బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో బిర్సా ముండా జయంతి వేడుకలు

బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో బిర్సా ముండా జయంతి వేడుకలు

ఇయ్యాళ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్  తో సహా ప్రముఖ రాజకీయ నేతలు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ స్టేట్ ఆఫీస్ లోనూ బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో మాజీ మంత్రి రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తో పాటు పలువురు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ క్రమంలోనే బిర్సా ముండా సేవలను నేతలు కొనియాడారు.

భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాద శక్తులను తరిమికొట్టేందుకు ఎంతో మంది పోరాటం చేశారని బీజేపీ నాయకులు అన్నారు. గిరిజనులపై వేసిన పన్నులు, దోపిడీని అడ్డుకునేందుకు బిర్సా ముండా పోరాటం చేశారని చెప్పారు. బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఎదిరించాడని, ఇప్పటికీ ఆదివాసీ ప్రాంతాల్లో మతమార్పిడి జరుగుతుందన్నారు. మత మార్పిడి దేశసమగ్రతకు ముప్పని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందన్న నేతలు...  ముండా రాజ్ ను ఏర్పాటు చేసి బ్రిటీష్ వారిని తరిమేసేందుకు యువకులను సైనికులుగా నియమించారని తెలిపారు. ఆయన బాటలో నడిచి  జాతి సమైక్యత కోసం మనమంతా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.