వైరల్ వీడియో: కరోనా పరిస్థితిపై మహిళా డాక్టర్ కన్నీళ్ల పర్యంతం

వైరల్ వీడియో: కరోనా పరిస్థితిపై మహిళా డాక్టర్ కన్నీళ్ల పర్యంతం

ముంబై: కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువ సంఖ్యలో ఉంది. ఇలాంటి సమయంలో పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందిస్తున్న హెల్త్ ‌వర్కర్స్‌‌ను మెచ్చుకోకుండా ఉండలేం. అలాంటి ఓ డాక్టర్ ప్రస్తుత కొవిడ్ పరిస్థితిని గురించి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు ఇన్‌స్టాలో షేర్ చేసింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి మన జీవితాలను కాపాడుతన్న హెల్త్‌కేర్ వర్కర్స్‌‌కు అండగా ఉందామని ఈ వీడియోకు బిపాషా క్యాప్షన్ జత చేసింది.  

వీడియోలో డాక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితి గురించి తీవ్ర ఆందోళనకరంగా ఉందని తెలిపింది. ‘నేను కొన్ని సూచనలు చేయాలనుకుంటున్నా. ఈ సమయంలో ఇవి అందరికీ ఉపయోగపడతాయి. ముంబై పరిస్థితి చాలా దారుణంగా ఉంది. క్రమంగా అన్ని నగరాలు, పట్టణాల పరిస్థితి ఇలాగే మారుతోంది. ముంబైలో అయితే పేషెంట్లకు బెడ్లు లేవు. ఇది నిస్సహాయ స్థితి. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదు. యువతనూ మహమ్మారి వదలట్లేదు. కరోనా మన చుట్టూరా ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో ఉన్నా మాస్క్ కట్టుకోండి. కరోనా వచ్చి పోయిన వారికి కూడా తిరిగి సోకదని గ్యారెంటీ ఇవ్వలేం. కరోనా లక్షణాలు కనిపిస్తే భయపడకండి. చాలా మంది కరోనా పేషెంట్లు ఆరోగ్యంగా ఉన్నా భయపడి ఆస్పత్రుల్లో జాయిన్ అవుతున్నారు. దీంతో హెల్త్ విషమంగా ఉన్న రోగులకు ట్రీట్‌మెంట్ అందించలేకపోతున్నాం. అందుకే అవసరమైన వారికి బెడ్లు ఇవ్వాలి. అదే సమయంలో పక్కాగా టీకా తీస్కోండి. రెండు డోసుల టీకా తీసుకున్న వారిలో ఇన్ఫెక్షన్ రేటు పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందుతున్న వారి కోసం ప్రార్థించండి’ అని ఆమె కోరింది.