పక్షులు, జంతువులతో..  ప్రాక్టికల్ గా పాఠాలు

పక్షులు, జంతువులతో..  ప్రాక్టికల్ గా పాఠాలు

పర్యావరణంపై స్టూడెంట్స్ కు అవగాహన పెంచుతున్న బర్డ్‌‌ మ్యాన్‌‌

గురుదక్షిణగా మొక్కలు నాటమని చెబుతున్న బర్డ్ మ్యాన్ 

అతను స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే మాష్టారు కాదు. మొక్కల పెంపకం గురించి, నేర్పించే మాష్టారు. అడవుల్లో తరిగిపోతున్న చెట్ల గురించి. చెట్లు లేకపోవడంతో మనుగడకు దూరమవుతున్న వన్యప్రాణుల గురించి చెప్తారు. దుండిగల్ లో ఏర్పాటు చేసిన రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా స్టూడెంట్స్‌‌కు జంతువులు, పక్షులు, మొక్కలను చూపించి సరికొత్త పాఠాలు నేర్పుతున్నారు. గురుదక్షిణగా మొక్కలు నాటమని చెబుతున్నారు. ఇలా ఏటా 20 వేల మంది పిల్లలతో మొక్కలు నాటిస్తున్నారు. ఆయనే ‘బర్డ్ మ్యాన్’గా పాపులరైన నందకిషోర్ రెడ్డి.

మనుషుల స్వార్ధానికి అడవులు బలైపోతున్నాయి. ఆ అడవులనే నమ్ముకున్న వన్యప్రాణులు..డేంజర్ లో పడుతున్నాయి. అడవుల్లో చెట్లు కొట్టుకుంటూ పోతే వన్యప్రాణుల పరిస్థితి ఏంటి? రెక్కలు విప్పార్చి కొమ్మమీద కూర్చునే అదృష్టం పక్షికి లేదా? చెట్టు కింద సేద తీరాలనే కోరిక జంతువుకు ఉండదా? ఆలోచించండి.. మొక్కలు నాటండి.. వన్యప్రాణులను కాపాడండి..’ అంటున్న నందకిషోర్‌‌‌‌ని ‘లైఫ్‌‌’ పలకరించింది.

రిహాబిలిటేషన్ సెంటర్ లక్ష్యమేంటి?

లైఫ్ అంటే సంపాదించడం కాదు.. సాధించడం. అది కూడా మన కోసం కాదు.. భవిష్యత్ తరాలకోసం. ఇదే లక్ష్యంతో జాబ్ వదిలి.. రాగా ఫౌండేషన్ ను స్థాపించాను. మూగజీవాల గురించి పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో దుండిగల్‌‌లో 5 ఎకరాల్లో రిహాబిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశాను. ఇక్కడ చాలా రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. ఇక్కడకొచ్చే స్టూడెంట్స్.. వీటిని టచ్ చేసి సరికొత్తగా పాఠాలు నేర్చుకుంటున్నారు.

ఏ స్టూడెంట్స్ ఇక్కడకు ఎక్కువగా వస్తుంటారు?

స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఎమ్ ఎస్ సి , బీఎస్ సి చదివే స్టూడెంట్స్ ఇక్కడకు వస్తుంటారు. స్కూళ్ళ నుంచి వచ్చే పిల్లలను టీచర్లే దగ్గరుండి తీసుకొస్తారు. అప్పటివరకు పుస్తకాల్లోనే జంతువులు, పక్షుల గురించి తెలుసుకున్న వాళ్లు ఇక్కడకు వచ్చిన తర్వాత.. వాటిని తాకడంతో అవి ఎలా నడుస్తాయి.. ఎలా ఎగురుతాయి అనే విషయాలు నేర్చుకుంటారు. సైన్స్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో చాలా అంశాలు నేర్చుకుంటారు.

రీప్లాంటేషన్ ఎక్కడెక్కడ చేస్తుంటారు?

నరసాపూర్ అడవుల్లో ఎక్కువగా మొక్కలను నాటుతుంటాం. అడవులకు రాలేకపోయిన పిల్లలతో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పది చెట్లు నాటాలనే టార్గెట్ పెడుతుంటాను. ఇలా నాటుకుంటూ వెళితే ఇంకొందరిలోనైనా మొక్కలు నాటాలనే పట్టుదల పెరుగుతుందనే ఆశ.

బర్డ్ మ్యాన్ గా పాపులర్ ఎలా అయ్యారు?

నాకు చిన్నప్పటి నుంచి పిట్టలంటే చాలా ఇష్టం. కాని పిట్టలను పెంచాలంటే చాలా కేర్ అవసరం. లేదంటే అవి చనిపోయే ఛాన్స్ ఎక్కువ. అందుకే వాటి గురించి ఫుల్‌‌గా స్టడీ చేశాను. వాటికి కావాల్సిన క్లైమేట్ ఎరేంజ్ చేశాను. మా రిహాబిలిటేషన్ సెంటర్ లో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్, హస్ అమెరికన్ బర్డ్స్ వంటి ఎన్నో రకాల పక్షులు ఫుల్ ప్రోటోకాల్‌‌తో పెరుగుతున్నాయి. దాంతో పాటు బెల్జియం, ఆస్ట్రేలియాలో బర్డ్స్ కేర్ పై స్పెషల్ స్పీచెస్ ఇచ్చాను. వర్క్ షాప్ లు కూడా కండక్ట్ చేశాను. దీనివల్లే అందరూ నన్ను ‘బర్డ్ మ్యాన్’ అని పిలుస్తుంటారు.

బర్డ్స్ స్పెషల్ కేవ్స్ ఎక్కడ డిజైన్ చేస్తున్నారు?

పిట్టలు హ్యాపీగా ఉండాలంటే వాటికి ప్రత్యేకమైన కేవ్స్ ఉండాలి. వాటిని స్పెషల్ గా డిజైన్ చేయాలి. ప్రస్తుతం నేను నెహ్రూ జూ పార్క్ లో పిట్టల కోసం కొత్త కేవ్స్ డిజైన్స్ చేస్తున్నాను. అక్కడకొచ్చే కొత్త పిట్టల కేరింగ్ బాధ్యత కూడా నాదే. అలాగే.. ఇండోర్ సిటీలో నిర్మిస్తున్న కొత్త  జూ పార్క్ లో బర్డ్ సెక్షన్ కు కూడా ప్రస్తుతం నేను ఇంఛార్జ్ గా ఉన్నాను. అక్కడ సరికొత్తగా బర్డ్స్ కేవ్స్ డిజైన్ చేస్తున్నాను.

రాగా ఫౌండేషన్ ఎలా రన్ చేస్తుంటారు?

నా సొంత డబ్బులతోనే దీన్ని నడుపుతున్నాను. ఎటువంటి విరాళాలు, నిధులు నేను తీసుకోను. రొటేషన్ అనేది నేను చేస్తుంటాను. నేను జాబ్ చేసినప్పుడే కొంత డబ్బు ఇన్వెస్ట్‌‌ చేశాను. అవే నాకు మంత్లీ వస్తుంటాయి. ఇక రిహాబిలిటేషన్ సెంటర్ కు వచ్చిన వాళ్లు, పిట్టలను కావాలని డబ్బులిచ్చి తీసుకెళ్లేవారి వల్ల.. కొంత డబ్బు వస్తుంది. వాటిని జంతువులు, పిట్టల ఫుడ్ కోసం వాడుతుంటాను. ఈ ఫౌండేషన్‌‌ను నాలెడ్జ్ పాస్ చేయాలనే ఉద్దేశంతోనే పెట్టాను. దీనిద్వారా కొంతమందిలోనైనా క్లైమేట్ ను కాపాడాలన్న ఆలోచన వస్తుందనే నమ్మకం.-ఇందిరా రామ్

రాగా ఫౌండేషన్ పెట్టడానికి కారణం?

మనం చూస్తూ ఉండగానే చాలా ప్రాణులు అంతరించిపోతున్నాయ్. దీనికి కారణం వాటికి ఆవాసాలు లేకపోవడమే. అడవులు నరికివేసుకుంటూ వెళ్ళిపోతే వాటినే నమ్ముకుని బతికే ప్రాణుల పరిస్థితి ఏంటి? అందుకే అడవుల్లో మొక్కలను నాటాలని లక్ష్యంగా చేసుకున్నాను. కాని అది నా ఒక్కడి వల్ల కాదు. అందుకే రాగా ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా అడవుల్లో రీప్లాంటేషన్ చేస్తున్నాను. ఇందులో స్టూడెంట్స్‌‌  పార్టిసిపేట్‌‌ అయ్యేలా చేస్తుంటాను. రిహాబిలిటేషన్ సెంటర్ కు వచ్చే పిల్లలతో మొక్కలు నాటాలనే ప్రామిస్ చేయించుకుంటాను. స్కూళ్లకు వెళ్లి మొక్కలు నాటితే ఎంత లాభముందో పిల్లలకు వివరిస్తాను. అలా ఇప్పటివరకూ ఏటా 20 వేల మొక్కల వరకూ నాటగలుగుతున్నాము.