శివరాజ్ సింగ్ విజయం సాధించగలరా?.. మధ్యప్రదేశ్​లో అమీతుమీ

శివరాజ్ సింగ్ విజయం సాధించగలరా?..  మధ్యప్రదేశ్​లో అమీతుమీ

మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ చాలా కీలకమైంది. 2000 సంవత్సరం వరకు మధ్యప్రదేశ్ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే దాదాపు రెట్టింపు పరిమాణంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉండేది. విస్తీర్ణంలో ఇది చాలా పెద్దది. మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక ఛత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మధ్యప్రదేశ్ దాని ప్రాముఖ్యతను కోల్పోలేదు. మధ్యప్రదేశ్‌‌‌‌లో సుమారు 54 రాచరికపు రాష్ట్రాలు ఉండేవి. గ్వాలియర్ ఆఫ్ సింధియాస్,  భోపాల్ నవాబులుతో పాటు చాలా ముఖ్యమైన రాజులు పాలించేవారు. ప్రస్తుతం చాలామంది మాజీ రాజులు రాజకీయ నాయకులుగా మారి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా తమ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

రాజకీయ బలాబలాలు

మధ్యప్రదేశ్‌‌‌‌లో 29 లోక్​సభ నియోజకవర్గాలు, అదేవిధంగా శాసనసభకు సంబంధించి 230  అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ త్రుటిలో ఓడించి అధికారాన్ని సాధించింది. కాంగ్రెస్ ​పార్టీ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే. అనతికాలంలోనే అంతర్గత కలహాల కారణంగా కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో మధ్యప్రదేశ్​లో అధికారాన్ని కాంగ్రెస్​ పార్టీ నుంచి బీజేపీ హస్తగతం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్​ మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.  ఆయన గత 20 సంవత్సరాలుగా మధ్యలో 18 నెలల మినహాయిస్తే సీఎం పదవిలో ఉంటున్నారు . 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ కాంగ్రెస్​ చేతిలో ఓటమిపాలై తక్కువ స్థానాల్లో గెలుచుకున్నప్పటికీ, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయఢంకా మోగించింది. ఎంపీలోని 29 లోక్‌‌‌‌సభ స్థానాలకు గాను 28 స్థానాలను గెలుచుకుని బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. 

ఎంపీలో కాంగ్రెస్ పరిస్థితి ఇదీ..

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాథ్ 1980లో లోక్​సభ ఎంపీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 7వ లోక్​సభకు తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 1984లో  8వ లోక్​సభ, 1989లో 9వ లోక్​సభకు వరుసగా ఎంపీగా ఎన్నికై హ్యాట్రిక్​ కొట్టారు. ఆ తర్వాత ఎంపీగా కమల్​నాథ్​ విజయ పరంపర కొనసాగించారు. అయితే 2018లో మధ్యప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 2020వరకూ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్​ శాసనసభలో విపక్ష నేతగా ఉన్నారు.  కమల్ నాథ్ వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఉదారత ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు. తాజాగా జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కమల్​నాథ్​ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. మరో కాంగ్రెస్​ సీనియర్​ నేత,  మాజీ  ముఖ్యమంత్రి, దిగ్విజయ్ సింగ్  కూడా హస్తం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే, దిగ్విజయ్ సింగ్ నుంచి ​కమల్‌‌‌‌నాథ్‌‌‌‌కు ఎలాంటి ముప్పు లేదు. కాగా, కాంగ్రెస్​పార్టీ 2018 ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచినా అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయింది. బీజేపీ ఎత్తుగడ ఫలించి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉంది.  కాంగ్రెస్  నాయకులు విస్తృతంగా  ప్రచారం చేస్తున్నారు. అయితే, మధ్యప్రదేశ్‌‌‌‌లో గాంధీలకు స్థానికంగా ఎలాంటి పట్టు లేకపోవడంతో వారి ప్రభావం పెద్దగా లేదు. మరోవైపు కేవలం 18 నెలల గ్యాప్‌‌‌‌ తప్ప 20 ఏండ్లుగా బీజేపీ మధ్యప్రదేశ్‌‌‌‌ను నిరంతరం పాలిస్తున్నదని కాంగ్రెస్ కూడా చెబుతోంది. మధ్యప్రదేశ్​లో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్  ప్రచారం చేస్తోంది.

మధ్యప్రదేశ్‌‌‌‌లో కమలం పార్టీ వ్యూహాలు

మధ్యప్రదేశ్ బలమైన హిందూహార్ట్‌‌‌‌ ల్యాండ్ రాష్ట్రం. సహజంగానే మధ్యప్రదేశ్‌‌‌‌లో బీజేపీకి బలమైన పునాది ఉంది. పటిష్టమైన క్యాడర్​ కూడా ఉంది. అంతేకాదు, ఇంతకు ముందు 54 మంది రాజులు ఏలిన రాచరికపు చరిత్ర కూడా బీజేపీకి సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఒకప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్‌‌‌‌గాంధీల కాలంలో కాంగ్రెస్‌‌‌‌కి రాజులతో మంచి సంబంధాలుండేవి. కానీ, సోనియాగాంధీ, రాహుల్‌‌‌‌ గాంధీ ఆ రాజకీయ సంప్రదాయాన్ని నిలబెట్టుకోలేదు. 20 ఏండ్లుగా బీజేపీ మధ్యప్రదేశ్​ను పాలిస్తున్న మాట వాస్తవమేనని, దీంతో బీజేపీ సర్కారుపై అధికార వ్యతిరేకత తీవ్రంగా ఉందన్న వాదన వినిపిస్తున్నది. కానీ,  కాంగ్రెస్‌‌‌‌ పార్టీలో కూడా కొత్త ముఖాలు ఆ రాష్ట్ర ప్రజలకు కనిపించడం లేదు. కమల్‌‌‌‌నాథ్‌‌‌‌, దిగ్విజయ్‌‌‌‌ సింగ్‌‌‌‌ 45 ఏండ్ల నుంచి అక్కడే ఉన్నారు. అధికార వ్యతిరేకత ఉన్న విషయాన్ని బీజేపీ హైకమాండ్​కూడా పసిగ‌‌‌‌ట్టింది.  అందుకే  కమలం పార్టీ నలుగురు కేంద్ర మంత్రులతోపాటు, ముగ్గురు బీజేపీ ఎంపీల‌‌‌‌ను శాసన సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీకి దింపింది. ఈనేపథ్యంలో సహజంగానే మధ్యప్రదేశ్‌‌‌‌లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్వాలియర్ మాజీ మహారాజుల వంశానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. బీజేపీకి మెజారిటీ వచ్చేలా సింధియాకు ఉన్న ఇమేజ్​ సహకరిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్​ఎన్నికల బరిలో ప్రధానంగా కాంగ్రెస్​, బీజేపీ పార్టీలే పోటీపడుతున్నా.. సమాజ్‌‌‌‌వాదీ, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ఇతర  ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. తమకు బీసీ ముఖ్యమంత్రి ఉన్నారని బీజేపీ చెబుతున్నది.

కమల్ నాథ్​పై కాంగ్రెస్​ ఆశలు

కమల్ నాథ్ 1980 నుంచి కాంగ్రెస్​ ఎంపీగా ఉన్నారు. ఆయనకు ప్రజలలో మంచి పాపులారిటీ ఉంది. మధ్యప్రదేశ్‌‌‌‌లో గాంధీ కుటుంబం కేవలం ఎన్నికల ప్రచారానికి పరిమితమైంది. మధ్యప్రదేశ్ హిందీ రాష్ట్రమని అందరికీ తెలుసు. అక్కడ గాంధీలకు అంతగా చెప్పుకోదగ్గ డిమాండ్ లేదు. సుదూర దక్షిణ భారతదేశంలో మాత్రమే గాంధీలను ఎన్నికలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కమల్ నాథ్ ఈసారి బలమైన నాయకులను ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టారు. ఆయన స్నేహపూర్వక, రాజీ స్వభావం కారణంగా కాంగ్రెస్​లో పెద్దగా తిరుగుబాట్లు కనిపించడం లేదు.

సీనియర్లు హోరాహోరీ

మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో సీనియర్​ నేతలు హోరాహోరీగా పోరాడుతున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్​ చౌహాన్, మాజీ ముఖ్యమంత్రులు కమల్‌‌‌‌నాథ్, దిగ్విజయ్ సింగ్‌‌‌‌లకు 75 ఏండ్లు పైబడిన నాయకులు. బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ రెండు పార్టీల్లోనూ కొత్త ముఖం లేదు. యువతకు  సీనియర్​ నాయకులు భరోసా ఇచ్చారు. జ్యోతిరాదిత్య సింధియాకు 53 ఏండ్లు, రాహుల్ గాంధీకి 55 ఏండ్లు కానీ ఈ ఇద్దరు నాయకులను రాజకీయాల్లో "యువత" అనే పిలుస్తారు. వాస్తవానికి భారతదేశపు రాజకీయాల్లో వయస్సు పట్టింపు లేదు. ప్రఖ్యాత తమిళ నటుడు, రాజకీయ నాయకుడైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్​ 30 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు  జయలలిత  జన్మించింది. ఎంజీఆర్‌‌‌‌కి 50 ఏళ్లు వచ్చేసరికి జయలలితతో కలిసి హాఫ్ ప్యాంట్‌‌‌‌లో కాలేజీ స్టూడెంట్‌‌‌‌గా నటించడం మొదలుపెట్టారు. దీనిపై ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అంటే రాజకీయ నేతలకు వయసు ఆటంకం కాదు. కాగా,  మధ్యప్రదేశ్‌‌‌‌లో బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ల మధ్యే హోరాహోరీగా ఎన్నికల సమరం జరుగుతోంది. మధ్యప్రదేశ్‌‌‌‌లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కమల్‌‌‌‌నాథ్ లేదా బీజేపీ విజయం సాధిస్తే శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అవుతారన్నది స్పష్టమైంది. ప్రస్తుతం పోరాటం ఇరు పార్టీల మధ్య సమానంగా ఉండటతో ఖచ్చితంగా ఎవరు గెలుపొందుతారనేది అంచనా వేయడం కష్టం. ఏదేమైనా శివరాజ్ సింగ్ చౌహాన్ లేదా కమల్ నాథ్ తప్ప మరెవరూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కాలేరనేది నిజం.

శివరాజ్ సింగ్ విజయం సాధించగలరా?

 మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌‌‌‌గఢ్ రాష్ట్రాలకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. దీంతో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో రమణ్‌‌‌‌సింగ్‌‌‌‌ను కమలంపార్టీ పక్కన పెట్టింది. అయితే శివరాజ్‌‌‌‌సింగ్ చౌహాన్‌‌‌‌ను వెనక్కి పెట్టేందుకు బీజేపీ హైకమాండ్​ సాహసించలేకపోయింది. ఎందుకంటే సీఎం శివరాజ్​సింగ్ చౌహాన్​ ప్రజల్లో  గొప్ప ఆదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయినప్పుడు బీజేపీ మళ్లీ శివరాజ్ చౌహాన్‌‌‌‌నే ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వ పగ్గాలు ఆయన చేతికిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రజాకర్షణ ఉన్నప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ శివరాజ్ చౌహాన్‌‌‌‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నది. మధ్యప్రదేశ్‌‌‌‌లో బీజేపీ గెలిస్తే చౌహాన్ ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది.

– డా. పెంటపాటి 
పుల్లారావు, పొలిటికల్​ఎనలిస్ట్​