స్కూళ్ల పనులు ముందుకెళ్తలేవ్!

స్కూళ్ల పనులు ముందుకెళ్తలేవ్!
  • వర్క్ చేసినా బిల్లులివ్వని సర్కారు
  • 10 శాతం ఖాతాల్లో వేసినా తీసేందుకు ఎన్నో కొర్రీలు
  • మధ్యలోనే పనులు వదిలేస్తున్న కాంట్రాక్టర్లు

కరీంనగర్, వెలుగు: మన ఊరు–మన బడి ప్రొగ్రామ్ కింద బడులను సెలెక్ట్ చేస్తే తమ స్కూళ్లు బాగుపడతాయని టీచర్లు, స్టూడెంట్ల తల్లిదండ్రులు సంబరపడ్డారు. కానీ ఈ స్కీమ్ కింద చేపట్టిన పనులు ఎక్కడా పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల పనులు మొదలు పెట్టడం లేదు. కొన్ని చోట్ల మొదలు పెట్టినా.. బిల్లులు సరిగా విడుదల చేయకపోవడంతో మధ్యలోనే వదిలేస్తున్నారు.

అసంపూర్తి పనులు..  
మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో 234 స్కూళ్లను మొదటి ఫేజ్ లో ఎంపిక చేశారు. వీటి డెవలప్ మెంట్​కోసం రూ.2 కోట్ల నిధులు విడుదల చేశారు. 12 రకాల పనులను స్కూళ్లలో చేయాలని ప్లానింగ్ వేశారు. చాలా స్కూళ్లల్లో కాగితాల మీద లెక్కలే పూర్తయ్యాయి కానీ ఎక్కడా ఫీల్డ్ లెవల్ లో పనులు కాలేదు. కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల్లో ప్రతి మండలం నుంచి రెండు స్కూళ్లచొప్పున సెలక్ట్ చేసి త్వరగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. వాటి పనులు కూడా కొలిక్కి రాలేదు. దీంతో పాఠశాలల్లో సౌకర్యాలు  మెరుగుపడకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 

నిధుల కొరతే ప్రధాన సమస్య..
పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా చేపట్టిన మన ఊరు–-మన బడి కార్యక్రమానికి నిధుల కొరత ప్రధాన సమస్యగా మారింది. స్కూళ్లల్లో ముఖ్యంగా డోర్స్, విండోస్, తాగునీటి కోసం సంప్, వాటర్ ట్యాంక్, నల్లాలు, కరెంట్ వైరింగ్, ఫ్యాన్లు అమర్చడం, మరుగుదొడ్లు లేని చోట కొత్తవి నిర్మించడం, శిథిలావస్థలో ఉంటే రిపేర్లు చేయడం, పైకప్పులు సరిచేయడం తదితర పనులు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్క పని చేయాలన్నా.. మినిమం రూ.20వేల నుంచి రూ.50వేల ఖర్చవుతుంది. బడుల కోసం చేపట్టిన కార్యక్రమం కాబట్టి ఎస్ఎంసీ చైర్మన్లు పనులు చేయడానికి ముందుకు వచ్చారు. కొన్నిచోట్ల  సర్పంచులు, ఎంపీటీసీలు పని చేస్తున్నారు. పనులు చేయగానే నిధులు వస్తాయనే నమ్మకంతో  కొందరు అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ వీరికి ఒక్క రూపాయి కూడా బిల్లులు రావడం లేదు. దీంతో చాలాచోట్ల పనులు అసంపూర్తిగా ఉండిపోతున్నాయి. 

అడ్డగోలు కొర్రీలు..
గతంలో స్కూళ్లలో డెవలప్ మెంట్ పనులు చేయాలంటే ఎస్ఎంసీ, హెచ్ఎం జాయింట్ ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి. పని మొదలయ్యే ముందు 20 శాతం అడ్వాన్స్ గా, పనులు పూర్తయ్యే దాన్ని బట్టి 70 శాతం వరకు నిధులు డ్రా చేసుకునే వెసులుబాటు ఉండేది. మన ఊరు మన బడిలో భాగంగా అన్ని పాఠశాలల ఖాతాల్లో 10 శాతం నిధులు వేశామని సర్కారు చెబుతోంది. అయితే వాటిని డ్రా చేసుకోవడానికి మాత్రం నానా కొర్రీలు పెట్టింది. మొత్తం అన్ని పనులు 100 శాతం పూర్తి కావాలి. ఆ పనులు నాలుగు స్టేజీల్లో ఫొటోలను, బిల్లులకు సంబంధించిన ఓచర్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా పూర్తిస్థాయిలో అప్ లోడ్ చేసిన తరవాత ఉన్నతాధికారులు యాక్సెప్ట్ చేస్తేనే ఆ 10 శాతం నిధులు డ్రా చేసుకునే వీలుంటుంది. ఇక మిగిలిన నిధులు ఎప్పుడు వచ్చేది దేవునికే ఎరుక. ఇలాంటి అడ్డదిడ్డమైన కొర్రీలు పెట్టడంతో చాలామంది పాఠశాలల్లో పనులు చేసేందుకు సుముఖత చూపడం లేదు.