
- ఏడుగురు బీసీలు.. 11 మంది ఓసీలకు చాన్స్
- ఆఫీస్ బేరర్స్ కమిటీని ప్రకటించిన రాంచందర్‌రావు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ కొత్త కమిటీని హైకమాండ్ నియమించింది. కమిటీలోని 22 మంది పేర్లను ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు ప్రకటించారు. ఇందులో ఎవరూ ఊహించని కొత్త వారే ఎక్కువగా ఉన్నారు. ఆఫీస్ బేరర్ కమిటీలో పాత వాళ్లకు ఐదుగురికి అవకాశం లభించింది. కొత్త ఆఫీస్ బేరర్లలో 8 మంది వైస్ ప్రెసిడెంట్లు, ముగ్గురు జనరల్ సెక్రటరీలు, 8 మంది సెక్రటరీలు, ఒక ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఈ కమిటీలో ఆరుగురు మహిళలు ఉండగా, అధ్యక్షుడితో సహా 12 మంది ఓసీలున్నారు.
ఏడుగురు బీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీకి చోటు దక్కింది. బీజేపీ అనుబంధ మోర్చాల్లో రాష్ట్ర అధ్యక్షులుగా పాత వారిలో ఇద్దరికి అవకాశం వచ్చింది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా శిల్పా రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద్ గౌడ్‌కు మరో చాన్స్ లభించింది. ఈ కమిటీలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయ లక్ష్మి, బద్దం బాల్‌రెడ్డి కుమారుడు బద్దం మహిపాల్ రెడ్డికి రాష్ట్ర కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
కమిటీ ఇది..
రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, బండారి శాంతికుమార్, ఎం.జయశ్రీ, కొల్లి మాధవి, కల్యాణ్ నాయక్, రఘునాథ్ రావు, బండ కార్తీక రెడ్డి ఎంపికయ్యారు. జనరల్ సెక్రటరీలుగా ఎన్. గౌతమ్ రావు, టీ వీరేందర్ గౌడ్, వేముల అశోక్ ఉండగా, కోశాధికారిగా దేవకి వాసుదేవ్, జాయింట్ ట్రెజరర్‌గా విజయ్ సురాన జైన్, ముఖ్య అధికార ప్రతినిధిగా ఎన్వీ సుభాష్ నియమితులయ్యారు. సెక్రటరీలుగా ఓ శ్రీనివాస్ రెడ్డి, కొప్పు బాష, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి, శ్రవంతిరెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, తూటుపల్లి రవికుమార్ తదితరులు ఎంపికయ్యారు.
మోర్చాల కొత్త ప్రెసిడెంట్లు..
మహిళా మోర్చా: డాక్టర్ మేకల శిల్పారెడ్డి
యువ మోర్చా: గణేశ్ కుండే
కిసాన్ మోర్చా: బసవపురం లక్ష్మి నరసయ్య
ఎస్సీ మోర్చా: కాంతి కిరణ్
ఎస్టీ మోర్చా: నేనావత్ రవి నాయక్
ఓబీసీ మోర్చా: గంధమల్ల ఆనంద్ గౌడ్
మైనారిటీ మోర్చా: సర్దార్ జగమోహన్ సింగ్
రాష్ట్ర కమిటీనా.. సికింద్రాబాద్ పార్లమెంట్ కమిటీనా?: రాజాసింగ్
తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన కమిటీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర కమిటీనా లేక సికింద్రాబాద్ కమిటీనా అర్థం కావడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్టీ కోసం పనిచేసిన గోషామహల్ కార్యకర్తలను విస్మరించారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘‘బీజేపీ గౌరవాన్ని మూడుసార్లు కాపాడిన గోషామహల్ సెగ్మెంట్ నుంచి రాష్ట్ర కమిటీలో పదవి ఇవ్వడానికి ఒక్క కార్యకర్త కూడా దొరకలేదా?’’ అని ప్రశ్నించారు. ఇంకా ఎన్నేండ్లు బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర కమిటీలో 12 మంది సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఉన్నారని పేర్కొన్నారు.