
మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ (Smriti Irani) తిరిగి బుల్లితెరపై నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల క్రితం భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించిన సీరియల్ "క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ" (Kyunki Saas Bhi Kabhi Bahu Thi). ఇప్పుడు ఈ సీరియల్ సెకండ్ పార్ట్ ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ 2’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2) జులైలో స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఈ సీరియల్కి ఎప్పటిలాగే ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తుంది. టిఆర్పి చార్టులలో అగ్రస్థానంలో వెళ్తూ శభాష్ అనిపించుకుంటుంది. ప్రతి ఎపిసోడ్లో ఫేమస్ సెలబ్రిటీలను అతిథి పాత్రల్లో చూపిస్తూ మరింత ఆసక్తి పెంచుతూ వస్తున్నారు మేకర్స్. ఇపుడు మరో ప్రత్యేక అతిథి పాత్ర సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది.
ప్రముఖ నేషనల్ నివేదికల ప్రకారం, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కనిపించనున్నట్లు సమాచారం. బిల్‌గేట్స్ ఇందులో మూడు ఎపిసోడ్‌లలో అతిథిగా నటిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తులసి పాత్రలో నటిస్తున్న స్మృతి ఇరానీ (Smriti Irani) బిల్‌గేట్స్‌తో వీడియో కాల్‌లో మాట్లాడతారని టాక్ నడుస్తుంది. వీరి సంభాషణలో గర్భిణులు, శిశువుల ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలపై తులసి (స్మృతి ఇరానీ), బిల్‌గేట్స్‌తో చర్చించనున్నారట. ఈ మూడు ఎపిసోడ్‌ల ద్వారా ప్రజలకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన రానుంది.
ఇకపోతే, ఇటీవలే ఈ సీరియల్‌లో నటులు సాక్షి తన్వర్ మరియు కిరణ్ కర్మార్కర్, ఏక్తాకపూర్, అమర్ ఉపాధ్యాయ్ లు కనిపించారు. ఇపుడు ఏకంగా బిల్ గేట్స్ వస్తుండటంతో సీరియల్ మరింత ఆసక్తి కలిగించనుంది.
బిల్ గేట్స్ తోనే ఎందుకంటే?
బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఫౌండేషన్, ఇది 2000లో బిల్ గేట్స్ మరియు మెలిండా గేట్స్ స్థాపించారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం మరియు పేదరికాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందువల్ల.. గేట్స్ ఫౌండేషన్ ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయో ఈ ఎపిసోడ్స్ ద్వారా చెప్పనున్నారు. ఇలా బిల్ గేట్స్ వంటి దిగ్గజ దూరదృష్టి కలిగిన వ్యక్తి చెప్పే ప్రతి విషయం ద్వారా ఆరోగ్యం మరియు సామాజిక అవగాహనను మెరుగుపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్మృతి ఇరానీ భావించారని తెలుస్తుంది. అలాగే, వీరి మధ్య వచ్చే సంభాషణలు, సలహాలు ఎంతో మందిని ప్రోత్సహించడానికి ఈ సీరియల్ ప్రత్యేక వేదిక అయ్యే అవకాశం ఉంది.
క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ" సీజన్ 2:
"క్యూన్ కీ సాస్ భీ కభీ బహు థీ" సీజన్ 2 లో ఎప్పటిలాగే స్మృతి ఇరానీ తిరిగి తులసిగా కనిపించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తన మార్క్ మెరూన్ రంగు చీరలో, బంగారు బుటీలు, రిచ్ జరీ బోర్డర్‌తో మెరిసిపోతున్నారు. ఆమెకు సరిపోయేలా, పెద్ద ఎర్రటి బొట్టు, సాంప్రదాయ టెంపుల్ జ్యువెలరీ, నల్లపూసల మంగళసూత్రం, వరుస గాజులతో మంచి లుక్‌లో కనిపిస్తున్నారు.
అంతేకాకుండా తనదైన నటనతో ఆడియన్స్లో మంచి అనుభూతి కలిగిస్తున్నారు.ఇపుడు ఈ సీజన్ 2 2000 సంవత్సరం ప్రారంభంలోని టెలివిజన్ ఫ్యాషన్‌కు అచ్చమైన ప్రతీకగా నిలుస్తోందంటున్నారు అభిమానులు. ఆమె రూపం, ఆ గంభీరమైన కళ్ళు, అన్నీ యధావిధిగా శక్తివంతంగానే ఉన్నాయని ప్రశంసిస్తున్నారు.