
రామచంద్రాపురం, వెలుగు: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కేసీఆర్ ఆత్మహత్యల తెలంగాణగా మార్చిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన టీడీపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇతర పార్టీల నాయకులు కొందరు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఈ నెల 27 న ధర్నా చేస్తామని చెప్పారు. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు ఎడ్ల రమేశ్, సంధ్య, పద్మావతి తదితరులను అభినందించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బాబు మోహన్, మాజీ ఎమ్మెల్యేలు నందీశ్వర్ గౌడ్, విజయపాల్ రెడ్డి, జంగం గోపి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సంగప్ప తదితరులు పాల్గొన్నారు.