కారులో వచ్చి బైక్ స్పార్క్ ప్లగ్స్ చోరీ.. అర్ధరాత్రి దోచుకెళ్తున్న దుండగులు

కారులో వచ్చి బైక్ స్పార్క్ ప్లగ్స్ చోరీ.. అర్ధరాత్రి దోచుకెళ్తున్న దుండగులు

హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో కొత్త తరహా చోరీలు జరుగుతున్నాయి. దర్జాగా కారులో వస్తున్న దుండగులు ఆరుబయట పార్క్ చేసిన బైకుల స్పార్క్ ప్లగ్స్ దోచుకెళ్తున్నారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి హసన్ పర్తి పీఎస్ పరిధి దేవన్నపేటలో జరిగింది. బాధితులు తెలిపిన ప్రకారం.. మంగళవారం రాత్రి 11.25 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో దేవన్నపేటకు వచ్చారు.

రోడ్డు వెంట  మూడు బైకులు పార్క్ చేసి ఉండగా, కారులోంచి దిగిన ఓ యువకుడు వాటి స్పార్క్ ప్లగ్స్, క్యాప్స్ దొంగిలించాడు. అనంతరం  కారులో రింగ్ రోడ్డు వైపు వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవగా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, నిమిషాల వ్యవధిలోనే బైకుల స్పార్క్ ప్లగ్స్ ఎత్తుకెళ్లారని, గ్రామంలో నిఘా పెంచి చోరీలకు చెక్ పెట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.