V6 News

కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి : బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్కులాచారి

కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి : బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్కులాచారి

బాల్కొండ, వెలుగు : కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్​కులాచారి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకే సారి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు కలిపి పెడితే ప్రజాధనం మిగిలేదన్నారు.

 ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎన్నికలకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రోడ్లు, డంపింగ్ యార్డులు, నల్లాలు, వీధి దీపాల నిర్వహణ, పంచాయతీ బిల్డింగులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలలకే సర్పంచ్​ల పదవీ కాలం ముగిసిందని,18 నెలల కాలంలో సెక్రటరీ, సపాయి కార్మికుల జీతాలు ఇయ్యక అప్పులపాలు చేసిందన్నారు.

 అభివృద్ధి కోసం సమిష్టిగా ఏకగ్రీవం చేసిన సర్పంచులకు కండువా కప్పి రూ.20 లక్షల నజరానా ప్రకటించారని అసహనం వ్యక్తం చేశారు. రెండేళ్లు పైసా ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడెలా ఇస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికీ ఏసీడీఎఫ్ నిధులు విడుదల చేయలేదని, గెలిచిన ఎమ్మెల్యేలు అభివృద్ధి ఎలా చేస్తారన్నారు.

 గెలిచిన సర్పంచులకు కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకుంటే ఎలాంటి రాజకీయ లబ్ధి చేకూరదని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ చరిత్రలో ఏనాడు సర్పంచ్ బరిలో నిలపని బీజేపీ మద్దతుదారులను ప్రజల విశ్వాసం కోసం పోటీ చేస్తున్నామని చెప్పారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అరవింద్ ఫ్లై ఓవర్ కోసం రూ.11.50కోట్లు, హైవేల కోసం రూ.150 కోట్లు, జిల్లాకు నవోదయ మంజూరు చేశారని గుర్తు చేశారు. 

ఆదిలాబాద్ నుంచి బాల్కొండ, అర్మూర్ మీదుగా పటాన్ చెరువు వరకు కొత్త రైల్వే లైన్ మంజూరు చేశారని చెప్పారు. ప్రధాని మోదీ అన్ని వర్గాల అభివృద్ధి కోసం సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్, సబ్ కా విశ్వాస్ నినాదంతో ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు.