బయో వేస్ట్.. చెత్త కన్నా చాలా డేంజర్

 బయో వేస్ట్.. చెత్త కన్నా చాలా డేంజర్
  • మున్సిపల్ చెత్తతో దుర్వాసన.. అంటు వ్యాధులు
  • బయో వేస్ట్.. చెత్త కన్నా చాలా డేంజర్
  • చెత్తను కాల్చ కూడదు

చెత్త... వద్దన్నా వస్తుంది. చెత్త ఎంత పెరిగితే అంత ముప్పు. రోజుకి కొంచెమేగా అనుకుంటే, వేసేకొద్దీ కుప్పలు తెప్పలుగా పేరుకుపోతూనే ఉంటుంది. దాంతో దుర్వాసన రావడం, అంటువ్యాధులు సోకడం మామూలైపోయింది. మరి మున్సిపల్ చెత్తకే అన్ని అనర్థాలు జరిగితే, సిటీల్లో మామూలు చెత్తతోపాటు పెరిగిపోతోన్న బయో వేస్ట్​ ఏమిటి? ఎందుకు పెరుగుతోంది? అది మామూలు చెత్త కన్నా చాలా డేంజర్​. మరి దాన్ని ఎలా క్లీన్​ చేయాలి? 

చెత్త... చెత్త... చెత్త...

రోజువారీగా ఇంటాబయటా వచ్చే చెత్తతోనే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన పీల్చలేక ఊపిరి తీసుకోవడానికి అల్లాడిపోతున్నారు. దానికితోడు అంటువ్యాధులు, అలర్జీలు వస్తున్నాయి. రోజూ ఎంతో కొంత మురుగు కంపు, చెత్త కాల్చిన వాసనలు పీల్చడంతో ఊపిరితిత్తుల సమస్యలు చుట్టుముడుతున్నాయి. డ్రైనేజీ నీళ్లు లీక్​ అయ్యి నిత్యం రోడ్ల వెంట పారుతుంటే.. ఆ నీటిలో కాలుపెట్టలేక, నడిచేందుకు రోడ్డు సరిగాలేకపోవడం ప్రజలకు పెద్ద గండంలా మారింది. ఇవన్నీ నిత్యం మన కళ్ల ముందు కనిపిస్తున్నవే. మున్సిపాలిటీ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా, అంతంత చెత్త ఎక్కడి నుంచి వస్తోందో తెలియడం లేదు. 

ఇదంతా ఒక ఎత్తైతే... మరో ముఖ్యమైన సమస్య బయో మెడికల్ వేస్ట్. మామూలు చెత్తతో పోలిస్తే హాస్పిటల్స్​లో తయారయ్యే బయో వేస్ట్ చాలా రెట్లు ప్రమాదకరం. దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్​ చేస్తే ఇబ్బంది లేదు. కానీ, 48 గంటల్లో క్లీన్​ చేయాల్సిన బయో చెత్తను కొన్నిచోట్ల​ నాలుగు రోజుల వరకు చేయకపోవడం, కారణం అడిగితే హాస్పిటల్స్​లో తగిన సిబ్బంది లేక, ఉన్న వాళ్లకి దాని మీద అవగాహన, సరైన శిక్షణ లేదని చెప్తున్నారు సంబంధిత అధికారులు. అలాగని ఊరుకుంటే ప్రజల ప్రాణాలకే ముప్పు. అంతేకాదు, హాస్పిటల్​ నుంచి వచ్చే కలుషితమైన నీరు డ్రైనేజీలో కలవడం లేదా పైపుల ద్వారా పరిసరాల్లోకి పోవడం ద్వారా పర్యావరణానికే కాదు... మనుషులకూ ఎన్నో ఇబ్బందులు వస్తాయి. 

వీటన్నింటినీ చూసేందుకు ప్రతి హాస్పిటల్​లో తగిన సదుపాయాలు ఉండాలని అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలని హాస్పిటల్​ మేనేజ్​మెంట్, పొల్యూషన్ కంట్రోల్​ బోర్డ్, ప్రభుత్వ అధికారులు కింది స్థాయి సిబ్బందికి చెప్తున్నారు. కానీ.... అవి పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా? తర్వాత రిపోర్ట్​ ఎలా ఉంది? అని తెలుసుకుంటున్నారా? ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నట్లయితే, ఏటా వేస్టేజ్​ పర్సంటేజీ తగ్గుతూ రావాలి. కానీ, దానికి భిన్నంగా ఏటేటా రెండింతలు పెరుగుతోంది. దీనికి కారణాలేంటి? పరిష్కారాలు ఏంటి? లోపం ఎక్కడుంది? ఎలా సరి చేయాలి? అనేది గ్రౌండ్​ లెవల్​లో జాగ్రత్తగా గమనించాల్సి ఉన్నా దేశంలో చాలాచోట్ల అలా జరగడం లేదు. 

పొల్యూషన్ లెక్కల ప్రకారం..

వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు బద్దలవడం, ఇండస్ట్రియల్ పొల్యూషన్‌‌‌‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా పది లక్షల మందిపైనే ప్రాణాలు కోల్పోతున్నారని సర్వేలు చెప్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న వంద సిటీల జాబితాలో15 మనదేశానికి చెందినవే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) రిపోర్ట్​ చెప్తోంది. ఈ ప్రాంతాల్లో 99 శాతం కలుషితమైన గాలి పీలుస్తున్నారు. కెమికల్స్ వాడకం, విషపూరితమైన చెత్త భూమిలోకి పంపడం వల్ల మూడొంతు నేలలు నిస్సారమయ్యాయి. ఇండస్ట్రియల్, సిటీ వేస్ట్​తో నీరు కలుషితం అవుతోంది. వరల్డ్ ఎయిర్ పొల్యూషన్​ లెక్కల ప్రకారం, మన దేశంలో పదిహేను లక్షల మందికి పైగానే చనిపోతున్నారని తేలింది.

వీటన్నింటి గురించి చెప్పిన సంస్థ, బయో వేస్ట్ గురించి చెప్పలేదు. నిజానికి వాటికంటే డేంజర్ బయో వేస్ట్​. ఎందుకంటే రకరకాల రోగాలతో హాస్పిటల్​లో చేరతారు. వారి బాగోగులు చూసుకోవడానికి బంధువులు వెళ్తారు. మరి అలాంటప్పుడు వాళ్లంతా సేఫ్​ ప్లేస్​లో ఉన్నారని అనిపించే పరిసరాలు అక్కడ ఉంటున్నాయా? వాళ్లంతా ఆరోగ్య వంతులుగానే ఇంటికి వెళ్తారన్న గ్యారెంటీ ఉందా? ఎందుకంటే... వాళ్లు రోగిని నయం చేయించుకోవడానికి హాస్పిటల్స్​కి వెళ్తే అక్కడి అధ్వాన పరిస్థితులకు, వీళ్లే రోగులుగా మారే అవకాశం ఉంది. అక్కడికి వెళ్తే కొత్త రోగాలు అంటుకుంటాయనే భయంతో ఇండ్లలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నవాళ్లూ చాలామందే ఉన్నారు. అయితే ఇక్కడా మరో ప్రాబ్లమ్ ఉంది. ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకున్నా... బయో వేస్ట్ పడేసే పద్ధతిలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇంట్లోవాళ్లకూ ప్రమాదమే. అసలు బయో వేస్ట్ అంటే ఏంటి? అది ఇంట్లోకి ఎలా వస్తుంది? 

బయో మెడికల్ వేస్ట్ అంటే... 

బయో మెడికల్ వేస్ట్ అంటే హాస్పిటల్​లో పోగయ్యే చెత్త. ఇది మామూలు చెత్తకన్నా చాలా డేంజర్. రకరకాల వ్యాధుల బారిన పడిన వాళ్లకు ట్రీట్మెంట్ చేసేటప్పుడు, గాయాలైన వారికి కట్లు కట్టేటప్పుడు, ఇంజెక్షన్స్ చేసినప్పుడు, బ్లడ్ క్లీన్ చేసినప్పుడు.. వాళ్లకు వాడిన ప్రతి వస్తువూ మెడికల్ వేస్ట్ కిందకే వస్తుంది. సిరంజ్​ ఒకసారి వాడాక, అలాగే పడేస్తారు. రోగి రక్తం, రోగ లక్షణాలున్న డీఎన్​ఏ వంటివి సిరంజ్​కి అంటుకునే ఉంటుంది. అది పొరపాటున ఎవరికైనా గుచ్చుకుంటే ఇన్ఫెక్షన్​ అవుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలను కొన్నిసార్లు ఊహించలేం కూడా. ఇదేకాకుండా, హాస్పిటల్స్ నుంచి వచ్చే అలాంటి బయో వేస్ట్ సక్రమంగా డిస్పోజ్​ చేయకపోతే కొత్త సమస్యలు వస్తాయి. కానీ, ఆ విషయంలో కొన్ని  హాస్పిటల్స్​, క్లినిక్​లు నిర్లక్ష్యంగా ఉండటంతో నేచర్​తోపాటు పబ్లిక్ హెల్త్​ని కూడా డేంజర్​లోకి నెట్టేస్తున్నారు వాళ్లు. అలాగే ఆపరేషన్లు జరిగినప్పుడు మిగిలిపోయిన శరీర భాగాలు కూడా కిందే వస్తాయి. అంతేకాకుండా, కాలం చెల్లిన మందులు కూడా బయో వేస్ట్​లో భాగమే. చాలామంది రిటైలర్లు ఎక్స్‌‌పైర్‌‌ అయిన మందుల్ని చెత్తలో వేస్తున్నారు. 

ఇండ్లలోనూ ఇదే తీరు

చాలామంది హాస్పిటల్స్​ వల్ల మాత్రమే బయో వేస్ట్ ఉత్పత్తి అవుతుంది అనుకుంటున్నారు. కానీ అది భ్రమ. ఇంట్లో ఉండే బయో మెడికల్ వేస్ట్​ని గురించి ఆలోచించడం లేదు. నూటికి ఎనభై శాతం ఈ విషయంలో సరైన  జాగ్రత్తలు తీసుకోవట్లేదనే చెప్పాలి. అసలు బయో వేస్ట్ ఇళ్లలో తయారవ్వడమేంటి? అని కొందరికి డౌట్ రావొచ్చు. 

ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు, ఏదో ఒక మెడిసిన్​ వాడుతుంటారు. పెద్దవాళ్లైతే బీపీ, షుగర్​​.. వంటి వాటికి మందులు వాడుతుంటారు. చిన్నపిల్లలున్న ఇండ్లలో అయితే వాళ్లకు జలుబు, దగ్గు వంటివి తరచూ వస్తుంటాయి. కాబట్టి వాటికి సంబంధించిన మందులు, టానిక్​లు వాడతారు. ఇక మిగతావాళ్ల విషయానికొస్తే అప్పుడప్పుడు జలుబు, జ్వరం, మోషన్స్, అజీర్తి వంటివి వచ్చినప్పుడు మందులు వేసుకుంటారు. అయితే ఇక్కడ మందులు వాడటం సమస్య కాదు. కానీ, ఒక్కరోజులో తగ్గిపోయే వాటికి కూడా వారానికి లేదా నెలకు సరిపడా మందులు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. వాటి అవసరం తీరాక, చెత్తలో పడేస్తారు. కొందరైతే ఎక్స్​పైరీ డేట్​ వరకు ఉంచి, ఇక పనికిరావు అన్నప్పుడు పడేస్తారు. కేవలం టాబ్లెట్స్​, టానిక్​లు, ఆయింట్​మెంట్​లే కాదు... గాయాలైనప్పుడు ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అలా చేసుకోవడం వరకు ఓకే. కానీ, బ్లడ్ తుడిచిన బట్ట, దూది, చికిత్స కోసం ఉపయోగించిన ప్రతి వస్తువూ ఎక్కడ పడేస్తున్నారు? అనేది గమనించుకోవాలి. 

చెత్తలో బయో వేస్ట్ ను కలపకూడదు..

చెత్తతోపాటే పోతుంది కదా అనుకుంటే పొరపాటు. మామూలు చెత్తని, బయో వేస్ట్​ను అస్సలంటే అస్సలు కలపకూడదు. ఎందుకంటే అవి చెత్తలో కలవడం వల్ల కొత్త వ్యాధులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అలాగే, కొందరు హాస్పిటల్​కి వెళ్లలేక, ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటారు. హాస్పిటల్​లో చేసే చికిత్స మొత్తం ఇంట్లోనే చేయించుకుంటారు. ఎక్కడైతేనేం చికిత్స చేయించుకోవడం ముఖ్యం. కానీ... చికిత్సకు వాడిన ప్రతీది పడేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారన్నదే పాయింట్! 

ఉదాహరణకు... ఒక ఇంట్లో ముసలి వాళ్లు, చిన్నపిల్లలు ఇద్దరూ ఉన్నారనుకుంటే, ముసలివాళ్లని దాదాపు హాస్పిటల్​కి తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్లకు ఇంట్లోనే ఇంజెక్షన్స్​ చేయడం,సెలైన్ బాటిల్స్ పెట్టడం.. వంటి ట్రీట్మెంట్ చేస్తారు. కానీ, ఆ సందర్భంలో అన్నిసార్లూ జాగ్రత్తగా ఉంటారని చెప్పలేం. కొన్నిసార్లు అనుకోకుండా పిల్లలు రావడం, అక్కడున్న వస్తువులు పట్టుకోవడం చేస్తుంటారు. అలాంటప్పుడు పేషెంట్​కి ఉన్న సమస్య పిల్లలకు రాదని గ్యారెంటీ ఏంటి? వాళ్లకేమైనా అంటువ్యాధులు ఉంటే వెంటనే అటాక్​ అయ్యే అవకాశం ఉంది. అలాగని పిల్లల్ని పెద్దవాళ్లకు దూరం చేయమని చెప్పట్లేదు. అందరూ అలా అజాగ్రత్తగా కూడా ఉండరు. ఎంత జాగ్రత్తగా ఉన్నా పొరపాట్లు జరగడం సహజం. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండడం బెటర్. అందుకు చేయాల్సిందల్లా కేవలం వాళ్లకు ట్రీట్​మెంట్ చేసేటప్పుడు దగ్గరే ఉండి చూసుకోవడం. పేషెంట్ వాడే మందుల గురించి జాగ్రత్తగా ఉండాలి. లేదంటే లేనిపోని అనర్థాలకు తావు ఇచ్చినట్టే!  

హాస్పిటల్స్​లో...

హాస్పిటల్స్​లో బయో మెడికల్​ వేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చాలావరకు హాస్పిటల్స్​లో బయో వేస్ట్​ మేనేజ్​మెంట్ గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ, కొన్నిచోట్ల మాత్రం పరిస్థితి డిఫరెంట్​గా ఉంది. బయో చెత్తను ప్లాస్టిక్​ కవర్లలో వేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు వర్కర్స్ చేతులకు గ్లోవ్స్​ కూడా వేసుకోవట్లేదు. ఏమాత్రం జాగ్రత్తలు లేకుండా బయో వేస్ట్​ని తీసుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే, కొన్ని చోట్ల మాస్క్​లు, సిరంజ్​లు, సెలైన్​ బాటిల్స్, రోగి వాడిన బట్టలు, వస్తువులు వంటివన్నీ మున్సిపల్ చెత్తలో కలిపేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులు రోగుల నుంచి వచ్చే ఫ్లూయిడ్స్‌‌ను.. సీవరేజీ ట్రీట్మెంట్‌‌ చేయకుండానే డ్రైనేజీలోకి వదులుతున్నారు. వాటివల్ల నానా రకాల సమస్యలు వస్తున్నాయి.  

మందులు పాడైతే...

ఆరోగ్యం పాడైతే ఫార్మసీకి వెళ్లి మందులు తెచ్చుకుని వేసుకుంటారు. మందులు వేసుకుంటే తిరిగి మామూలు స్థితికి వస్తారు. మరి మందులే పాడైతే..? వాటిని అస్సలు వాడకూడదు. అలాగే ఎక్స్​పైర్ అయిన మందులు వాడకూడదు. దాంతో వాటన్నింటినీ చెత్తలో పడేస్తున్నారు. ఈ పరిస్థితి ఇండ్లలో కంటే ఫార్మసీల్లోనే ఎక్కువ. కానీ, మరి అవి పాడయ్యాయని ఎలా తెలుస్తుంది?

చాలాకాలం మందులు వాడకపోయినా, మంచి ప్రదేశంలో పెట్టకపోయినా మందులు చెడిపోతాయి. ముఖ్యంగా యాంటీబయాటిక్స్‌‌.. ఇవి పాడైపోవడం వల్ల ఆ చెత్త నుంచి కొత్తరకం బ్యాక్టీరియా పుడుతుంది. ఆ బ్యాక్టీరియా వల్ల కొత్త జబ్బులు వస్తాయి. దాంతో ఆ జబ్బులకు మంచి యాంటీబయాటిక్స్‌‌ వాడినా పూర్తిగా తగ్గడంలేదనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. 

ఎక్స్​పైర్​ అయిన మందులను మున్సిపల్ చెత్తలో వేస్తున్నారు చాలామంది. 200 డిగ్రీల సెల్సియస్‌‌ టెంపరేచర్​లో డిస్పోజ్​ చేయాల్సిన మందులు డంపింగ్‌‌ యార్డుల్లో కుళ్లిపోతున్నాయి. ఆ మందులు చెత్త కుప్పల్లో కుళ్లిపోవడం వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతోంది. గాలి ద్వారా వచ్చే జబ్బులు పెరుగుతున్నాయి. 

కొన్ని మందులు భూమిలో కలిసిపోతున్నాయి. దాని ద్వారా భూగర్భ జలాలు విషంగా మారే అవకాశం ఉంది. ఆ నీటిని వాడడం వల్ల మనుషులతోపాటు జంతువులకు కూడా మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్‌‌–బి వంటి జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మందులు పారేసే విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. 

ఒకవేళ మెడిసిన్​కు ఎక్స్​పైరీ డేట్ ఎక్కువ కాలం ఉండి, వాటిని వాడాల్సిన అవసరం లేకపోతే, అవసరమున్న వాళ్లకు వాటిని ఇవ్వాలి. అప్పుడు చెత్తలో పడేయాల్సిన అవసరం రాదు.

సక్రమంగా చేయకపోతే సమస్యలు

మెడికల్ వేస్ట్‌‌‌‌ను కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ప్లాంట్లకు పంపిస్తారు. అక్కడ 800 డిగ్రీల వేడిలో వాటిని కాల్చేస్తారు. కొన్నింటిని పూడ్చిపెడతారు. ఇలాంటి మెడిక్లీన్ ప్లాంట్లు రాష్ట్రంలో 11 చోట్ల ఉన్నాయి. అయితే, మెడికల్​వేస్ట్‌‌‌‌​ మేనేజ్​మెంట్ సరిగా లేకున్నా, ట్రీట్మెంట్ ప్లాంట్లలో సరిగా కాల్చకపోయినా ప్రమాదం అని ఎక్స్‌‌‌‌పర్ట్స్ చెప్తుతున్నారు. ప్లాంట్ల చుట్టుపక్కల ఉండే జనాలు రోగాల బారిన పడతారు. హాస్పిటల్స్‌‌‌‌ నుంచి ఎప్పటికప్పుడు వేస్టేజ్ తరలించకపోయినా వాటి నుంచి వెలువడే బ్యాక్టీరియా, వైరస్‌‌‌‌లతో ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి?

రాష్ట్రంలో బయో మెడికల్ వేస్టేజీ గురించి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్​ బోర్డ్ ఇచ్చిన రిపోర్ట్​ చూస్తే... ​ రెండేండ్లలోనే రోజుకు ఐదు వేల కేజీలు పెరిగింది. 2017లో రోజుకు15,719 కిలోల వేస్ట్‌‌‌‌ ఉత్పత్తి అయితే 2020నాటికి రోజుకి 23,810 కిలోలకు పెరిగింది. అంటే రాష్ట్రంలో చెత్తను తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా... ఏటా చెత్త పెరుగుతున్నాయనడానికి ఈ రిపోర్ట్​లే సాక్ష్యం. ఈ వివరాలన్నీ పోయినేడాది చివరిలో స్టేట్​ పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు (పీసీబీ) రిపోర్ట్​ విడుదల చేసింది. ఒక్క మన రాష్ట్రంలోనే ఏటా ఇంత బయో వేస్ట్ ఉత్పత్తి అవుతుంటే, దేశం మొత్తం మీద ఎంత ఎక్కువ చెత్త ఉత్పత్తి అవుతుందో ఊహించుకోవచ్చు. 
కరోనా టైంలో దేశం మరింత డేంజర్​ జోన్​లోకి వెళ్లింది. అప్పుడు డాక్టర్స్​తో సహా రోగులు, సామాన్యులు... ఇలా ఎంతోమంది ఇబ్బందులకు గురయ్యారు. 

ఇక్కడే ఎక్కువ

రాష్ట్రంలో 6,542 హెల్త్​కేర్​ ఫెసిలిటీస్ ​ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​మల్కాజ్‌‌‌‌గిరి జిల్లాల్లో హాస్పిటల్స్‌‌‌‌ ఎక్కువ. అందువల్ల ఈ మూడు జిల్లాల నుంచి మెడికల్ వేస్ట్‌‌‌‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది. రూల్స్‌‌‌‌ ప్రకారం మెడికల్‌‌‌‌ వేస్ట్‌‌‌‌ను ఎరుపు‌‌, పసుపు, తెలుపు‌‌, నీలం రంగు డస్ట్ బిన్​లు వాడాలి. వాటిని వేటికవే కేటగిరీలుగా విభజించారు. ఎరుపు  రంగు  కేటగిరీలో సూది లేని సిరంజీలు, గ్లౌజులు, బాటిల్స్, ఇంట్రావీనస్ ట్యూబ్‌‌‌‌లు, యూరిన్​బ్యాగులు ఉంటాయి. 2017లో ఇలాంటి వేస్ట్‌‌‌‌ రోజుకు 3,688 కేజీలు రాగా.. 2019లో 5,085 కేజీలకు పెరిగింది. పసుపు రంగు కేటగిరీలో ఇన్ఫెక్షన్ ఉన్న అవయవాలు, పేగులు, రక్తంతో తడిసిన వస్తువులు, బ్యాండేజీలు, కాటన్ ఉంటాయి. ఈ రకం వేస్ట్‌‌‌‌ 2019లో రోజుకు12,016 కేజీలు వచ్చింది. తెలుపు రంగు కేటగిరీలో సూదులు, బ్లేడ్లు, సర్జరీలు చేసేందుకు వాడే పరికరాలు ఉంటాయి. 2019లో ఇవి రోజుకు 2,729 కేజీలు వచ్చాయి. నీలం రంగు కేటగిరీ వేస్ట్‌‌‌‌ రోజుకు 642 కేజీలు జనరేట్ అయినట్లు పీసీబీ రిపోర్ట్ చెప్పింది. పోయిన ఏడాది కరోనా వల్ల మెడికల్ వేస్ట్‌‌‌‌ మరింతగా పెరిగింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న బయోమెడికల్‌‌ వేస్ట్‌‌ను కామన్‌‌ బయోమెడికల్‌‌ ట్రీట్మెంట్‌‌ ఫెసిలిటీ కేంద్రాలకు తరలించాలి. కానీ, కొందరు డంపింగ్‌‌ యార్డులు, శివారుల్లోని ఖాళీ ప్రదేశాల్లో డంప్‌‌చేస్తున్నారు. అయితే, బయోవేస్ట్​ తరలింపును చూసుకునేందుకు సీపీసీబీ ప్రత్యేకంగా బయోవేస్ట్‌‌ ట్రాకింగ్‌‌ యాప్‌‌ను రూపొందించింది. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు బయోవేస్ట్​ను తరలించే వాహనాలను జీపీఎస్‌‌తో అనుసంధానం చేసింది. ఇది దేశంలోనే మొదటిసారి. వాటిని టీఎస్‌‌పీసీబీ కేంద్ర కార్యాలయం నుంచి జీపీఎస్‌‌ ట్రాకింగ్‌‌ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా బహిరంగ ప్ర దేశాల్లో వేస్తే పీసీబీ పెట్రోలింగ్‌‌ బృందాలకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.

రాజధానిలో..

హైదరాబాద్​లోనే ఏటా మూడు మిలియన్ టన్నుల బయో మెడికల్ వేస్ట్ తయారవుతోంది. ఒకవైపు ప్రభుత్వం ‘‘ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం. ప్రజలకు ఏం భయం లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అంటోంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని రకాలుగా అవేర్​నెస్ కల్పించినా, ఏటేటా బయో వేస్ట్ శాతం మాత్రం పెరుగుతూనే ఉన్న విషయం గమనించాలి. రాష్ట్రంలోనే ఇలా ఉంటే... దేశం మొత్తం మీద రోజుకి, నెలకి, ఏడాదికి ఎన్నెన్ని కోట్ల టన్నుల బయో వేస్ట్ వస్తోంది? కరోనా వచ్చాక బయో వేస్ట్ చాలా పెరిగిపోయింది. మరోపక్క నాలుగో వేవ్ వస్తుందని వార్తలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యం చెప్పేదెలా? బయో వేస్ట్​కు అడ్డుకట్ట వేసేది ఎలా? 

కారణాలేంటి?

హోం క్వారంటైన్​లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్లకి అర్బన్​ లోకల్​ సంస్థ (యూఎల్​బీ) పసుపు రంగు సంచులను ఇచ్చాయి. వాటిలోనే బయో వేస్ట్​ వేయాలని సీపీసీబీ గైడ్​లైన్స్ జారీ చేసింది. కానీ, జీహెచ్ఎంసీ, ఊరి శివార్లలోని మునిసిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు ఈ విషయం పై దృష్టి పెట్టినట్టు కనిపించడంలేదని గతంలో విమర్శలొచ్చాయి. బయో వేస్ట్​పై అవగాహన లేక ప్రజలు చెత్త కుండీల్లోనే వేస్తున్నారని ఎక్స్​పర్ట్స్‌‌ చెప్తున్నారు. ‘‘కరోనా వైరస్​ పోయిందనే భావనలో ఏమరుపాటుగా ఉన్నారు ప్రజలు. కానీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతార’’ని గట్టిగా చెప్తున్నారు. వీటికి ప్రధాన కారణం అవగాహన లేకపోవడం. అటు ప్రజలు, హాస్పిటల్​ సిబ్బంది వల్ల తప్పులు జరగడానికి ప్రధాన కారణం.

అవగాహన లోపం

చాలామంది అవగాహన లేక బయో వేస్ట్​ని కూడా చెత్తలో కలిపేస్తారు. పొరపాటున ఆ చెత్తను పెంపుడు జంతువులు కదిలిస్తే, వాటికి బ్యాక్టీరియా, వైరస్​లు అంటుకుంటాయి. వాటిని మనుషులు తాకినప్పుడు, వాటితో కలిసి ఆడినప్పుడు వాటి నుంచి మనకు సోకే ప్రమాదం ఉంది. ఒకవేళ ఏ జంతువులూ వాటిని కదిలించకపోయినా, బయో వేస్ట్​ని 48 గంటల్లోపు తీసేయకపోతే చాలా ప్రమాదమని అటు హాస్పిటల్ యాజమాన్యాలు, ఇటు సెంట్రల్, స్టేట్​ పొల్యూషన్ కంట్రోల్​ బోర్డులు గట్టిగానే చెప్తున్నాయి. బయో వేస్ట్​లో ఉండే బ్యాక్టీరియా, వైరస్ గాల్లో కలిసి లేనిపోని రోగాలకు కారణమవుతోంది. అలాగని కాల్చేస్తే ఇంకా డేంజర్. ఇవే డేంజర్ అనుకుంటే ‘‘మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు’’ కొవిడ్ వచ్చాక దేశంలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. 
హాస్పిటల్​ లెవల్​ నుంచి అవగాహన ఉండాలి. అక్కడి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు వాళ్ల కింద ఉన్న వర్కర్స్ సరిగా పని చేస్తారు. వర్కర్స్ కొరత, బయో వేస్ట్​ మీద అవగాహన లోపం వల్ల వేస్ట్​ని వేటికవే విడదీసే ప్రాసెస్ జరగకపోవచ్చు. రూల్స్ పాటించని హాస్పిటల్స్​కు నోటీసులు ఇస్తుంది. రికార్డుల్లో బరువు తూచి ఇస్తున్నట్టే ఉంటుంది. కానీ, అది సరైనదా? కాదా? అసలు బరువు తూచారా? లేదా అనేది తెలుసుకోవాల్సి ఉంది. 

కాల్చకూడదు

హాస్పిటల్​లో ఆపరేషన్​ చేసి తొలగించిన అవయవాలను కాలిస్తే, ఆ పొగ వాతావరణంలో కలిసిపోతుంది. పీల్చే గాలి కలుషితమై, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. చిన్న చిన్న పిహెచ్​సీలు, క్లినిక్​లలో అయితే గుంత తవ్వి,  సిమెంట్ రింగులు వేసి, అందులో వేస్తారు. అది నిండిన తర్వాత పూడ్చేస్తారు. డెలివరీ హాస్పిటల్స్​లో ఎమ్​ఓయూ(మెమొరాండమ్​ ఆఫ్ అండర్​స్టాండింగ్​) వాలంటరీ అగ్రిమెంట్ చేసుకుని, ప్రతి నెలా వాళ్లకి ఇస్తారు. రోజుకి ఒక్కో బెడ్ చొప్పున మూడు రూపాయలు ఛార్జ్​ చేస్తారు. చెత్తను తీసుకెళ్లడానికి కొన్ని ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుంటారు. ఆ చెత్తను సీవరేజ్ ప్లాంట్లకు తీసుకెళ్లి డిస్పోస్​ చేస్తారు. 

ఎస్టీపీ ఉండాలి

బయో వేస్ట్​తోపాటు ల్యాబ్స్, ఆపరేషన్​ థియేటర్స్ నుంచి వచ్చే కలుషిత నీరు నేరుగా భూమిలో కలిసిపోతుంది. దానికోసం ప్రత్యేకంగా ఎస్​టీపీ ఉండాలి. అంటే సీవేజ్​ ట్రీట్​మెంట్ ప్లాంట్. ఇది వేస్ట్​ వాటర్​ నుంచి కలుషితం చేసే కారకాలను తొలగిస్తుంది. ఇందులో ఫిజికల్, కెమికల్, బయలాజికల్ పద్ధతులు ఉంటాయి. వాటి ద్వారా వ్యర్థాలను తొలగించి పర్యావరణాన్ని రక్షిస్తుంది. 

ఏరోజుకారోజే క్లీన్ చేయాలి

బయో వేస్టేజ్ మేనేజ్​మెంట్ రూల్స్ ప్రకారం ఏ రోజుకారోజు మెడికల్‌‌‌‌ వేస్ట్‌‌ను ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపాలి. కానీ వేస్ట్‌‌‌‌ నిర్వహణలో కొన్ని హాస్పిటళ్లు రూల్స్‌‌‌‌ పాటించట్లేదని, వేస్ట్‌‌‌‌ను విభజించకుండానే ప్లాంట్లకు పంపుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇంకొన్ని హాస్పిటళ్లలో ఐదారు రోజులకోసారి వేస్ట్‌‌‌‌ను క్లీన్​ చేస్తున్నారని తెలిసింది. వీటిపై కంప్లైంట్ వచ్చే వరకు పీసీబీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు కూడా వచ్చాయి. ఏ ప్రాంతం నుంచి ఎంత బయో మెడికల్ వేస్ట్‌‌‌‌ వస్తోంది? ఏ ప్లాంట్‌‌‌‌కు ఎంత పంపిస్తున్నారో వంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్‌‌‌‌డేట్​ చేయాలి. పైగా మున్సిపల్ చెత్తలోనే15 నుంచి 20 శాతం మెడికల్ వేస్టేజ్​ వెళ్తోందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెప్తుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  • అవేర్​నెస్ ప్రోగ్రామ్​లు నిర్వహించాలి. అప్పుడే ప్రజలకు బయో మెడికల్ వేస్ట్ గురించి క్లారిటీ వస్తుంది. 
  • హాస్పిటల్స్​లో సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూసుకోవాలి.
  • హాస్పిటల్​లో గానీ, ఇండ్లలో గానీ 48 గంటల కంటే ఎక్కువ సేపు బయో వేస్ట్ ఉండకూడదు. 
  • వాడేసిన సిరంజ్​, సెలైన్ బాటిల్​, కాన్యులా, బ్లడ్ తుడిచిన క్లాత్, టానిక్ సీసా, మందులు... ఏవైనా సరే సపరేట్​చెత్తబుట్టలో వేయాలి. 
  • చెత్తను వేరు చేసేటప్పుడు వేరు వేరు రంగుల కవర్లు వాడాలి. బయో వేస్ట్​ని ముట్టుకునేటప్పుడు చేతులకు గ్లోవ్స్​ వేసుకోవాలి. తర్వాత చెత్తతో పాటు గ్లోవ్స్​ కూడా పడేయాలి. 
  • చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి. శానిటైజర్​ వాడాలి. 
  • మాస్క్​లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి వాడినవి మళ్లీ వాడొద్దు. మాస్క్​ల్ని కూడా బయో వేస్ట్ వేసే కవర్​​లోనే వేయాలి. 
  • ఎక్స్​పైరీ అయిన ట్యాబ్లెట్స్‌‌ ఒట్టి చేతులతో ముట్టుకోవద్దు. వాటిని కూడా కవర్​లో వేసి మూటకట్టి పడేయాలి. 

కొవిడ్ వేస్ట్

ఇప్పుడు మామూలు బయో వేస్ట్​కు, కరోనా కూడా తోడైంది. దాంతో బయో వేస్ట్​ పర్సంటేజీ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే కరోనా ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్స్​లో, క్వారంటైన్, టెస్టింగ్ సెంటర్స్​లో పీపీఈ కిట్లు, కాటన్, డ్రెస్సింగ్ మెటీరియల్, ప్లాస్టర్స్, వాడిన సిరంజ్​లు, మెడిసిన్స్, బ్లేడ్స్, నీడిల్స్, రోగి వాడిన ప్లేట్లు, స్పూన్లు, మాస్క్​లు వంటివి బోలెడు వస్తువులు ఉంటాయి. అవన్నీ బయో మెడికల్ వేస్ట్​ కిందకే వస్తాయి పొల్యూషన్ బోర్డ్ లెక్కల ప్రకారం. ఒక్కో పడకకు 750 గ్రాముల చొప్పున బయో మెడికల్ వేస్ట్ వస్తుంది. అంటే... రోజుకు యావరేజ్​గా రెండు మెట్రిక్ టన్నుల వరకు బయో వేస్ట్ సేకరిస్తారన్నమాట. ఈ లెక్క గతంలోది. 

కొవిడ్‌‌ వేస్ట్​ను నిల్వచేయడానికి ఉపయోగించే కంటైనర్లు, డబ్బాలు, ట్రాలీలకు లోపలా, బయటా, ఒకశాతం సోడియం హైపోక్లోరేట్‌‌ లిక్విడ్​తో ప్రతిరోజు క్లీన్​ చేయాలి. దాంతోపాటు ఐసొలేషన్‌‌ వార్డుల నుంచి చెత్తను సేకరించడానికి 50 మైక్రాన్‌‌ల మందం ఉండే రెండు పొరల సంచులను ఉపయోగించాలి. రంగుల డబ్బాలతోపాటు, కొవిడ్‌‌-–19 లేబుల్‌‌ అతికించిన కంటైనర్లలో విడిగా సేకరించాలి. సీబీడబ్ల్యూటీఎఫ్‌‌కు చెందిన సిబ్బందికి అందజేసే ముందు వ్యర్థాలను విడిగా ఒక గదిలో భద్రపర్చాలి. బయో వేస్ట్​ను, ఇంటి చెత్తను వేసేందుకు ప్రత్యేక డబ్బాలు వాడాలి. బయో వేస్ట్​లు పేరుకుపోయినప్పుడు క్వారంటైన్‌‌ సెంటర్స్ నిర్వాహకులు సీడబ్ల్యూటీఎఫ్‌‌ ఆపరేటర్‌‌ను సంప్రదిస్తారు. 

ఒక్కో రంగుకు ఒక్కో రూమ్​​

ఎవరైనా అనారోగ్యంతో హాస్పిటల్​కు​ వచ్చినప్పుడు వాళ్లకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాం. అంతే కాకుండా ఈ మధ్య కొవిడ్ వ్యాక్సినేషన్ కూడా చేస్తున్నాం. అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్లకు వాడిన ప్రతీది బయో మెడికల్ వేస్ట్ కిందే లెక్క. వెటర్నరీ హాస్పిటల్స్​లో కూడా జంతువులకు టెస్ట్​లు, ట్రీట్మెంట్​ ఇచ్చేటప్పుడు వాడిన వస్తువులు ఈ లెక్కలోనే వస్తాయి. అయితే, బయో మెడికల్ వేస్ట్​లో ముఖ్యంగా రెండు రకాలున్నాయి. ఒకటి ప్రమాదకరమైంది. రెండోది ప్రమాదం కానిది. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేని వ్యక్తులకు వాడిన సిరంజ్​లు, నీడిల్స్ వంటివి ప్రమాదకరం కాదు. ఇన్ఫెక్షన్​ ఉన్న వ్యక్తికి టెస్ట్​లు లేదా ట్రీట్మెంట్ చేసినప్పుడు వాడే ప్రతి వస్తువూ ప్రమాదకరమే. ప్రమాదకరమైన వాటిలో ఇంకోటి కూడా ఉంది.

అదేంటంటే... రేడియో యాక్టివ్ వేస్ట్. అది క్యాన్సర్​ పేషెంట్స్​కు ట్రీట్మెంట్ చేసేటప్పుడు వస్తుంది. ​హాస్పిటల్స్ అన్నీ ఈ బయో మెడికల్ వేస్ట్ మేనేజ్​మెంట్ రూల్స్ పాటించాలని చెప్పింది పీసీబీ. ఆ రూల్స్ ప్రకారం, వేస్ట్​ వేరు​ చేయాలి. అంటే, రకరకాల చెత్తను వేరు వేరు రంగుల డబ్బాల్లో వేయాలి. అయితే, కీమో థెరపీ, రేడియో యాక్టివ్ వేస్ట్​కి రూల్స్ సపరేట్​గా ఉంటాయి. ప్రతి హాస్పిటల్లో సెంట్రల్ బయో మెడికల్ వేస్ట్ స్టోరేజ్​ ఫెసిలిటీ ఉంటుంది. ఈ రంగుల డస్ట్​బిన్​లో ఉన్న వేస్ట్​ అంతా పార్టిషన్ రూమ్​లో ఉంచుతారు.

అది కూడా ఒక్కో రంగుకు ఒక్కో రూమ్​ ఉంటుంది. అక్కడి నుంచి వాటిని మూసి ఉండే ట్రాలీల్లో తీసుకెళ్తారు. ఒక్కో రంగు డబ్బాలో వేసిన వేస్ట్​ ఒక్కో ట్రాలీలో తీసుకెళ్తారు. ఇవన్నీ బయో మెడికల్ వేస్ట్ మేనేజ్​మెంట్ పరిధిలో ఉంటాయి. ఆ రూమ్​లలోకి ఎవరూ వెళ్లకుండా వాళ్లు జాగ్రత్త తీసుకుంటారు. అందులోకి వెళ్లేవాళ్లు గ్లోవ్స్​, మాస్క్​ వంటివి లేకుండా లోపలికి వెళ్లడానికి వీలులేదు. వేస్ట్ ఉన్న బ్యాగ్​లకు బార్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ స్కాన్ చేస్తే ఆ వేస్ట్ ఏ హాస్పిటల్​? ఏ ఏరియా నుంచి వచ్చింది? ఏ తేదీ, ఏ టైంలో వచ్చింది? అనేది తెలుస్తుంది. 48 గంటల్లోపు వాటిని తీసుకెళ్తారు. 

హైదరాబాద్​ విషయానికొస్తే కామన్ బయో మెడికల్ వేస్ట్ మేనేజ్​మెంట్ ఫెసిలిటీ ఉంది. అది లోకల్ జీహెచ్​ఎంసీ అప్రూవ్ చేసింది. కాబట్టి ఈ బయో మెడికల్ వేస్ట్​ని వాళ్లకే ఇస్తారు. వాళ్లు మూసి ఉండే ఒక వాహనంలో వాటిని తీసుకెళ్తారు. తీసుకెళ్లేముందు బ్యాగుల బరువులు చెక్ చేస్తారు. రోజుకి వాళ్లు ఎంత వేస్ట్​ని జనరేట్​ చేస్తున్నారనేది తెలుసుకోవడం కోసం. ఆ వెయిట్​ ఇన్ఫర్మేషన్​ని వాళ్ల రికార్డుల్లో రాసుకుంటారు. రికార్డ్​ చేసిన వాటి గురించి ఒక పేపర్​ హాస్పిటల్​కు ఇస్తారు. తీసుకెళ్లిన వేస్ట్​ని ఒక్కో రకాన్ని ఒక్కో విధంగా డిస్పోజ్​ చేస్తారు.

వాటిలో ఒక పద్ధతి ఇన్సినరేషన్. అంటే ఎక్కువ టెంపరేచర్​లో కాల్చేయడం. రెండోది ష్రెడ్డింగ్.అంటే సిరంజ్​లు వంటి వాటిని చిన్న ముక్కలు చేసి రీసైక్లింగ్​కి పంపిస్తారు. వాటిని వేరే పనికి ఉపయోగిస్తారు. గ్లాస్​ వేస్ట్​ని ముక్కలు చేసి, లోతుగా  గుంతలు తీసి పూడుస్తారు. ఇది మూడో పద్ధతి. ఇలా డిస్పోజ్ చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు.  – రాజీవ్ చౌరే​, కేర్ హాస్పిటల్స్​ గ్రూప్ వైస్​ ప్రెసిడెంట్ (క్వాలిటీ అండ్ అక్రిడిటేషన్) 

బయో వేస్ట్​కి కొన్ని రూల్స్

  • బయో మెడికల్ వేస్ట్ మేనేజ్​మెంట్​ కోసం సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్​ 2016లో కొన్ని రూల్స్ పెట్టింది. అయితే తర్వాత  2018–19లో అందులో కొన్ని మార్పులు కూడా జరిగాయి. 
  • అన్ని హాస్పిటల్స్​లో ఎస్​టీపీ లేదా అటువంటి ట్రీట్మెంట్ ప్లాంట్ తప్పని సరి అని చెప్పింది. 
  • బయో వ్యర్థాలను తీసుకెళ్లే వెహికల్స్​కు తప్పనిసరిగా జీపీఎస్‌‌ ఉండాలి. 
  • ఏ ఆస్పత్రిలో ఎంత బయో చెత్త సేకరించారనేది కాంట్రాక్ట్‌‌ సంస్థ వెబ్‌‌సైట్‌‌లో ఉంచాలి. 
  • చెత్తను సేకరించే పనివారికి కచ్చితంగా వ్యాక్సిన్‌‌ వేయించాలి. వారికి గ్లౌజులు, ఎన్‌‌–95 మాస్కులు ఉండేలా చూసుకోవాలి. 
  • ఆయా రకాల చెత్తను తీసుకెళ్లే సంస్థలపై పీసీబీ అధికారుల పర్యవేక్షణ ఉండాలి. 
  • సేకరించిన చెత్తను 48 గంటల్లోగా డిస్పోజ్​ చేయాలి.

 

రంగుల డబ్బాలు

హాస్పిటల్స్​లో మాత్రల నుంచి పేషెంట్​ డ్రెస్, ట్రీట్మెంట్​కు సంబంధించిన వస్తువులను సేకరించడానికి ప్రత్యేక రంగుల డబ్బాలు ఉంటాయి. ఏ వేస్ట్​ని ఏ రంగు డబ్బాల్లో వేయాలో దానిపై ఉంటుంది. వాటిని అలాగే వాడాలి. 

హ్యూమన్ అనాటమీ వేస్ట్: పసుపు డబ్బా

రోగి నుంచి వచ్చిన బాడీ ఫ్లూయిడ్స్, డ్రెస్సింగ్‌‌ వేస్ట్, బ్యాగ్‌‌లు, రక్తంతో ఉన్న వేస్ట్, ఎక్స్‌‌పైరీ మందుల్ని హ్యూమన్ అనాటమీ వేస్ట్ అంటారు. వీటిని పసుపు రంగు డబ్బాల్లో మాత్రమే వేయాలి. తర్వాత  హై టెంపరేచర్​లో వాటిని డిస్పోజ్​ చేయాలి.


కంటామినేటెడ్‌‌ వేస్ట్‌‌: ఎరుపు డబ్బా

రోగికి వాడిన తర్వాత పడేయాల్సిన ట్యూబ్‌‌లు, యూరినల్‌‌ బ్యాగ్స్, సిరంజిలు, నీడిల్స్‌‌ వంటివి. వీటిని ఎరుపురంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్‌‌ లేదా మైక్రోవేవింగ్‌‌ హైడ్రోక్లావింగ్‌‌ పద్ధతుల్లోనే డిస్పోజ్​ చేయాలి. ఇందులో కొన్ని రీసైక్లింగ్‌‌ చేసినవి రోడ్డు నిర్మాణంలో వాడతారు. వీటిని లైసెన్స్ ఉన్న కాంట్రాక్టర్​కే ఇచ్చి రీ సైక్లింగ్‌‌ చేయాలి.

పదునైన పరికరాలు : తెలుపు డబ్బా 

నీడిల్స్, సిరంజిలు, నీడిల్‌‌ కట్టర్‌‌లు, బర్నర్‌‌లు, బ్లేడ్‌‌లు ఇవి పదునైనవి​, డేంజరస్. వీటిని లీకేజీ లేని తెలుపు రంగు డబ్బాలో మాత్రమే వేయాలి. ఈ వ్యర్థాలను ఆటోక్లావింగ్‌‌ లేదా డ్రైహీట్‌‌ స్టెరిలైజేషన్‌‌ పద్ధతిలో కాల్చేయాలి. పొల్యూషన్​ కంట్రోల్ బోర్డ్ గుర్తింపు ఉన్న సంస్థ ద్వారా డిస్పోజ్​ చేయాలి.

గ్లాస్‌‌వేర్‌‌ వేస్ట్‌‌ : నీలం డబ్బా

గాజు వస్తువులు, మెడిసిన్​ వయెల్స్ వంటివి. నీలం రంగు డబ్బాలో మాత్రమే వేయాలి. వీటిని తిరిగి వాడాలంటే డిటర్జెంట్‌‌ లేదా సోడియం హైపోక్లోరైడ్‌‌ ద్రావణంతో శుభ్రం చేయాలి.  ::: మనీష పరిమి