
న్యూఢిల్లీ: బ్రెజిల్‌లో ఓ ఖైదీ తనను ఉంచిన సెల్ డోర్ నుంచి పారిపోబోయి కన్నంలో ఇరుక్కున్నాడు. వివరాలు.. బల్నీరియో పికార్రస్ జైలులో 18 ఏళ్ల ఒక ఖైదీ ఎస్కేప్ ప్లాన్ వేశాడు. తనను ఉంచిన గది కన్నంలో నుంచి పారిపోవడానికి యత్నించాడు. అది కుదరకపోవడంతో అందులో నుంచి బయటపడాలని చూశాడు. కానీ దానిలోనే ఇరుక్కుపోయాడు. దీంతో జైలు సిబ్బంది ఫైర్‌మెన్‌ను పిలిపించారు. ఫైర్‌మన్ సిబ్బంది హైడ్రాలిక్ టూల్ వినియోగించి సదరు టీనేజర్‌ను బయటికి తీశారు. ఫైర్‌మెన్ సిబ్బందిలో ఒకరు హైడ్రాలిక్ టూల్‌ను వినియోగించగా, మరొకరు అతడ్ని గైడ్ చేశారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే పారిపోవడానికి యత్నించిన సదరు ఖైదీని జైలులో ఉంచి రెండు గంటలు కూడా కాలేదట. ఒక షాపులో నుంచి 270 బ్రెజిలియన్ రీల్స్‌ను దొంగిలించాడనే నేరంపై పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.