బొమ్మలకు ప్రాణం పోసింది

బొమ్మలకు ప్రాణం పోసింది

పేపర్ బొమ్మకు మాటలు చెప్తూ దాంతో ఆడుకుంటున్న కూతుర్ని చూసి మురిసిపోయింది రూత్. బొమ్మలతో.. ఆడుకోవడం మాత్రమే కాదు ఆలోచింపజేయొచ్చు కూడా అని అప్పుడే ఆమెకు అనిపించింది. పిల్లల్ని ఆకట్టుకునేలా అచ్చం మనుషుల్లాంటి బొమ్మలు తయారుచేయాలి అనుకుంది. ఎవరు అడ్డుచెప్పినా వినకుండా బొమ్మల తయారీ మొదలుపెట్టింది. అలా ఆమె తయారు చేసిన బొమ్మ పేరే ‘బార్బీ’. అచ్చం మనిషిలా ఉండడం కాదు, మనుషులే బార్బీ బొమ్మలా ఉండాలనుకునేంతగా పాపులర్ అయింది ఆ బొమ్మ.  బార్బీ గురించి ప్రపంచంలో తెలియని వారుండరు. ‘బొమ్మలతో కూడా ఇన్‌‌స్పైర్ చేయొచ్చు’ అని ప్రూవ్ చేసిన బార్బీ సృష్టికర్త రూత్ హ్యాండ్లర్ జర్నీ ఎలా మొదలైందంటే..

రూత్ హ్యాండ్లర్ అసలు పేరు రూత్ మాస్కో. 1916లో కొలరాడోలోని డెన్వర్‌‌‌‌లో పుట్టింది. తండ్రి రష్యన్ ఆర్మీలో కమ్మరిగా పని చేసేవాడు. ఆ తర్వాత రష్యా వదిలి అమెరికాకు  వచ్చాడు. పది మంది తోబుట్టువులు ఉన్న వాళ్ల ఫ్యామిలీలో రూత్ అందరికంటే చిన్నది. ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల రూత్ పైచదువులు చదవలేకపోయింది. హైస్కూల్ వరకూ చదివి ఆపేసింది. 19 ఏండ్ల వయసులో హాలీవుడ్ చూడడానికని వెళ్లి అక్కడే పారామౌంట్ కంపెనీలో సెక్రటరీగా ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత తన హైస్కూల్ ఫ్రెండ్ ఇలియట్ హ్యాండ్లర్‌‌‌‌ను 1938 లో  పెండ్లి చేసుకుంది. 

ఫర్నిచర్ కంపెనీ

రూత్ భర్త ఇలియట్‌‌కు చిన్న చిన్న వ్యాపారాలు ఉండేవి. అయితే రెండవ ప్రపంచయుద్ధం వల్ల బిజినెస్ పూర్తిగా నష్టం వచ్చింది. కూతురు పుట్టడంతో రూత్‌‌ కూడా ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. దాంతో కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. ఈలోగా రూత్‌‌కు కొడుకు పుట్టాడు. ఫ్యామిలీని పోషించడం కోసం ఇలియట్.. తన ఫ్రెండ్ మ్యాట్సన్‌‌తో కలిసి కాలిఫోర్నియాలో ఒక ఫర్నిచర్ బిజినెస్ పెట్టాడు.  ఇద్దరి పేర్లు కలిసేలా కంపెనీకి ‘మ్యాటెల్’ అని పేరు పెట్టాడు. అలా1945 లో మ్యాటెల్ ఫర్నిచర్ గ్యారేజ్ మొదలైంది. రూత్ కూడా బిజినెస్ బాధ్యతలను పంచుకుంది. ఫర్నిచర్ షాపులో సేల్స్ వుమన్‌‌గా పనిచేస్తూ.. ఇతర కంపెనీల నుంచి కాంట్రాక్టులు తీసుకొచ్చేది. అయితే కొంతకాలానికి కంపెనీకి నష్టాలు రావడంతో మ్యాట్సన్ కంపెనీ నుంచి తప్పుకున్నాడు. దాంతో రూత్ కంపెనీకి కో ఓనర్‌‌‌‌గా మారింది. ఇకపై ట్రెడిషనల్ ఫర్నిచర్‌‌‌‌కు బదులుగా క్రియేటివ్‌‌గా ఉండే చిన్న ఫర్నిచర్ వస్తువులను తయారుచేయమని ఇలియట్‌‌కు సలహా ఇచ్చింది. అలా మ్యాటెల్ కంపెనీ.. ఫొటో ఫ్రేములు, చిన్న గిటార్‌‌‌‌లు తయారుచేయడం మొదలుపెట్టింది. 

తుపాకీతో మొదలై...

మ్యాటెల్ కంపెనీ డిజైనింగ్, మార్కెటింగ్ పనులన్నీ దగ్గరుండి చూసుకునేది రూత్. 1955లో మ్యాటెల్ కంపెనీ మొదటిసారి ఒక బొమ్మ తుపాకీని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అలాంటి ఆట బొమ్మలు అప్పట్లో కొత్త.  అందుకే ఆ బొమ్మ అంతగా సక్సెస్ అవ్వలేదు. ఆ బొమ్మ పెద్దవాళ్లకు నచ్చకపోయినా పిల్లలకు నచ్చుతుందని రూత్ నమ్మింది. తన మార్కెటింగ్ స్కిల్స్ ఉపయోగించి పిల్లలకు ఆ బొమ్మ గురించి తెలిసేలా చేసింది.  అప్పట్లో ఫేమస్ అయిన మిక్కీ మౌస్ టీవీ షోలో బొమ్మ తుపాకీ అడ్వర్టైజ్‌‌మెంట్ ఇచ్చింది.  అది చూసిన పిల్లలందరూ అలాంటి బొమ్మ కావాలని అడగడం మొదలుపెట్టారు. దాంతో బొమ్మ సేల్స్ అమాంతం పెరిగాయి. ఆ సక్సెస్‌‌ తర్వాత రూత్‌‌కు అడ్వర్టైజ్‌‌మెంట్, మార్కెటింగ్ విలువ తెలిసింది. మ్యాటెల్ కంపెనీ ఆస్తులన్నింటినీ అడ్వర్టైజ్‌‌మెంట్స్ కోసమే ఖర్చు చేసేది. 

జోక్ అన్నారు 

మ్యాటెల్ కంపెనీ తయారుచేసిన టాయ్స్‌‌ బాగా సక్సెస్ అవ్వడంతో కంపెనీ పూర్తిగా బొమ్మలపైనే ఫోకస్ పెట్టింది. ఆటబొమ్మలు, బట్టలు, డెకరేటివ్ వస్తువులు లాంటివి ఎక్కువగా తయారుచేయడం మొదలుపెట్టారు. అయితే ఒక రోజు రూత్.. తన కూతురు బార్బారా పేపర్ బొమ్మతో ఆడుకుంటూ దానితో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయింది. అప్పటి మార్కెట్లో  ప్లాస్టిక్ పిల్లల బొమ్మలు, తల్లీపిల్లల బొమ్మలు మాత్రమే ఉండేవి. వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ‘ఆడపిల్లలు ఇండిపెండెంట్‌‌గా ఉండాలని చెప్పేలా రకరకాల టీనేజ్ అమ్మాయిల బొమ్మలు ఎందుకు తయారుచేయకూడదు?’ అనుకుంది. ఇదే విషయాన్ని  కంపెనీ బోర్డ్ మెంబర్స్‌‌కి, అడ్వర్టైజ్‌‌మెంట్ ఏజెన్సీలకు చెప్పింది. ‘బొమ్మల క్యారెక్టర్లు ఆడపిల్లల్ని ఇన్‌‌స్పైర్ చేసేలా మనం కొత్తరకం బొమ్మల్ని తయారుచేద్దాం’ అని చెప్పింది. అక్కడున్నవాళ్లు ‘ఈ కాన్సెప్ట్ సక్సెస్ అయ్యే అవకాశమే లేదు’ అని అన్నారు. ఆ కమిటీలో రూత్ తప్ప ఆడవాళ్లెవరూ లేరు. అందరూ ‘ఆ కాన్సెప్ట్.. ఒక జోక్‌‌లా ఉంది’ అని అన్నారు. పిల్లలకు పిల్లల బొమ్మలు లేదా అమ్మ బొమ్మలు మాత్రమే నచ్చుతాయని అన్నారు. కానీ, ఆమెకు తన ఆలోచన మీద పూర్తి నమ్మకముంది. వాళ్ల మాటలు లెక్కచేయకుండా బట్టల ద్వారా కంపెనీకి వచ్చే ఆదాయంతో బొమ్మలు చేయమని ‘ఆర్‌‌‌‌ అండ్ డి’ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెప్పింది. బొమ్మ ఎలా ఉండాలో, ఏ మెటీరియల్ వాడాలో డిజైన్‌‌తో సహా ప్లాన్ ఇచ్చింది. అలా 11 అంగుళాల టీనేజ్ అమ్మాయి బొమ్మ తయారైంది. దానికి రూత్ తన కూతురు పేరు వచ్చేలా ‘బార్బీ’ అని పేరు పెట్టింది. 

నెగెటివ్ కామెంట్స్ 

బార్బీ బొమ్మను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ బోర్డ్​ మెంబర్లు ఒప్పుకోలేదు. టీనేజ్ అమ్మాయి బొమ్మతో పిల్లలు ఆడుకోవడమేంటి అన్నారు. కంపెనీ బోర్డ్​ మెంబర్లని ఒప్పించడానికి రూత్‌‌కు మూడేండ్లు పట్టింది. అలా 1959 లో న్యూయార్క్‌‌లోని ‘ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్‌‌’‌‌లో  మొదటి బార్బీ బొమ్మ మార్కెట్లోకి వచ్చింది. కొన్ని రోజుల్లోనే అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొంత కాలానికి బార్బీ బొమ్మలపై కాంట్రవర్సీలు వచ్చాయి. టీనేజ్ అమ్మాయిల్లా కనిపించే బార్బీ బొమ్మలు పిల్లల తల్లులకు నచ్చేవి కావు. ‘ఇవి పిల్లల బొమ్మలు కాదు, మగవాళ్ల కోసం చేసిన బొమ్మలు’ అనేవాళ్లు. చాలామంది వాటిని కొనేందుకు, వెంట తీసుకెళ్లేందుకు ఒప్పుకునే వాళ్లు కాదు. బార్బీ బొమ్మలపై నెగెటివ్ కామెంట్స్ రావడంతో రూత్ మరోసారి తన మార్కెటింగ్ స్కిల్స్‌‌ వాడింది. బార్బీ బొమ్మను ఒక నిజమైన అమ్మాయిలా చూపిస్తూ మరొక అడ్వర్టైజ్‌‌మెంట్ చేసింది. అది చూసి పిల్లలు బార్బీ బొమ్మల కోసం మారాం చేసేవాళ్లు.  అలా బార్బీ బొమ్మలు ఫామ్‌‌లోకి వచ్చాయి. అలా మొదటి ఏడాదే మూడు లక్షలకు పైగా బార్బీ బొమ్మలు అమ్ముడయ్యాయి. 

అందమైన బొమ్మగా..

తక్కువ సమయంలోనే బార్బీ దేశవిదేశాల్లోకి పాకిపోయింది. బొమ్మల ఇండస్ట్రీని బార్బీ పూర్తిగా మార్చేసింది. చాలామంది బార్బీలా కనిపించాలని మేకప్ వేసుకునే వాళ్లు. పిల్లల నుంచి పెద్దల వరకు బార్బీకి ఎంతోమంది ఫ్యాన్స్‌‌ అయ్యారు. అలా ఐదేండ్లలోనే మ్యాటెల్ కంపెనీ ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో చోటు సంపాదించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ బార్బీ బొమ్మలకు ఎదురేలేదు. ప్రపంచంలోనే అందమైన బొమ్మగా బార్బీ పేరు మారుమోగింది. ఇప్పటికీ ప్రతి మూడు సెకన్లకు ఒక బార్బీ బొమ్మ అమ్ముడవుతుందంటే రూత్ ఆలోచన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మ్యాటెల్ కంపెనీ నెట్‌‌వర్త్ సుమారు 900 మిలియన్ డాలర్లు. మ్యాటెల్ కంపెనీకి బార్బీ లాంటి ఇరవై బ్రాండ్స్ ఉన్నాయి. బొమ్మలతో పాటు డిజిటల్ గేమ్స్, పిల్లల వెహికల్స్, మ్యూజిక్, ఫిల్మ్స్ లాంటి రకరకాల బిజినెస్‌‌లు ఉన్నాయి. కంపెనీలో సుమారు 36 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

ఎన్ని క్యారెక్టర్లో!

బార్బీ బ్రాండ్ మరింతగా జనాల్లోకి చొచ్చుకుపోవడానికి రూత్ రకరకాల ప్రయోగాలు చేసింది. బార్బీకి  ఏడుగురు తోబుట్టువులను క్రియేట్ చేసింది. వాళ్ల పేర్లు స్కిప్పర్, స్టాసీ, షెల్సియా, క్రిస్సీ, కెల్లీ, ట్యూటి, టాడ్. అలాగే బార్బీ రకరకాల కొత్త అవతారాల్లో కనిపిస్తూ అన్ని తరాల పిల్లలను ఆకట్టుకుంటూ వచ్చింది. స్టూడెంట్, నర్స్, డాక్టర్,  మోడల్‌‌, డాన్సర్‌‌, ఆస్ట్రోనాట్, రోబోటిక్‌‌ ఇంజినీర్‌‌, జర్నలిస్ట్‌‌ ఇలా ఒక్కటేంటి  దాదాపు 200 రకాలుగా అవతారాలెత్తింది బార్బీ. ప్రపంచవ్యాప్తంగా బార్బీ బొమ్మలు సేకరించేవాళ్లు వేల సంఖ్యలో ఉన్నారంటే బార్బీ ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఆక్వా అనే ఆర్టిస్ట్ చేసిన ‘బార్బీ గర్ల్’ పాట ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.  “పిల్లలు పెద్దయ్యాక తమను ఎలా చూసుకోవాలి అనుకుంటారో అలాంటి బొమ్మలు చేయాలన్నదే నా ఆలోచన. బొమ్మల ద్వారా పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచొచ్చని నేను నమ్మా’’ అని రూత్ తన బయోగ్రఫీలో రాసుకొచ్చింది. ఒక ఇన్‌‌స్పైరింగ్ ఆలోచనకు క్రియేటివిటీ, తెలివితేటలు తోడైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా సక్సెస్ అవ్వొచ్చు అని ప్రూవ్ చేసింది రూత్. తన జర్నీ నుంచి ఈ జనరేషన్ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.

చీరకట్టుతో..

1959లో అమ్మిన మొదటి బార్బీ బొమ్మ ధర మూడు డాలర్లు. ఈ బొమ్మ పూర్తి పేరు ‘బార్బరా మిల్లి సెంట్‌‌ రాబర్ట్స్‌‌’. మొట్టమొదటి బార్బీ నలుపు తెలుపు స్విమ్‌‌సూట్‌‌లో ఉంటుంది. బార్బీ 1965 లో అంతరిక్షంలోకి కూడా వెళ్లింది. బార్బీ మన చీరకట్టులో కూడా మెరిసింది. అప్పట్లో పెళ్లికూతురులా కనిపించి మురిపించింది. అదొక్కటే కాదు దాదాపు 40 దేశాల సంప్రదాయాల్లో బార్బీ కనిపించింది. బార్బీ వివరాలతో ఓ పుస్తకం ఉంది. దాని పేరు ‘ద వరల్డ్‌‌ ఆఫ్‌‌ బార్బీ’. 1997లో వీల్‌‌చెయిర్‌‌ బార్బీని తయారుచేశారు. దివ్యాంగులైన పిల్లల్లో కాన్ఫిడెన్స్‌‌ నింపడానికి ఈ వీల్‌‌చెయిర్‌‌ బార్బీ బొమ్మను తయారుచేశారు.