
- 20న లేదా నాలుగోవారంలో ప్రారంభిస్తామన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో నిర్ణయం
- 17న విమోచన దినోత్సవం నిర్వహించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రైతు సమస్యలు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టనున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ కాని రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అందరికీ రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలు తీర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రైతు దీక్ష చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
పార్టీ నేతలతో చర్చించాక తేదీ ఫిక్స్ చేసుకుంటామని, ఈ నెల 20న లేదంటే ఆ వారంలో దీక్ష చేపడుతామన్నారు. మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన గురువారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా 10 అంశాలపై చర్చించగా, ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని నిర్ణయించారు. అనంతరం ఆ పార్టీ నేతలతో కలిసి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఎంపీలు, ఎమ్మెల్యేల కోఆర్డినేటర్‌గా లక్ష్మణ్
బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కోఆర్డినేట్ చేసే బాధ్యతను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌కు అప్పగించాలని బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయించారు. ఎల్పీ నేత ఏలేటితో చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని డిసైడ్ అయ్యారు. బీజేపీకి, ఎమ్మెల్యేలకు మధ్య ఉన్న గ్యాప్‌పైనా సమావేశంలో చర్చించారు. పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతినెలా ఎల్పీ సమావేశం పెట్టుకోవాలని నిర్ణయించారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, ఆలయ భూములను పరిరక్షించడంపై పోరాటాలు చేయాలని డిసైడ్ అయ్యారు. సభ్యత్వ డ్రైవ్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ పాల్గొనాలని, ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసేలా కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్, ఈటల, గోడెం నగేశ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, హరీశ్ బాబు, రామారావు పాటిల్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
ఓల్డ్ సిటీ అంటే ఎందుకంత భయం: అర్వింద్
అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఓల్డ్ సిటీకి వెళ్లాలంటే సీఎం రేవంత్ కు ఎందుకంత భయమని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రాను సెక్యులర్‌గా నడిపించాలని, ప్రణాళిక రెండ్రోజులకు ఓసారి మారకూడదని అన్నారు. చెరువులు నిండితే నీళ్లు మూసీలోకి పోతయని, మూసీకి ఇరువైపులా ఉన్న నిర్మాణాలను కూలగొడతామనడం విడ్డూరంగా ఉందన్నారు.