోజనం కోసమని సోమవారం మధ్యాహ్నం ఆ బాలుడు ఇంటికి బయల్దేరాడు. అయితే మార్గమధ్యంలో ఉన్న చెరుకుతోటలో నుంచి ఆకస్మాత్తుగా చిరుతపులి అతని ఎదుటపడింది.  ఆ హఠాత్పరిణామానికి  భయకంపితుడైన బాలుడి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ పులి ఒక్క ఉదుటున బాలుడిపై దూకి, చెరుకు తోట లోకి తీసుకెళ్లి దాడి చేసి చంపింది. అదే మార్గంలో వస్తున్న కపిల్ కుమార్ అనే వ్యక్తి బాలుడిని రక్షించడానికి ప్రయత్నించాడు. కాని ప్రయోజనం లేకపోయింది.

బాలుడు మరణించిన సంగతి కపిల్ కుమార్ గ్రామస్తులకు తెలియజేయడంతో.. మరణించిన బాలుడి కుటుంబంతో సహా వందలాది మంది గ్రామస్తులు తమ తుపాకులను తీసుకొని చిరుతపులి దాక్కున్న చెరకు తోటకు వెళ్లారు. అప్పటికే బాలుడి చంపి తినేసిన ఆ పులిని అక్కడికక్కడే కాల్చి చంపారు.  బాలుడి మృతదేహంతో పాటు ఆ పులి కళేబరాన్ని గ్రామానికి తీసుకెళ్లారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న నజీబాబాద్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శుక్లా..  “ గ్రామస్తులపై  దాడి చేసి ఇప్పటివరకూ ఆరుగుర్ని చంపి తిన్న ఆ పులిని ఊరి జనమే చంపేశారు. చిరుత దాడిలో మృతి చెందిన ఆ బాలుడి కుటుంబానికి రూ .5 లక్షలు పరిహారంగా ఇస్తామని చెప్పారు. అటవీ అధికారుల ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు రిజస్టర్ చేశామని జిల్లా ఎస్పీ లక్ష్మి నివాస్ మిశ్రా చెప్పారు.