ఇంట్ల లొల్లి అయితే ఫాంహౌస్‌కు.. బోర్ కొడితే ప్రగతి భవన్​కు

ఇంట్ల లొల్లి అయితే ఫాంహౌస్‌కు.. బోర్ కొడితే ప్రగతి భవన్​కు
  • సీఎం కేసీఆర్ గత ఏడేండ్ల షెడ్యూల్ ఇదే..: బండి సంజయ్
  • ఇన్​స్టాల్​మెంట్‌‌‌‌లో జీతాలిచ్చే స్థితికి రాష్ట్ర ఖజానాను తెచ్చిండు
  • 15వ రోజు ఆందోల్​లో సాగిన బీజేపీ స్టేట్ చీఫ్​ పాదయాత్ర

సంగారెడ్డి, వెలుగు: ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ ​షెడ్యూల్ ​కేవలం ప్రగతి భవన్ ​టు ఫాంహౌజ్.. ఫాం హౌస్‌ టు ప్రగతిభవన్ కే పరిమితమైందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్​విమర్శించారు. కేటీఆర్​తో కొట్లాడి.. ఇంట్ల లొల్లి అయితే ఫాంహౌస్‌కు పోవడం.. అక్కడ బోర్ కొడితే మళ్లీ ప్రగతి భవన్ కు రావడం అలవాటైందన్నారు. ప్రధాని మోడీ 18 గంటలు పని చేస్తుంటే..  సీఎం కేసీఆర్ 4 గంటలు పనిచేసి 18 గంటలు పడుకుంటారని ఎద్దేవా చేశారు. సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 15వ రోజైన శనివారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ ​నియోజకవర్గంలో కొనసాగింది. యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్​వర్గియా, ఆ పార్టీ నేతలు ఈటల రాజేందర్, బాబుమోహన్, ఏనుగు రవీందర్ పాల్గొన్నారు. జోగిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సంజయ్ మాట్లాడారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం ప్రజలు ఉద్యమం చేసి టీఆర్ఎస్​కు అధికారం కట్టబెడితే కేసీఆర్ కుటుంబమే రాజ్యమేలుతోందన్నారు. కేసీఆర్ ​మెడలు వంచి బందీగా ఉన్న తెలంగాణ తల్లిని విముక్తి చేస్తామన్నారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు కుట్ర చేస్తున్నయ్
ఎస్సీ, ఎస్టీలు, చేనేత.. అన్ని కుల వృత్తులను టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగం చేసిందని సంజయ్ మండిపడ్డారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా టైంకు ఇయ్యలేని పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. ఇన్​స్టాల్​మెంట్​పద్ధతిలో జీతాలిచ్చే పరిస్థితికి రాష్ట్ర ఖజానాను తీసుకొచ్చారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్​ఎస్ పార్టీలు ఎప్పటికీ ఒక్కటి కావు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రజలను పక్కదారి పట్టించేందుకు కుట్ర పన్నుతున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్​ను ఎదుర్కొనే దమ్ము.. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా ఒక్క బీజేపీకే ఉంది. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చి గొల్లకొండపై కాషాయ జెండా ఎగరేస్తుంది. రానున్న హుజూరాబాద్ ఉప ఉన్నికలో టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్​ కూడా దక్కదు. అంబేద్కర్​ను అవమానించిన టీఆర్ఎస్, కాంగ్రెస్​లకు అక్కడ మనుగడ లేదు.అంబేద్కర్‌ వర్ధంతి, జయంతిల్లో పాల్గొనక పోవడం చూస్తేనే దళితులపై టీఆర్ఎస్​కు ఉన్న గౌరవం ఏ పాటిదో అర్థమైతుంది’ అని విమర్శించారు.