తెలంగాణలో ఫలించని బీజేపీ కుల అస్త్రం : కంచ ఐలయ్య

తెలంగాణలో ఫలించని బీజేపీ కుల అస్త్రం : కంచ ఐలయ్య

బిహార్  ప్రభుత్వం తమ రాష్ట్రంలోని కులగణన డేటాను విడుదల చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్, బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తున్నవిషయం తెలిసిందే. భారత ప్రజల కులగణన హిందూ సమాజాన్ని విభజిస్తుందనేది వారి స్టాండ్. కానీ, వారు బాగా పాతుకుపోయిన అంచెలవారీ కుల ఆధిపత్య వ్యవస్థ ద్వారా పనిచేస్తున్న హిందూ మతాన్ని వ్యతిరేకించరు. బ్రాహ్మణులు మాత్రమే, అది కూడా పురుషులు మాత్రమే, హిందూ దేవాలయాలలో పూజారులు అవుతారు.  

క్షత్రియులు (రాజపుత్రులు) వ్యవసాయం చేయరు. పశువులను మేపరు. వారికి అది శూద్రుల పనిగా కనిపిస్తుంది.  వైశ్యులు ప్రధానంగా వ్యాపారం చేస్తారు. శూద్రులు ఇప్పటికీ వ్యవసాయం చుట్టూనే తిరుగుతారు. దళితులు మాత్రమే పశువుల తోలు సంబంధిత పనులను నిర్వహించవలసి ఉంటుంది.

ఆర్‌‌ఎస్‌‌ఎస్ ఫిలాసఫీలో పని అనేది ఆరాధన కాదు. పని అనేది శూద్రులు చేసే ప్రక్రియ. ఉత్పాదక పని సనాతన ధర్మంలో భాగం కాదు. దేశాన్ని ఉత్పాదకత ఎలా నిలబెడుతుందో వారి మేధావులు ఎవరూ పరిశీలించలేదు. కుల ఆధిపత్యం శ్రమను అవమానించడంపై ఆధారపడి ఉంటుంది. బిహార్ జనగణన గణాంకాలు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఊహించని రీతిలో ‘భారతదేశంలో పేద కులం, ధనిక కులం’ అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయన్నారు. అందుకే కులగణన ఆలోచనతో తాను ఏకీభవించడం లేదని తెలిపారు. అయితే, ఈ రెండు కులాల భావజాలంలో ఆయన ఓబీసీ కులం ఎక్కడ ఉంది?. మరోవైపు, ఎన్నికలకు వెళ్లిన అన్ని రాష్ట్రాల్లో కుల గణన ప్రాముఖ్యత గురించి రాహుల్ గాంధీ ప్రసంగించారు.

వేదికపై క్యాస్ట్​ డ్రామా

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రధానంగా రెండు కుల ఆధారిత ర్యాలీలను నిర్వహించింది. భారీ ఓబీసీ ర్యాలీలో బీజేపీ అధిష్టానం ఓబీసీ నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తామని ప్రకటించింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు.  అదేవిధంగా బీజేపీ భారీస్థాయిలో మాదిగ కులస్థుల బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కూడా మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదిగలు తెలంగాణలో అతిపెద్ద ఎస్సీ సామాజికవర్గమని, రాష్ట్రంలోనే ఎస్సీ రిజర్వేషన్ కోటాను వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మాదిగల కంటే మాలలు (మహర్‌‌లు లేదా జాతవ్‌‌లకు సమానం) ఎక్కువగా ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్లను తీసుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. ప్రధాన మంత్రి మోదీని బేగంపేట విమానాశ్రయం నుంచి బహిరంగ సభ జరిగిన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వరకు మాదిగ ప్రజలు భారీ ఊరేగింపుగా వేదికపైకి తీసుకొచ్చారు. మోదీ ఆ వేదికపై క్యాస్ట్ డ్రామా ఆడారు.

మాదిగ నాయకుడు మంద కృష్ణ మాదిగ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రధాని మోదీ ఆయనను భుజాన వేసుకుని నువ్వు నా తమ్ముడివి అని పదే పదే చెప్పి ఓదార్చారు. మంద కృష్ణ కుటుంబంలో ఎవరో చనిపోయినట్లు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను ఓదార్చుతున్నట్లుగా వేదికపై కనిపించింది. ఆర్‌‌ఎస్‌‌ఎస్ ప్రచారక్​గా, బీజేపీ నాయకుడిగా మోదీ తన జీవితంలో హిందూ సమాజంలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఇంతవరకు మాట్లాడలేదు.

మాదిగ లోయస్ట్ హోదాను ఎన్నికల ముందు అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నిర్మించలేదు. అదేవిధంగా ఎన్నికల్లో పోరాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిర్మించలేదు.  అంటరానితనం సనాతన వ్యవస్థ ద్వారా నిర్మించబడింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, ప్రధాని మోదీ సనాతన ధర్మానికి బలమైన మద్దతుదారులు.

బీజేపీని విశ్వసించని దళితులు, బీసీలు

మంద కృష్ణ మాదిగ ఇక నుంచి తన నాయకుడని, తను మంద కృష్ణకు అన్నయ్య అని, అనుచరుడిగా ఉంటానని ప్రధాని మోదీ ప్రకటించారు. ‘నా కుటుంబ సభ్యులారా’ అంటూ మాదిగ ప్రజలను పదే పదే మోదీ సంబోధించారు. ఆయన తన కులాన్ని విడిచిపెట్టి మాదిగ అయినట్లుగా ప్రవర్తించారు. అలాంటి స్వీయ మార్పు మంచిదే. తెలుగు టీవీ చానళ్లన్నీ మొత్తం నాటకాన్ని ప్రత్యక్షంగా చూపించాయి.

అయితే, కొత్తగా ఉద్భవించిన ఇద్దరు సోదరులు బహిరంగంగా ప్రదర్శించిన ఈ నాటకం మాదిగల నుంచి కూడా పెద్దగా ఓట్లను పొందలేదు. డిసెంబర్ 5న హిందూ పత్రికలో ప్రచురించిన ఒక విశ్వసనీయ సంస్థ చేసిన సర్వే ప్రకారం, పోల్ అయిన మొత్తం దళిత ఓట్లలో కాంగ్రెస్‌‌కు 38శాతం, బీఆర్ఎస్​కు 41శాతం ఉంటే బీజేపీకి కేవలం 8శాతం మాత్రమే వచ్చాయి.

ఈ ఎనిమిది శాతం మంది మాదిగలకు చెందినవారు కావచ్చు, మాలల నుంచి ఒక్క ఓటు కూడా బీజేపీకి పడి ఉండదు. అదేవిధంగా ఓబీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదన కూడా, సర్వే ప్రకారం ముదిరాజులు 14శాతం, గొల్ల-కురుమలు 12శాతం, గౌడలు 13శాతం, ఇతర ఓబీసీలు 8శాతం బీజేపీకి ఓటు వేశారు. మొత్తం మీద కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది.

మోదీపై మాలల ఆగ్రహం

వాస్తవానికి మాదిగల బహిరంగ సభావేదికపై జరిగిన నాటకాలన్నీ ఓబీసీలకు చాలా కోపం తెప్పించాయి. కులగణనను వ్యతిరేకిస్తూ, కులతత్వం హిందూ సమాజాన్ని విడదీస్తుందని, భారతదేశంలో రెండు కులాలు మాత్రమే ‘పేద కులం, ధనిక కులం’ అని చెప్పిన ప్రధాని అకస్మాత్తుగా తెలంగాణలో మాదిగలు అత్యంత అణగారిన కులానికి చెందినవారని, చారిత్రాత్మక అకృత్యాలను ఆయన అనుభవించినట్లు ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగించింది.

గతంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధిగమించేందుకు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశంపై పని చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తానని ప్రధాని హామీ ఇవ్వడంతో మాలలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. భారతదేశంలో కులం లేదని చెబుతూ, ఓట్ల కోసం ఇలా వేర్వేరు కులాల మీటింగ్‌‌లు పెట్టడం ఎందుకు? దేశ ప్రధాని హోదా ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం గర్హనీయం.

అయితే అదొక్కటే కాదు. మోదీ తన ఇష్టానుసారం ఏదైనా చేయగల ప్రాంతీయ పార్టీ అధినేత కాదు. మోదీ జీవితంలో చాలాకాలం పాటు ఆయనకు శిక్షణ ఇచ్చిన ఆర్ఎస్ఎస్​లో ఓ భాగం. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నాటి సంస్థ.  చాలా కాలంగా జాతీయ రాజకీయ పార్టీలో ఉంటూ మోదీ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు.

బీజేపీ కుల రాజకీయాలు

ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండూ మండల్ ఉద్యమ సమయంలో లేదా అంతకు ముందు రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు, మద్దతు ఇవ్వలేదు. కానీ, 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహాన్ని మార్చారు. ఓబీసీ పీఎం అభ్యర్థిగా మోదీని మోహరించారు. 2014 ఎన్నికలలో కుల సమీకరణ చుట్టూ ఓ క్రమపద్ధతిలో పనిచేశారు. ఇప్పుడు కులగణన హిందూ సమాజాన్ని విభజించిందని అంటున్నారు.

ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌, బీజేపీ, మోదీకి మాదిగ ప్రజానీకంపై అంత ప్రేమ ఉంటే ఎస్సీ  రిజర్వేషన్‌‌ వర్గీకరణ ప్రక్రియను ఎందుకు ప్రారంభించలేదు?. 2013లో ఓబీసీ పీఎం అభ్యర్థిగా మోదీ ఎంపికైన తర్వాత హైదరాబాద్‌‌లో జరిగిన సభలో ప్రసంగించేందుకు వచ్చినప్పుడు మంద కృష్ణ మాదిగ తన సమస్యను పరిష్కరించాలని కలిశారని గుర్తు చేశారు. అదేవిధంగా పలువురు బీసీ నాయకులు తమను సీఎంలను చేయాలని, పార్లమెంట్‌‌, రాష్ట్ర శాసనసభల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయనను కలిశారు. కానీ, గత పదేండ్లలో ఏం జరిగింది?.

 ఈ డ్రామాలన్నింటి కంటే..దేశంలో కులం, అసమానతలు పోవాలని ఆర్‌‌ఎస్‌‌ఎస్ కోరుకుంటే, హిందూ మతం మానవ సమానత్వాన్ని కోరుకుంటే, అది దళితులు, ఓబీసీలకు అర్చక ఉద్యోగాల కోసం శిక్షణ పొందేందుకు అనుమతించాలని బ్రాహ్మణ పూజారి నెట్‌‌వర్క్‌‌లను, సంస్థలను అడగవచ్చు. దీనికి బదులుగా ఓట్ల కోసం ఉపయోగించుకుంటే అది ఏదో ఒక రోజు కుల అంతర్యుద్ధానికి దారి తీస్తుంది. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించే ముందు, హిందూ ఆధ్యాత్మిక సమానత్వాన్ని అనుమతించడానికి మోదీ అన్ని బ్రాహ్మణ సంస్థల సమావేశానికి ఎందుకు పిలుపునివ్వడం లేదనేది శోచనీయం. 

-ప్రొ. కంచ ఐలయ్య 
షెఫర్డ్
రాజకీయ సిద్ధాంతకర్త, సామాజిక కార్యకర్త,
 రచయిత